• facebook
  • whatsapp
  • telegram

నాగా చర్చల్లో పురోగతి!

ఒడంబడికపైనే ఊగిసలాట

దశాబ్దాలకుపైగా నలుగుతున్న నాగాల ఉద్యమానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా? కేంద్రం-నాగా వేర్పాటువాద వర్గాల మధ్య చర్చలు సానుకూల ఫలితాలనిచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఇవి సమాధానం దొరకని ప్రశ్నలే. ఇండో-నాగా శాంతి ఒప్పందానికి సంధానకర్తగా ఉన్న ఆర్‌.ఎన్‌.రవిని 2019 జులై 20న నాగాలాండ్‌ రాష్ట్ర గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తరవాత 2019 ఆగస్టు 5న కశ్మీర్‌లో 370, 35-ఏ అధికరణలు రద్దయ్యాయి. ఈ రెండు చర్యలు నాగాలను ఆలోచనలో పడేశాయనడంలో సందేహం లేదు. తమకు ప్రత్యేక రాజ్యాంగం, జెండా ఏర్పాటుకు భారత ప్రభుత్వం అంగీకరించదనే విషయం వారికి అర్థమైంది. 2020 డిసెంబర్‌ 1న జరిగిన సమావేశంలో ఆయా డిమాండ్లు నెరవేరే అవకాశమే లేదని ఆర్‌.ఎన్‌.రవి సైతం తేల్చిచెప్పారు.

నాగా అంశంపై మొదటినుంచీ ప్రభుత్వాలన్నీ చర్చలు జరుపుతూనే వచ్చాయి. గతంలో పలుమార్లు చోటుచేసుకున్న చర్చలు పెద్దగా ఫలితమివ్వలేదు. లండన్‌, పారిస్‌, ఒసాకా, బ్యాంకాక్‌ నగరాల వేదికగా నాగా నాయకులతో జరిగిన శాంతి చర్చలు అర్ధాంతరంగానే ముగిశాయి. ఇండో-నాగాల మధ్య కుదిరిన అక్బర్‌ హైదరీ ఒప్పందం (1947), 16 అంశాల ఒప్పందం (1960), షిల్లాంగ్‌ ఒప్పందం (1975) వంటివీ సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి. ఈ ఒప్పందాలు అమలు కాకపోవడానికి ప్రధాన వేర్పాటు సంస్థ అయిన నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం)లో నాయకత్వ లోపమూ ఓ కారణమే. ప్రతి ఒప్పందంలోనూ నాగాలకు తక్కువ రాజకీయ హక్కులు కల్పించడంతో ఇవి అమలుకు నోచుకోలేకపోయినట్లు తెలుస్తోంది.

మెట్టుదిగిన ఇరుపక్షాలు

కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టులో ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐఎం) వర్గంతో విధివిధానాలకు సంబంధించిన ముసాయిదా ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఎస్‌సీఎన్‌(ఐఎం) నాయకుడు మూయివాను చర్చలకు ఒప్పించడంలో కేంద్రం సఫలమైంది. చర్చల్లో నాగా ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం వంటి అంశాలపైనా ఓ అవగాహన నెలకొంది. జెండా విషయంలో ఉభయపక్షాలూ ఓ మెట్టు దిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నాగా జెండాను ఉపయోగించరు. దాన్ని నాగాల సాంస్కృతిక కార్యకలాపాల్లో వాడుకోవచ్చు. ప్రత్యేక రాజ్యాంగంపై ప్రస్తుతానికి వేర్పాటువాద సంస్థలు పట్టుపట్టడం లేదు. దీంతో చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు నాగాలాండ్‌ తరవాత నాగాలు అధికంగా నివసించే పొరుగు రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. ఒప్పందం వల్ల తమ భూభాగం నాగాలాండ్‌కు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన మణిపూర్‌ వాసుల్లో నెలకొంది. అలాంటి భయాందోళనలు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భాగస్వామ్య పక్షాలైన మిగతా రాష్ట్రాలతో మాట్లాడకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రకటించింది. పొరుగు రాష్ట్రాల్లోని నాగాలు నివసించే ప్రాంతాల్లో, వారి ఆచార వ్యవహారాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడం; నాగా ప్రాంతాలకు ప్రత్యేక విద్యాసంస్థలు, అభివృద్ధి పనుల మంజూరు, నిషేధిత నాగా సైన్యాన్ని సాయుధ బలగాల్లోకి చేర్చుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదే అడ్డంకి!

ప్రత్యేక జెండా, రాజ్యాంగం లేనిదే తుది ఒప్పందంపై సంతకం చేసేది లేదని 2020 అక్టోబర్‌ 16న ఇచ్చిన ఓ ముఖాముఖిలో ఎన్‌ఎస్‌సీఎన్‌ నాయకుడు ముయివా తేల్చిచెప్పారు. దీంతో ఎన్‌ఎస్‌సీఎన్‌ను తప్పించి మిగతా వేర్పాటువాద సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక జెండా, రాజ్యాంగం అంశాలు లేకుండా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ఇతర వేర్పాటువాద నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారందరికీ నాగా నేషనల్‌ పొలిటికల్‌ గ్రూప్‌ (ఎన్‌ఎన్‌పీజీ) ఓ వేదికలా మారింది. పలు నాగా గ్రూపులతో పాటు మాజీ తిరుగుబాటుదారులు, ఎన్‌ఎస్‌సీఎన్‌ నుంచి విడిపోయిన నేతలకు ఇది వేదికగా నిలుస్తోంది.

ఎన్‌ఎస్‌సీఎన్‌ను పక్కకు తప్పిస్తే, ఆ సంస్థకు చెందిన వేర్పాటువాదులు మళ్లీ ఆయుధాలు చేపట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇలాంటి పరిణామం శ్రేయస్కరం కాదు. ఈశాన్య భారత్‌లో వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చేందుకు చైనా ఎప్పటినుంచో వేచి చూస్తోంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రశాంతంగా ఒప్పందం చేసుకోవడమే భారత్‌ ముందున్న ప్రధాన సవాలు. అలాగని ప్రత్యేక జెండాకు అంగీకారం తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే- కశ్మీర్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సైతం ఇంతకుముందు ప్రత్యేక జెండా కావాలని ఉద్యమించాయి. ఇలాంటి అవకాశం నాగాలకు ఇస్తే మరిన్ని ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉంది. నాగా సమస్యకు అన్ని పక్షాలకూ ఆమోదయోగ్యమైన రీతిలో నిర్దిష్ట పరిష్కారాలు గుర్తిస్తేనే ఈశాన్య భారత్‌లో శాంతి పవనాలు వీచే అవకాశం ఉంది.

- కుమార్‌ సంజయ్‌ సింగ్‌
(చరిత్ర విభాగంలో సహాయ ఆచార్యులు, శ్రద్ధానంద కళాశాల, దిల్లీ విశ్వవిద్యాలయం)

 

Posted Date: 16-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం