• facebook
  • whatsapp
  • telegram

ఏవీ ఆనాటి ప్రమాణాలు?

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో సభాపతి అంటే- సచ్ఛీల విలువలకు వన్నెలద్దుతూ సంప్రదాయాలను మన్నిస్తూ భిన్న వాదనల వేదికను నియమబద్ధంగా నడిపే సమవర్తి. జనస్వామ్యాన్ని జేగీయమానం చేయడంలో కీలక భూమిక పోషించే సభాపతుల సదస్సుకు శతవార్షికోత్సవ సందర్భమిది. రాజ్యాంగ దినోత్సవ వేడుకతో ముడివడి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతా ప్రతిమ స్ఫూర్తి ఛాయలో జరిగిన ఎనభయ్యో సదస్సు- కొవిడ్‌ సంక్షోభ వేళా క్రమం తప్పక సాగి తన విలక్షణత చాటుకొంది. చట్టసభల్లో చర్చలు ప్రజల ఆకాంక్షలకు అద్దంపడతాయంటున్నా సభా కార్యక్రమాలను సాఫీగా అంతరాయాలు లేకుండా నిర్వహించడం ఎట్లాగన్నదే దశాబ్దాలుగా పెను ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు శీతకాల సమావేశాల్లో (నవంబరు 27న) శూన్యగంటలో మొత్తం 20 ప్రశ్నలకూ సమాధానాలు రాబట్టడం 1972 దరిమిలా అదే తొలిసారి అని లోక్‌సభాపతి ఓం బిర్లా డెహ్రాడూన్‌ భేటీలో ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కొలువుతీరిన రాజ్యాంగంలోని పదో షెడ్యూలుపైనా, సభాపతుల అధికారాల మీదా నిరుడు నియమించిన కమిటీ నివేదికతోపాటు- ‘శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య సుహృద్భావ సహకారం’ ఈ ఏడాది ప్రధాన చర్చనీయాంశమవుతుందని అజెండానూ నిర్దేశించారు. చట్టసభలకు మరింత జవాబుదారీతనం మప్పేందుకు సభాపతులు ప్రతినబూనడం ద్వారా రాజ్యాంగ విలువల మేరకు వాటిని పటిష్ఠీకరించి సశక్తం చేయాలనడంలో మరోమాట లేదు. ‘కేవైసీ’కి కొత్త అన్వయంతో ‘నీ రాజ్యాంగం తెలుసుకో’మంటూ ఆ పవిత్ర పొత్తాన్ని పౌరులకు చేరువ చెయ్యాలని ప్రధాని ఉద్బోధిస్తున్నా- ఆ రాజ్యాంగ నియమాలకు చట్టసభల సభ్యులు, సభాపతులు నిష్ఠగా నిబద్ధమైతేనే మెజారిటీ సమస్యలు కనుమరుగవుతాయనడంలో సందేహం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రతీకలుగా సభాపతి స్థానాన్ని తీర్చిదిద్దడమే నేటి సవాలు!
 

‘స్పీకర్‌ సభకే కాదు, సభా స్వాతంత్య్రానికి దాని ఔన్నత్యానికి ప్రాతినిధ్యం వహిస్తారు... దేశానికే సభ ప్రాతినిధ్యం వహిస్తుంది గనుక ఆ దృక్కోణంలో జాతి స్వాతంత్య్రానికే స్పీకర్‌ ప్రతీకగా నిలుస్తారు... కాబట్టి ఆ స్థానం గౌరవనీయమైనదిగా ఉండాలి’- 1948లో విఠల్‌ భాయ్‌ పటేల్‌ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ తొలి ప్రధాని నెహ్రూ చేసిన వ్యాఖ్యలవి. 1925లో లెజిస్లేటివ్‌ అసెంబ్లీ అధ్యక్ష స్థానానికి ఎంపికైన విఠల్‌ భాయ్‌ బ్రిటన్‌లోని ‘హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’ సంప్రదాయాన్ని పాటించి స్వరాజ్‌ పార్టీ సభ్యత్వాన్ని వదులుకొన్నారు. ఆ తరవాతా సభాపతులుగా ఎన్నికైన పలువురూ అదే ఒరవడికి కట్టుబడి సత్‌ ప్రమాణాలకు ఎత్తుపీట వేశారు. ఒక్కసారి స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తాను ఆ పదవిలో కొనసాగాలనుకొన్నంతకాలం అందుకు దోహదపడేలా పార్టీలేవీ పోటీ పెట్టకపోవడం బ్రిటన్‌లో సంప్రదాయంగా స్థిరపడిందంటూ నిష్పాక్షికతకు అదే ఊపిరిపోస్తుందని తొలి సభాపతి మవులంకర్‌ ఆనాడే స్పష్టీకరించారు. 1951, ’53నాటి సభాపతుల సదస్సులు బ్రిటిష్‌ సంప్రదాయాన్ని అనుసరించాలని సిఫార్సు చేసినా- 1954నాటి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆ ప్రతిపాదనల్ని తోసిపుచ్చింది. 1967నాటి సభాపతుల సదస్సు ఏర్పాటు చేసిన వీఎస్‌ పేజ్‌ కమిటీ- తాను ప్రాతినిధ్యం వహించే పార్టీతో స్పీకర్లు అన్ని బంధాలూ తెంచుకోవాలని సూచించింది. స్పీకర్లు తమ ‘తటస్థత’ను కాపాడుకోవాలని, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలనీ 2001నాటి సదస్సు సిఫార్సు చేసింది. ఝార్ఖండ్‌ స్పీకర్‌గా నాంధారి 2003లో ఫిరాయింపుదారుల నేతగా మారి ముఖ్యమంత్రి రేసులో ముందుకురకడానికి తన రాజ్యాంగ పదవినే అడ్డగోలుగా ఉపయోగించుకొన్న వైనం తెలిసిందే. ఫిరాయింపులపై నిర్ణయాధికారం సభాపతుల ప్రతిష్ఠకు రాజకీయ గ్రహణం పట్టిస్తున్నదే. ఇప్పటికి పాతికదాకా కమిటీలు వేసి నివేదికలు రాబట్టిన సదస్సు, వాటిలో ఎన్నింటి అమలుకు సమకట్టింది? రాజ్యాంగ ఆదర్శాల్ని నిలబెట్టే కార్యాచరణతోనే కదా- సభాపతి స్థానాల విలువ పెరిగేది!
 

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం