• facebook
  • whatsapp
  • telegram

  సంస్కరణల బాటలో సైన్యం

* నాంది... మహాదళపతి నియామకం

ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో నలుగుతున్న మహాదళపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌) పదవి ఏర్పాటు విషయంలో మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ముందడుగు వేసింది. ఈ పదవికి సంబంధించి 2001 నుంచి ఉన్న ఆలోచన సాకారమైంది. రక్షణ రంగ పరిపాలన వ్యవస్థలో ‘సీడీఎస్‌’కు అత్యున్నత స్థానాన్ని కట్టబెట్టిన క్రమంలో ఈ పరిణామాన్ని కొంచెం ఆచి తూచి స్వాగతించాల్సిన అవసరముంది. భారత పాలన వ్యవస్థలో ఈ హోదాకు సాధికారతను, తగిన స్థానాన్ని కల్పించడం ఒక విధంగా సవాలే. ‘సీడీఎస్‌’ ఏర్పాటు విషయంలో విభిన్న ప్రతిపాదనలపై ప్రజాక్షేత్రంలో సమగ్ర చర్చలు జరిగాయి. త్రివిధ దళాల సైనిక వ్యవహారాలకు సంబంధించిన ఏ అంశం గురించైనా సంప్రదించేందుకు ఏకగవాక్షం తరహాలో ఈ పదవి ఉపకరిస్తుంది. అంతేకాదు- పౌర ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నేతకు సైనిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చేందుకూ ఈ పదవిని ఉద్దేశించారు. సైనిక దళాల్లో ప్రస్తుతమున్న నాయకత్వానికి పైఅంచెలో, అత్యున్నత అధినేతగా ‘సీడీఎస్‌’ ఉండాలనేది ఒక ప్రతిపాదనైతే, మరికొంతమంది పంచనక్షత్రాల హోదాను ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఇతర ప్రజాస్వామిక దేశాల్లో ఉన్న ఈ తరహా వ్యవస్థల్లో భారత్‌కు సరిపోయేలా ఉండే నమూనాల్ని పరిశీలించారు. పలురకాల వ్యవస్థల్ని, నమూనాల్ని పరిశీలించిన తరవాత, చివరికి పూర్తిగా భారతీయ నమూనానే ఎంచుకున్నారు. జాతీయ భద్రతపై మోదీ సర్కారు దృక్పథం ఆధారంగా ఈ నమూనాను తీర్చిదిద్దడం జరిగింది.

‘త్రివిధ దళాలకు సంబంధించిన వ్యవహారాలపై రక్షణమంత్రికి సీడీఎస్‌ ముఖ్య సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు. త్రివిధ దళాధిపతులు తమ విభాగాలకు సంబంధించిన అంశాలపై ఇకమీదట కూడా రక్షణ మంత్రికి సలహాలు ఇస్తారు’ అని మహాదళపతి నియామకంపై విడుదలైన అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. ఈ లెక్కన చూస్తే- ‘సీడీఎస్‌’ రక్షణ మంత్రికి ముఖ్య సలహాదారే కానీ, ఒకే ఒక సలహాదారు కాదన్న సంగతి స్పష్టమవుతోంది. అంతేకాదు, చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ (సీఓఎస్‌సీ) శాశ్వత ఛైౖర్మన్‌గా, రక్షణ శాఖలో ఏర్పాటు చేసిన మిలిటరీ వ్యవహారాల విభాగం (డీఎంఏ) అధినేతగా, ఆ విభాగం కార్యదర్శిగానూ వ్యవహరిస్తారు. ‘సీడీఎస్‌’కు త్రివిధ దళాల్లోని ఒక దళాధిపతికి ఇచ్చే స్థాయిలో జీతభత్యాలు ఇస్తారు. ప్రొటోకాల్‌ ప్రకారం త్రివిధ దళాధిపతులకన్నా మహాదళపతి ఉన్నత స్థానంలో ఉంటారు. త్రివిధ దళాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంయుక్త ప్రణాళిక ద్వారా సేకరణ, శిక్షణ, సిబ్బంది తదితర అంశాల్లో ఉమ్మడితత్వాన్ని ప్రోత్సహించడం ‘సీడీఎస్‌’ బాధ్యత. ఆపరేషన్లలో సంయుక్త పద్ధతిని ఆచరణలోకి తెస్తూ, వనరుల్ని గరిష్ఠంగా ఉపయోగించుకునేలా మార్పులు తేవడం, సంయుక్త కమాండ్ల ఏర్పాటు, అన్ని దళాలు దేశీయ ఉపకరణాలే ఉపయోగించేలా ప్రోత్సహించడం వంటివీ మహాదళపతే పర్యవేక్షించాలి. ‘సీడీఎస్‌’ నేతృత్వంలో మిలిటరీ వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటు చేయడం స్వతంత్ర భారత పౌర-సైనిక సంబంధాల్లో అత్యంత ముఖ్యమైన, గణనీయమైన తొలి అడుగుగా భావించవచ్చు. సీడీఎస్‌కు డీఎంఏ కార్యదర్శి హోదాతో సాధికారత కల్పించడం- చరిత్రలో తొలిసారిగా భారతీయ మిలిటరీకి అధికారికంగా పాలన వ్యవస్థలో చోటు ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారత రక్షణ విభాగం బాధ్యతల్ని రక్షణశాఖ కార్యదర్శి నిర్వర్తిస్తున్నారు. ఆ శాఖలో సీనియర్‌ సివిల్‌ ఉద్యోగి రక్షణ కార్యదర్శే. మరి- సీడీఎస్‌ను పాలన వ్యవస్థలో ఎలా ఇముడ్చుతారనేది చూడాలి.

సీడీఎస్‌కు అప్పగించిన ముఖ్యమైన లక్ష్యాల్ని సాధించడం కీలకం కానుంది. ఆ లక్ష్యాలు అత్యంత ముఖ్యమైనవే కాకుండా, భారతీయ మిలిటరీ వ్యవస్థను సమూలంగా మార్చివేయగలిగేవే. 1999 కార్గిల్‌ యుద్ధం తరవాత భారత సైనిక వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించాలన్న సిఫార్సుల మేరకు అవసరమైన మార్పులు తీసుకురావడం తక్షణావసరం. అత్యున్నత స్థాయి వృత్తి నిబద్ధతను సుసాధ్యం చేయాల్సి ఉంది. సీడీఎస్‌ ప్రభావాన్ని నిర్ధరించే మరో కీలక అంశం... మానవ, ఆర్థిక వనరుల కేటాయింపు. సిబ్బంది, మిలిటరీ, పౌర నిపుణులను ఎలా కలుపుతారనేది మానవ వనరులకు సంబంధించిన ఆసక్తికర అంశం. వార్షిక బడ్జెట్‌లో సాయుధ బలాలకు కేటాయించే ఆర్థిక వనరులూ కీలకమే. భారత అత్యున్నత స్థాయి రక్షణ నిర్వహణకు సంబంధించి దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న సంస్కరణలకు సారథ్యం వహించేలా, అవసరమైన వృత్తి అనుభవాన్ని అందించే కీలక లక్ష్యం ‘సీడీఎస్‌’ ముందుంది. రాజకీయ నాయకత్వం, ఉన్నతస్థాయి ఉద్యోగులతో కూడిన భాగస్వామ్య వ్యవస్థ డీఎంఏ, సీడీఎస్‌లను ఎలా తీర్చిదిద్దుతారనేది ఆసక్తికరం. రాబోయే దశాబ్దాలలో భారత సంయుక్త సైనిక సామర్థ్యాన్ని తీర్చిదిద్దడంలో ఇవే కీలకంగా మారనున్నాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన తరహాలో, ప్రధాని మోదీ రక్షణ రంగంలో భారీ మార్పులు తీసుకురాగలరా అనేది వేచి చూడాల్సిన అంశం.

- సి.ఉదయ్‌భాస్కర్‌
(రచయిత- రక్షణ రంగ నిపుణులు)

Posted Date: 20-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం