• facebook
  • whatsapp
  • telegram

స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భరోసా

రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా...
 

బ్రిటిష్‌ వలస పాలన నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న తరవాత భారతదేశం 1949 నవంబరు 26న సగర్వంగా సొంత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకుంది. స్వతంత్ర భారతావనికి పటిష్ఠ పునాది వేసిన ఆ చారిత్రక ఘట్టానికి నేడు 71వ వార్షికోత్సవం జరుపుకొంటున్నాం. రాజ్యాంగ రచనా ప్రక్రియలో డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, సుచేతా కృపలానీ, సరోజినీ నాయుడు, బీఎన్‌ రావు, పండిట్‌ గోవింద వల్లభ్‌ పంత్‌, శరత్‌చంద్ర బోస్‌, రాజగోపాలాచారి, గోపాలస్వామి అయ్యంగార్‌, డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, గోపీనాథ్‌ బార్డొలోయ్‌, జేబీ కృపలానీ వంటి మహామహులు చురుగ్గా పాలుపంచుకున్నారు. ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి, విస్తృతంగా చర్చలు జరిపిన మీదట భారత రాజ్యాంగాన్ని ఖరారు చేశారు. రాజ్యాంగ రచనా సంఘం రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో 141సార్లు చర్చలు, సమావేశాలు జరిపి మరీ రాజ్యాంగ పీఠికకు, 395 అధికరణలూ ఎనిమిది షెడ్యూళ్లకు తుది రూపునిచ్చింది.
 

కాలరేఖపై పురోగమనం
గత 71 ఏళ్లలో భారత రాజ్యాంగం అనేక మార్పుచేర్పులకు లోనై, 400కుపైగా అధికరణలు, 12 షెడ్యూళ్లకు విస్తరించింది. కాలంతో మారుతున్న పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి కావలసిన సవరణలను చేసుకున్నది. దీనివల్ల మన ప్రభుత్వ పాలన పరిధి ఎంతో విస్తరించింది. కాలం విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి మన రాజ్యాంగం వెన్నూదన్నూ ఇస్తోంది. అది ఏర్పరచిన పటిష్ఠ పునాదుల మీద భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో తనదైన విశిష్ట స్థానాన్ని సముపార్జించుకుంది. భారత రాజ్యాంగ లక్ష్యం- ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అందించడమే. జాతి ఆశయాలను శాంతియుతంగా, ప్రజాస్వామికంగా అందుకోవాలనే నిబద్ధత మన రాజ్యాంగంలో ప్రతిఫలిస్తోంది. భారత రాజ్యాంగం కేవలం ఓ చట్టపరమైన పత్రం కాదు. సమాజంలో అన్ని వర్గాల హక్కులకు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భరోసా ఇచ్చే ముఖ్యమైన సాధనం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా దుర్విచక్షణలకు ఆస్కారం ఇవ్వకుండా పౌరులందరికీ సమానత్వం ప్రసాదిస్తోంది. తద్వారా ప్రగతి పథంలో భారతదేశం వడివడిగా దూసుకెళ్లడానికి పునాది వేసింది. దార్శనికులైన మన రాజ్యాంగ నిర్మాతలకు భారత జాతీయవాదం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. గడచిన ఏడు దశాబ్దాల్లో మనం ఎన్నో మైలురాళ్లు దాటాం. గత ఏడు దశాబ్దాల్లో 17సార్లు లోక్‌సభ ఎన్నికలను, 300కుపైగా శాసనసభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించి ప్రపంచంలో అతి పెద్ద, విజయవంతమైన ప్రజాస్వామ్యంగా మన్ననలు పొందాం. కోట్లమంది ఓటర్లు పాల్గొనే ఎన్నికలను అస్థిరతకు, అరాచకానికి తావులేకుండా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ, భారత ప్రజాస్వామ్యం తన పరిణతిని చాటుకొంటోంది. రాజకీయ అధికారం శాంతియుతంగా ప్రజాస్వామికంగా చేతులు మారగలదని పదేపదే నిరూపిస్తోంది. శాసన, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగ విశిష్ట లక్షణం. ఒక వ్యవస్థ అధికారాల పరిధిలోకి మరో వ్యవస్థ చొరబడే వీలులేదని రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సర్వోన్నతమే కానీ, దానికి కూడా రాజ్యాంగ పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంటు పని చేస్తోంది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్నా, దాని మౌలిక స్వరూప స్వభావాలను మార్చడానికి మాత్రం వీల్లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 100కు పైగా సవరణలు జరిగినా, దాని మౌలిక స్ఫూర్తి చెక్కుచెదరలేదు.
 

భారత రాజ్యాంగం పౌరుల ప్రయోజనాలకు అగ్రాసనం వేసింది. రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 35వ అధికరణ వరకు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లేఖించారు. ఇవి అందరికీ సమానంగా వర్తిస్తూ, జాతి ఐక్యతకు ప్రాతిపదికగా నిలుస్తున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలినాళ్లలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి. తరవాత 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటి నుంచి ఆస్తి హక్కును వేరుచేసి, చట్టపరమైన హక్కుగా గుర్తించారు. ఏతావతా నేడు మన రాజ్యాంగం ఆరు ప్రాథమిక హక్కులకు భరోసా ఇస్తోంది. అవి- సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడి నుంచి రక్షణ పొందే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిష్కారాలు కోరే హక్కు. ప్రజల మధ్య సాంస్కృతికంగా భేదాలు ఉన్నా అందరికీ సమాన హక్కులు కల్పించడం ద్వారా రాజ్యాంగం జాతి ఐక్యతకు గట్టి పునాది వేసింది. ఈ హక్కుల రక్షణే మన రాజ్యాంగానికి ప్రధాన స్ఫూర్తి.
 

హక్కుల వెన్నంటి బాధ్యతలు
భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులతోపాటు ప్రాథమిక విధులూ బాధ్యతలూ ఉన్నాయని ఉద్ఘాటిస్తోంది. రాజ్యాంగం తొలి ప్రతి కేవలం ప్రాథమిక హక్కులను కల్పించినా, తరవాత పౌరులకు ప్రాథమిక బాధ్యతలూ ఉండాలని దేశ నాయకత్వం భావించింది. తదనుగుణంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. నేడు రాజ్యాంగంలోని 51 (ఏ) అధికరణలో 11 ప్రాథమిక విధులను పొందుపరచారు. వీటిలో పదింటిని 42వ చట్టం ద్వారా చేర్చారు. 11వ ప్రాథమిక విధిని 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. హక్కులను వెన్నంటి బాధ్యతలూ ఉంటాయని పౌరులు గ్రహించాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛలను అనుభవిస్తూనే, ప్రజాస్వామ్యబద్ధులై జీవించాలి. సంబంధిత ప్రమాణాలను పాటించాలని భావించిన దేశ నాయకత్వం ఆమేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచింది. 21వ శతాబ్దిని భారతీయ శతాబ్దిగా మార్చాలంటే పౌరులంతా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణాయుతంగా తమ విధులను నెరవేర్చాలి. అలాచేస్తేనే ఆత్మనిర్భర భారత్‌, నవ భారత నిర్మాణాలు సుసాధ్యమవుతాయి. ప్రజలు, ముఖ్యంగా యువతీయువకులు తమ ప్రవర్తనలో, దైనందిన కార్యకలాపాల్లో ఈ స్పృహను ప్రతిబింబింపజేయాలి.
 

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 71 ఏళ్లయ్యాయి. ఈ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు వందన సమర్పణ చేస్తూ- రాజ్యాంగ సూత్రాలకు, విలువలకు బద్ధులమై నడచుకొంటామని ప్రజలంతా ప్రతినబూనాలి. శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాల పునాదిపై ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌’ నిర్మాణానికి నిబద్ధతతో నడుం బిగించాలి. నిజం చెప్పాలంటే నేడు భారత పౌరులు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను అనుభవించడంకన్నా ప్రాథమిక విధులను నెరవేర్చేందుకే అధిక  ప్రాధాన్యమివ్వాలి. మన హక్కులకు ఢోకా లేదు. అవి నిరంతరం మనతోనే ఉంటాయి. అదే సమయంలో మనమంతా దేశం పట్ల మన విధులను, బాధ్యతలను నెరవేర్చాలి. చిత్తశుద్ధి, నిబద్ధతలతో మనం ఈ పని చేస్తే, 21వ శతాబ్దం భారతావనిది కావడం ఖాయం.

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం