• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ బాటలో సత్వర న్యాయం



భారతదేశ నేర న్యాయ చట్టాల సంస్కరణకు గత నెలలో పార్లమెంటు మూడు బిల్లులను ఆమోదించింది. ఏడేళ్లు, అంతకు మించి జైలుశిక్షకు అర్హమైన కేసుల ఎలెక్ట్రానిక్‌ రికార్డులు, వీడియో, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలను విధిగా భద్రపరచాలని కొత్త బిల్లులు నిర్దేశిస్తున్నాయి. 


బ్రిటిష్‌ వలస పాలన నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ), భారతీయ సాక్ష్యాధారాల చట్టాలకు బదులు కొత్త బిల్లులను కేంద్రం తెచ్చింది. వాటిని భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎస్‌ఏ)లుగా వ్యవహరిస్తున్నారు. అవి 2024 చివరికల్లా దశలవారీగా చట్టాలుగా అమలులోకి వస్తాయి. నేర రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరచడం వీటిలో కీలకాంశం. పోలీసులు దండ ప్రయోగంపై కన్నా డేటా (సమాచారం) మీదనే ఎక్కువగా ఆధారపడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల డీజీపీ, ఐజీపీల సమావేశంలో పిలుపిచ్చారు. దాంతో నేరాల డేటాతో క్లౌడ్‌ సర్వర్‌ సృష్టి యత్నాలు మొదలయ్యాయి. కేంద్ర హోం శాఖ ఈ సర్వర్‌ ఏర్పాటుకు పోలీసు పరిశోధన-అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌ అండ్‌ డీ) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సంఘాన్ని నియమించింది. బీపీఆర్‌ అండ్‌ డీ డైరెక్టర్‌ జనరల్‌ అధ్యక్షుడిగా వ్యవహరించే ఈ సంఘంలో కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎలెక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), సైబర్‌ భద్రతా సంస్థ సెర్టిన్‌ల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ సంఘం ఏర్పాటు చేసే క్లౌడ్‌ సర్వర్‌లో అన్ని న్యాయస్థానాల రికార్డులు, ప్రాథమిక అభియోగ పత్రాలు (ఎఫ్‌.ఐ.ఆర్‌.), చార్జిషీట్లు, వేలిముద్రలను నిల్వచేస్తారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ సమాచార నిధిలో డిజిటల్‌ రూపంలో ఉండే డేటాను అన్ని పోలీసు స్టేషన్లు, కోర్టులు ఉపయోగించుకోగలుగుతాయి.


సత్వర సమాచారం

ప్రస్తుతం డిజిటల్‌ రూపంలోని నేరగాళ్ల ఫొటోలు, వారి నేర చరిత్ర, వేలిముద్రలు, నేర స్థలంలో ఫోరెన్సిక్‌ సాక్ష్యాలు పోలీసు దర్యాప్తునకు కీలక సాధనాలవుతున్నాయి. వీటికి తోడు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల కార్యకలాపాలు, సీసీ టీవీ కెమెరా దృశ్యాలు, సెల్‌ఫోన్‌ రికార్డులను దర్యాప్తులో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటన్నింటి ద్వారా నేడు అపార డిజిటల్‌ సమాచారం ఉత్పన్నమవుతోంది. ఒకప్పుడు పోలీసు స్టేషన్లలో, కోర్టుల్లో దస్త్రాలుగా పేరుకుపోయిన నేర రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరచాల్సిన అవసరం తోసుకొచ్చింది. ఈ డిజిటల్‌ రికార్డులను అన్ని దర్యాప్తు, విచారణ సంస్థలకు అందుబాటులోకి తీసుకురావడానికి క్లౌడ్‌ సర్వర్‌ ఉపకరిస్తుంది. న్యాయస్థానాలకు కేసులను ఎలెక్ట్రానిక్‌ రూపంలో సమర్పించడం ఇప్పటికే కొన్ని జిల్లా కోర్టులు, హైకోర్టుల్లో మొదలైంది. హైకోర్టుల్లో ఇంటర్నెట్‌ సదుపాయం, వ్యాజ్యదారులకు, న్యాయవాదులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ హైకోర్టూ న్యాయవాదులకు దృశ్య-శ్రవణ మాధ్యమ విచారణ వెసులుబాటును నిరాకరించకూడదనీ సూచించింది. కేసుల ఈ-ఫైలింగ్‌ వల్ల కాగిత రహిత న్యాయవ్యవస్థ రూపుదిద్దుకొంటుంది. సంబంధిత డిజిటల్‌ రికార్డులను వేగంగా పంచుకోవడం వీలవుతుంది. డిజిటల్‌ సాక్ష్యాధారాల నమోదు, నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తే వ్యక్తులకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని క్షణాల్లో కనుగొనవచ్చు. న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగావకాశాల పరిశీలనకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక ప్రత్యేక సంఘాన్ని నెలకొల్పింది.


విచారణల ప్రత్యక్ష ప్రసారం

భారత్‌లో 2006లో ఈ-కోర్టులు ఉనికిలోకి వచ్చినా, కొవిడ్‌ కాలంలోనే అవి ఊపందుకొన్నాయి. న్యాయవ్యవస్థ డిజిటలీకరణా వేగం పుంజుకొంది. 2022 ఏప్రిల్‌ నాటికి భారతీయ హైకోర్టులు, జిల్లా కోర్టులు 1.92 కోట్ల కేసుల్లో వర్చువల్‌ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు. ట్రాఫిక్‌ కేసులు, కాంట్రాక్టు ఉల్లంఘనల వంటి చిన్న కేసులతో పాటు మొత్తం 1.78 కోట్ల కేసులను ఈ పద్ధతిలో పరిష్కరించారు. ఈ విధానంలో కక్షిదారులు, లాయర్లు కోర్టుకు వచ్చే అవసరం లేకుండా దృశ్య-శ్రవణ మాధ్యమ విధానంలో కేసులు విచారించవచ్చు. 2017లో కృష్ణవేణి నాగం వెర్సస్‌ హరీశ్‌ నాగం కేసులో సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైవాహిక కేసుల విచారణకు పచ్చజెండా ఊపింది. విచారణ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాలకు (లైవ్‌ స్ట్రీమింగ్‌) పలు హైకోర్టులు అనుమతిస్తున్నాయి. పోలీసు శాఖలు సైతం ఇప్పటికే నేరస్థులు, నేరాలపై ఆరాకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పరచాయి. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్స్‌, స్మార్ట్‌ సెన్సర్ల వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. ఇలా కోర్టులు, పోలీసు విభాగాల ద్వారా ఉత్పన్నమవుతున్న అపార ఎలెక్ట్రానిక్‌ సమాచార రాశిని స్వదేశీ క్లౌడ్‌ సర్వర్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా శాంతిభద్రతల రక్షణ, సత్వర న్యాయ సాధనలో భారత్‌ మరింత పురోగమిస్తుంది.


- ఆర్య
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాల్దీవులతో పెరుగుతున్న అంతరం

‣ రాజ్యాంగమే రక్షణ ఛత్రం

‣ అడుగంటుతున్న జలాశయాలు

‣ స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్‌

‣ భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం