• facebook
  • whatsapp
  • telegram

బహుళ ప్రయోజనాల మైత్రీబంధం

మధ్య ఆసియాతో భారత్‌ అడుగులు

మధ్య ఆసియాతో ఇండియా సంబంధాలు బలోపేతమవుతున్నాయి. ఆ ప్రాంత దేశాలైన తుర్క్‌మెనిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, కజకిస్థాన్‌లతో వాణిజ్య, రవాణా, సాంస్కృతిక బంధాలను పటిష్ఠం చేసుకునేందుకు ఇండియా కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రస్తుత అఫ్గానిస్థాన్‌ పరిణామాలు ఊపునిస్తున్నాయి. తాలిబన్ల పాలనలోని అఫ్గాన్‌- ఉగ్రమూకలకు అడ్డాగా మారకుండా మధ్య ఆసియాతో కలిసి పనిచేయాలని మోదీ సర్కారు యోచిస్తోంది. ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ఇటీవలి సమావేశంలో ఆ మేరకు కీలక చర్చలు జరిగాయి. పరస్పరం వాణిజ్య, రవాణా అనుసంధానతను పెంచుకోవాలని నేతలు తీర్మానించారు. రాబోయే భారత గణతంత్ర వేడుకలకు ఆ అయిదు దేశాల అధ్యక్షులు అతిథులుగా విచ్చేయనుండటం శుభపరిణామం.

కలిసివచ్చే అండ

ఆసియా, ఐరోపాను కలుపుకొని ‘యూరేసియా’గా ప్రముఖమైన ప్రాంతానికి హృదయ స్థానంలో మధ్య ఆసియా దేశాలున్నాయి. వాటిని ‘కార్‌’ (సెంట్రల్‌ ఆసియా రిపబ్లిక్‌) దేశాలుగానూ వ్యవహరిస్తారు. వాటితో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి భారత్‌ మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. 2012లో ‘కనెక్ట్‌ సెంట్రల్‌ ఆసియా’ విధానాన్ని తీసుకొచ్చాక పరిస్థితులు ఆశాజనకంగా మారాయి. రాజకీయ, భద్రత, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడ్డాయి. ప్రధాని మోదీ పలు సందర్భాల్లో మధ్య ఆసియాను సందర్శించారు. కార్‌ దేశాల్లో ప్రాజెక్టుల కోసం 2020లో భారతదేశం సమారు 100 కోట్ల డాలర్ల రుణాలను ప్రకటించింది. రష్యా, చైనా, టర్కీ, ఇరాన్‌లతో పోలిస్తే మధ్య ఆసియాలో భారత్‌ ప్రభావం చాలా స్వల్పం. ‘కార్‌’ దేశాలతో ఇండియా వాణిజ్య బంధం విలువ కేవలం 200 కోట్ల డాలర్లు. అందులోనూ కజక్‌ నుంచి చమురు దిగుమతుల వాటాదే సింహభాగం. చైనాతో మధ్య ఆసియా వాణిజ్యం విలువ అంతకు ఎన్నో రెట్లు అధికం. ఈ పరిస్థితుల్లో అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఇండియా, మధ్య ఆసియా సంబంధాలు త్వరితగతిన బలపడటానికి దారులు తెరుచుకున్నాయి. అఫ్గాన్‌ నుంచి ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు అటు కార్‌ దేశాలకు, ఇటు భారత్‌కు విస్తరించే ముప్పుంది. అందుకే ఉభయపక్షాలు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ విషయంలో కార్‌ దేశాల వైఖరి ఇండియా విధానానికి సన్నిహితంగా ఉంది. దాంతో భారత్‌, కార్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు గత నెలలో సమావేశమై అఫ్గాన్‌ సంక్షోభంపై చర్చించారు. తాజాగా విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ దానిపై సమాలోచనలు జరిపారు.

ఇంధన అవసరాల కోసం ఇండియా ప్రస్తుతం పశ్చిమాసియాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అక్కడి అస్థిరతల కారణంగా చమురు ధరల్లో అసాధారణ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియాకు మధ్య ఆసియా మంచి ప్రత్యామ్నాయం. కార్‌ దేశాల్లో చమురు, సహజవాయువు, యురేనియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అక్కడి నుంచి తక్కువ ధరకు ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు భారత్‌ చర్యలు చేపట్టాలి. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలోనూ ‘కార్‌’ అండ ఇండియాకు కలిసివస్తుంది. ‘కార్‌’ దేశాల ఆర్థిక వ్యవస్థలు తరచూ ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. వాణిజ్య బంధం రూపంలో తమపై చైనా పట్టు బిగిస్తుండటమూ వాటికి ఆందోళన కలిగిస్తోంది. ఐటీ, అంతరిక్షం, ఆటొమోటివ్‌, ఔషధ రంగాల్లో ఇండియాతో సంబంధాలు బలోపేతమైతే ‘కార్‌’కు ప్రయోజనకరమవుతుంది. భారత సహకారంతో రక్షణ ఉత్పత్తుల కర్మాగారాలను ఏర్పాటుచేసేందుకు ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌ ఆసక్తి చూపుతున్నాయి. ‘కార్‌’ ప్రభుత్వాలపై రష్యా ప్రభావమూ అధికమే. అఫ్గాన్‌ నుంచి నిష్క్రమణ తరవాత మధ్య ఆసియాలో అడుగుపెట్టాలని అమెరికా తలపోస్తోంది. అదే జరిగితే ఆ ప్రాంతంపై పట్టుకు రసవత్తర పోరు మొదలైనట్లే!

అనుసంధానతే అసలు సవాలు

‘కార్‌’ దేశాలు భూ పరివేష్ఠితమైనవి. వాటితో భారత్‌కు సరిహద్దులు లేవు. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా నడవా(ఐఎన్‌ఎస్‌టీసీ), తుర్క్‌మెనిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌-ఇండియా (టీఏపీఐ) గ్యాస్‌ పైప్‌లైన్‌ వంటి ప్రాజెక్టులతో ఇండియాకు వాటితో అనుసంధానత మెరుగుపడుతుందని భావించారు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, భద్రతాపరమైన ఆటంకాల కారణంగా ఆ ప్రాజెక్టుల్లో అంతగా పురోగతి కనిపించడంలేదు. ఈ వాతావరణంలో ఉభయపక్షాలకు ఇరాన్‌ ఆశాజనకమవుతోంది! అక్కడి చాబహార్‌ ఓడరేవు ద్వారా అనుసంధానతను పెంచుకోవాలని భారత్‌, కార్‌ దేశాలు యోచిస్తున్నాయి. ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, అఫ్గాన్‌ తాలిబన్ల వశమవడం వంటి పరిణామాలు చాబహార్‌ పోర్టు అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయి. వాటిని దౌత్యనీతితో భారత్‌ అధిగమించాలి. ఐఎన్‌ఎస్‌టీసీతో చాబహార్‌ను అనుసంధానించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. అది సాకారమైతే పాక్‌, అఫ్గాన్‌ల అవసరం లేకుండానే మధ్య ఆసియాకు నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఇండియా, ‘కార్‌’ దేశాల సంబంధాల్లో నవోదయానికి తెరతీసినట్లవుతుంది!

- మండ నవీన్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

‣ గగనతల రక్షణలో కొత్త అధ్యాయం

‣ వనరుల పరిరక్షణ ప్రాణావసరం

‣ అసమానతల భారతం

‣ చేనేతకు మరణశాసనం

Posted Date: 31-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం