• facebook
  • whatsapp
  • telegram

సౌహార్దమే సందేశం...

ఐక్యతే పండగల పరమార్థం

లోకమాన్య బాలగంగాధర తిలక్‌ సుమారు 125 ఏళ్ల కిందట 1897 సెప్టెంబరులో దేశద్రోహం ఆరోపణపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 124(ఎ) కింద విచారణ ఎదుర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారంటూ తిలక్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆయనకు 18 నెలల జైలుశిక్ష విధించింది. అసలు ఆయన చేసిన నేరమేమిటి? ఓ ప్రాంతీయ భాషా వారపత్రిక ‘కేసరి’కి యజమాని, నిర్వాహకుడు, ముద్రణకర్త, ప్రచురణకర్తగా ఉన్న తిలక్‌ 1897 జూన్‌లో రెండు ‘ఆక్షేపణీయ’ వ్యాసాలు ప్రచురించారు. అదే ఆయన తప్పిదంగా నాటి పాలకులు తేల్చారు. అందులో ఒకటి ‘శివాజీ పలుకులు’ పేరిట ముద్రించిన పద్యం, రెండోది ఛత్రపతి శివాజీ పట్టాభిషేక సంస్మరణ సందర్భంగా 1897 జూన్‌ 12నాటి మహోత్సవాలపై కథనం. శివాజీ పట్టాభిషేక సంస్మరణ మహోత్సవాల గురించి వివరించినంత మాత్రాన బ్రిటిష్‌వారు దాన్ని తమకు ముప్పుగా ఎందుకు భావించాల్సి వచ్చింది? 1890 దశకం తొలిరోజుల నుంచి గణేశ్‌ చతుర్థి, శివాజీ పట్టాభిషేక సంస్మరణ మహోత్సవాలను సమాజంలోని అన్నివర్గాల భాగస్వామ్యంతో తిలక్‌ వైభవంగా నిర్వహిస్తూ ఉండటమే దానికి కారణం. ఆ వేడుకల్లో భాగంగా బహిరంగ చర్చలు, కవితా పఠనం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. అవి ప్రజల్లో ఐక్యతను పెంచడానికి తోడ్పడతాయని తిలక్‌ భావించేవారు. గర్వకారణమైన మన సంస్కృతి, వారసత్వం గురించి తెలుసుకోవడంద్వారా ప్రజల్లో దేశభక్తి భావన పెంపొందుతుందని ఆయన విశ్వసించేవారు. అందుకే శివాజీ పట్టాభిషేక సంస్మరణ ఉత్సవాలపై తిలక్‌ వ్యాఖ్యానంతో ‘కేసరి’ పత్రికలో ప్రచురించిన వ్యాసం బ్రిటిష్‌ వారికి ‘ఆక్షేపణీయం’గా అనిపించింది.

గత వైభవ పునరుద్ధరణ

పండగల సందర్భంగా కలిసికట్టుగా వేడుకలు చేసుకుంటే- అన్ని వర్గాల ప్రజలూ పరస్పరం మమేకమవుతారు. దేశాన్ని ఐక్యంగా నిలిపే పండగలను మనం విస్మరించకూడదు. బ్రిటిష్‌ వలస పాలననుంచి దేశాన్ని విముక్తం చేయడానికి మన ముందు తరాలు చేసిన అసమాన పోరాటాలు, అనుసరించిన విధానాలు, చేసిన త్యాగాలను స్మరించుకోవడంలో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ పండగల్లో అధిక శాతం ప్రాంతీయ ప్రాధాన్యం కలిగినవే అయినా- అవి ఇచ్చే సందేశం మాత్రం జాతీయ అంతర్జాతీయ సౌహార్దతకు సంబంధించింది. పండగల సందర్భంగా వేడుకల నిర్వహణకు వేదికలు అవసరం. ఈ విషయంలో దేవాలయాలు, ధార్మిక క్షేత్రాల పాత్ర ఎనలేనిది. మన పండగలకు విశేష ప్రాచుర్యం కల్పించేందుకు తగిన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని, నదులను, ధార్మిక ప్రదేశాల గత వైభవాన్ని పునరుద్ధరించుకొని, పర్యాటకులకు అదనపు ఆకర్షణలు అందుబాటులోకి తేవాలి. తూర్పుభారతం చిట్టచివరన పరశురామ కుండం, పశ్చిమాన సోమనాథ్‌ ఆలయ పరిధిలో సౌకర్యాల మెరుగుదల వంటివి ఆ దిశగా చేపట్టిన చర్యల్లో కొన్ని. కేదార్‌నాథ్‌ ఆలయ పరిధిలో జగద్గురు ఆది శంకరాచార్య సమాధి సందర్శనను ప్రారంభించడం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి తొలిదశ పనులు పూర్తిచేయడం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అయోధ్యలో అత్యంత సుందరంగా నిర్మితమవుతున్న రామాలయం, కశ్మీర్‌లోని హజ్రత్‌బల్‌ మసీదు, హైదరాబాద్‌లోని హయాత్‌ బక్షీ మసీదులలో సౌకర్యాల కల్పన వంటివీ కీలకమైనవే. ఉత్తర్‌ప్రదేశ్‌ కుశీనగర్‌లో బుద్ధ భగవానుడి పుణ్యస్థలం, పట్నాసాహిబ్‌లో గురు గోవింద్‌ సింగ్‌ జన్మస్థలం అభివృద్ధి... గోవా, ఇతర చర్చిల అభివృద్ధి వంటి కార్యక్రమాలద్వారా భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడమే ప్రభుత్వ లక్ష్యం. అవి అభివృద్ధి చెందిన తరవాత భక్తుల ఆధ్యాత్మిక అనుభవాలను మరింత సుసంపన్నం చేస్తాయి. ఆ విధంగా వారు పండగలను మరింత గొప్పగా, ఉత్సాహంగా నిర్వహించుకోగలుగుతారు.

స్ఫూర్తినిచ్చిన తిలక్‌

స్వతంత్ర భారత 75వ సంవత్సరాన్ని ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట నిర్వహించుకుంటున్నాం. దాన్ని గత విజయాల వేడుకగా మాత్రమే కాకుండా 2047లో భారత స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలకు ఒక నమూనాగా రూపొందించే అవకాశంగానూ ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఆ మేరకు 1890 దశకంలో లోకమాన్య తిలక్‌ బాటలో 2023 ఆగస్టు 15 వరకు అనేక కార్యక్రమాలు, సంస్మరణోత్సవాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. వాటన్నింటిలోనూ ప్రజలను భాగస్వాములను చేసి, వారిలో దేశభక్తి భావనను పెంపొందించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఘనంగా చాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆనాడు ఉమ్మడి శత్రువును తరిమికొట్టాలన్న ఆశయం తిలక్‌ను ముందుకు నడిపించింది. అలాగే ప్రధాని మోదీ నేతృత్వంలో ఐకమత్యంతో ‘ఏక్‌ భారత్‌ - శ్రేష్ఠ్‌ భారత్‌’ (ఒకే భారతం- శ్రేష్ఠ భారతం) స్వప్నం సాకారం చేసుకునే దిశగా దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం నేటి అవసరం. పండగల సందర్భంగా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, దేశ సమగ్రత, సమైక్యతలను పరిరక్షించుకొందాం. మౌలిక వసతుల కల్పనతో కూడిన సమగ్ర అభివృద్ధికి పునరంకితమవుదాం. ఐక్యంగా ముందడుగు వేస్తూ, మన పండగల వెనక పరమార్థాన్ని గ్రహించి, వాటిని నిర్వహించుకుందాం.

సుసంపన్న వారసత్వం

మనం నిర్వహించుకొంటున్న మకర సంక్రాంతి వంటి సామాజిక, ఆధ్యాత్మిక పండగలు మనకెంతో ముఖ్యమైనవి. మకర సంక్రాంతి పండగను ‘ఉత్తరాయణం, పొంగల్‌, ఘుఘుతి, పౌష్‌ సంక్రాంతి, సుగ్గి హబ్బా, మాఘి సంక్రాంతి, మాఘ్‌ బిహు, కిచ్‌డీ పర్వ్‌...’ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. ఆయా ప్రాంతాలను అనుసరించి వివిధ రూపాల్లో వేడుకలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంతాల్లో బాలలు వలస పక్షులకు ఆహ్వానం పలుకుతారు. పిండి, బెల్లంతో చేసిన రొట్టెలను కాకులకు పెడతారు. గుజరాతీలు ఊంధియూ వంటకంతో విందు చేసుకుంటారు. గాలిపటాలతో ఆకాశం రంగులీనుతూ కనువిందు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ ముంగిళ్లను రంగవల్లులతో అలంకరిస్తారు. ఇంటింటికీ వచ్చే గంగిరెద్దులవారికి దానధర్మాలు చేస్తారు. సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు వేరైనా- మకర సంక్రాంతి ఇచ్చే సందేశం, ప్రజల మధ్య వెల్లివిరిసే ప్రేమాభిమానాలు, ఆనందోత్సాహాలు ఒకే విధంగా ఉంటాయి. ఈద్‌, క్రిస్మస్‌ వంటి పండగలను, అవి ప్రబోధించే సార్వత్రిక విలువలను భారతీయుల్లో అధికశాతం సమభావంతో ఆదరిస్తున్నారు. మన భౌగోళిక వైవిధ్యానికి, సుసంపన్న వారసత్వానికి ఇది తిరుగులేని నిదర్శనం.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం