• facebook
  • whatsapp
  • telegram

ప్రైవేటీకరణపై తగని అత్యుత్సాహం

లాభార్జనకన్నా ప్రజాశ్రేయం మిన్న

ప్రైవేటు రంగ సంస్థలు తమ సంస్థాపకులకు, వాటాదారులకు లాభాలు ఆర్జించిపెట్టడమే పరమావధిగా వ్యాపారం చేస్తుంటాయి. అదే ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌ఈ) అన్ని వర్గాల ప్రజలకు సరిసమానంగా సేవలు అందించడమే పరమార్థంగా కార్యకలాపాలు సాగిస్తాయి. ప్రైవేటుది లాభార్జన దృష్టి అయితే, ప్రభుత్వ రంగానిది సామాజిక సంక్షేమ దృక్పథం. ప్రైవేటు కంపెనీలు తమ యజమానులకు జవాబు చెప్పుకోవాలి. పీఎస్‌ఈలు ప్రభుత్వానికీ, నియంత్రణ సంస్థలకు, చట్టసభలకు జవాబుదారీగా వ్యవహరించాలి. అవి ‘కాగ్‌’, సీబీఐ, కేంద్ర విజిలెన్స్‌ విభాగం వంటి సంస్థల డేగ కళ్ల కింద పనిచేయాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక వికాసంలో ప్రైవేటు కంపెనీల పాత్ర గణనీయమే కానీ, వాటి కోసం పీఎస్‌ఈలను బలిపెట్టడం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. మారిన కాలానికి ప్రైవేటు రంగమే తారకమంత్రమని అధికార వర్గాలు వినిపిస్తున్న వాదన లోపభూయిష్ఠమైనది. దశాబ్దాల క్రితం స్వావలంబన మంత్రాన్ని జపించిన భారతదేశం నేడు ఆత్మనిర్భరతను ప్రవచిస్తోంది. రెండింటి అర్థం ఒకటే అయినా, గడచిన ప్రభుత్వాల హయాములో సోషలిస్టు భావజాలానికి అగ్రాసనం వేస్తే, ఇప్పుడు పెట్టుబడిదారీ పంథాకు పట్టం కడుతున్నారు. అందుకే నేడు ‘ఈ దేశంలో పీఎస్‌ఈలు అస్తమించకతప్పదు’, ‘ప్రభుత్వం పని పరిపాలించడమే తప్ప వ్యాపారం చేయడం కాదు’ అనే సూత్రీకరణలు వినబడుతున్నాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, పాలకులు తరాలపాటు శ్రమించి విలువైన ఆస్తులు కూడగట్టి భావి తరాలకు భద్రమైన భవిష్యత్తు అందించాలని తపన పడిన సంగతిని ఈ సందర్భంలో విస్మరిస్తున్నారు. రాజకీయ పార్టీలు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రజల ఆస్తులు అమ్మి వారికి రకరకాల తాయిలాలు ఇస్తున్నాయి తప్ప జాతి భవిష్యత్తుకు బలీయ పునాదులు వేయాలనీ, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని తపించడం లేదు. దశాబ్దాలుగా కష్టించి నిర్మించిన పీఎస్‌ఈలను అప్పనంగా ప్రైవేటుకు అమ్మివేస్తున్నారు.

లక్షలమందికి ఉపాధి

టెలికం సర్వీసు ప్రొవైడర్ల (టీఎస్పీ)నుంచి రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలను తక్షణం వసూలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ప్రభుత్వం టీఎస్పీలు పదేళ్ల వ్యవధిలో దఫాలవారీగా బకాయిలు చెల్లించవచ్చని ఎంతో ఉదారంగా సెలవిచ్చింది. తీరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు పడిన రూ.1.75 లక్షల కోట్ల బొర్రెను పూడ్చుకోవాలని పీఎస్‌ఈలను తెగనమ్మడానికి సిద్ధపడుతోంది. దీనికోసం భావితరాల భవిష్యత్తును గాలికి వదిలేస్తోంది. కొన్ని పీఎస్‌ఈలు నష్టాల్లో ఉన్నప్పటికీ అత్యధిక పీఎస్‌ఈలు ప్రభుత్వ ఖజానాకు తమ లాభాలు జమచేస్తున్నాయి. పన్నుల రూపంలో మరింత ఆదాయం సమకూరుస్తున్నాయి. ఈ పీఎస్‌ఈలపై వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆధారపడి పని చేస్తూ లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వ రంగంలోని రైళ్లు, విమానాలు లాభాపేక్ష లేకుండా పనిచేసి లక్షలమందిని సొంత ఊర్లకు చేర్చాయి. వరదలు, తుపానులు, భూకంపాల వంటి విపత్తులు విరుచుకుపడినప్పుడు  ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ అమూల్యమైన సేవలు అందించి ఆపన్నులను ఆదుకొంటోంది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన కొత్తలో ప్రైవేటు ఆస్పత్రులు తాళాలు వేసుకోగా, జనాలకు చికిత్స అందించింది ప్రభుత్వ ఆస్పత్రులేనని మరువకూడదు. పెద్ద నోట్ల రద్దు రోజుల్లో మన పొరుగున ఉన్న కిరాణా దుకాణాల వారు అరువు మీద సరకులు ఇచ్చి అండగా నిలబడ్డారనీ విస్మరించకూడదు.

‘విశాఖ’పై ఉక్కుపాదం!

నాలుగు దశాబ్దాల క్రితం భారతదేశ సముద్ర తీరంలో వెలసిన ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు ప్లాంట్‌. అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే కాదు, అది మన ప్రాంతానికి ఆర్థిక చోదక శక్తి, తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల గుండె చప్పుడు కూడా. 22,000 ఎకరాలలో విస్తరించిన ఈ కర్మాగార స్థలంలో 8000 ఎకరాలలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన 9000 నివాసాలు ఉన్నాయి. ఇంతటి అపురూపమైన పీఎస్‌ఈని ప్రైవేటుపరం చేయడం, అందునా విదేశీ కంపెనీలకు అప్పగించడం దారుణాతిదారుణం. విశాఖ ఉక్కు ప్లాంట్‌ నిర్మాణం కోసం స్థలాలను ఇచ్చి నిర్వాసితులైన 8000 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం లభించలేదు. ఉక్కు ప్లాంటు చేతులు మారితే 80,000 మంది శాశ్వత, తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగులు, అనుబంధ సంస్థల భవిష్యత్తు అగమ్యమవుతుంది.

ప్రభుత్వ రంగ సంస్థను తుదముట్టించేముందు, అది తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని ప్రచారం చేయడం పరిపాటి అయిపోయింది. 1966-76 మధ్య కాలంలో ఒక వెలుగు వెలిగిన హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ కథ ఇలానే ముగియడం విశాఖవాసులకు ఇప్పటికీ గుర్తుంది. ఈ సంస్థలో 45శాతం వాటాలను ప్రభుత్వం 2002-03లో స్టెరిలైట్‌ సంస్థకు రూ.769 కోట్లకే విక్రయించింది. తరవాత వేదాంతగా రూపాంతరం చెందిన ఆ కంపెనీ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయంటూ 2012లో ఉత్పత్తిని నిలిపివేసింది. 2013లో పూర్తిగా మూసివేసింది. కంపెనీ ప్రాంగణంలోని భవంతులు, ఇతర నిర్మాణాలను బుల్‌డోజర్‌తో కూల్చివేశారు. వేల సంఖ్యలో కార్మికులు వీధిన పడ్డారు. కంపెనీకి ఉన్న 400 ఎకరాల స్థలం విలువ కాలక్రమంలో అనూహ్యంగా పెరిగిపోయింది. ఏదైనా కుటుంబ ఆస్తిని విక్రయించేముందు కుటుంబ సభ్యులంతా కలసి కూర్చుని నిర్ణయం తీసుకుంటారు. జాతి సంపదను పరుల పరం చేసేముందు మాత్రం అందరినీ సంప్రదించాలన్న మాటే తలెత్తకుండా జాగ్రత్తపడతున్నారు.

ఏకపక్ష నిర్ణయాలు

ప్రస్తుతం ప్రైవేటు గుత్త సంస్థల తీరుపై సర్వతా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికాలో ఆపిల్‌ సంస్థ నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నానాపాట్లు పడుతోంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల నుంచి పన్నుల రూపంలో ఆదాయం రాబట్టడానికి ఐరోపా దేశాలు సతమతమవుతున్నాయి. భారతదేశానికీ కెయిర్న్‌ ఎనర్జీ, వోడాఫోన్‌ సంస్థలకూ మధ్య పన్ను సంబంధ వ్యాజ్యాలు నడుస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఎన్నో తంటాలు పడుతోంది. ప్రైవేటు కంపెనీలు నిపుణ సిబ్బందినీ, పెట్టుబడులనూ తీసుకొస్తాయన్నది ఒట్టి భ్రమ. అవి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పెట్టుబడులు పెడతాయి. తరవాత నష్టాలు వచ్చాయంటూ బాకీలు కట్టడం మానేస్తాయి. అవన్నీ పారు బాకీలుగా మారిపోతాయి. బ్యాంకులు లక్షల కోట్ల పారుబాకీలను మాఫీ చేశాయంటే, ప్రైవేటు కంపెనీల సమర్థత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కంపెనీలు కార్పొరేట్‌ పన్నులను ఎగవేస్తున్నందున భారత్‌ ఏటా పెద్దయెత్తున పన్నుల ఆదాయం కోల్పోతోంది. జీఎస్టీ విషయంలోనూ అలానే జరుగుతోంది. యువ భారతానికి నిపుణుల కొరత లేదు. అసంఖ్యాకంగా ఉన్న యువతీయువకులను సమర్థ నిర్వాహకులుగా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం హేతుబద్ధ నిర్ణయాలతో ముందుకు రావాలి.

- ఎం.ఆర్‌.పట్నాయక్‌
( బీఎస్‌ఎన్‌ఎల్‌, విశాఖ రీజియన్‌ రిటైర్డ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌)

Posted Date: 10-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం