• facebook
  • whatsapp
  • telegram

రహదారిపై కదన భేరి

పౌర, సైనిక మౌలిక సౌకర్యాల అనుసంధానత

రహదారులు, రైళ్లు, ఉపగ్రహాలను బహుళ ప్రయోజనకరంగా ఉపయోగించుకొనే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి పౌర మౌలిక సదుపాయాల్ని సైనిక కార్యకలాపాలకూ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. చాలాకాలంగా అధికార వర్గాల చర్చల్లో ఈ అంశం నలుగుతున్నా, ఆచరణాత్మక దిశగా అడుగులు పడే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఇందుకోసం పౌర మౌలిక సదుపాయాలను సైనిక పోరాట అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. రహదారులపై నుంచే యుద్ధవిమానాలు గాలిలోకి ఎగరడం, అత్యవసరంగా దిగడం, సైన్యానికి చెందిన భారీ పరికరాలు, ఉపకరణాలను సైతం రైళ్లలో తరలించడం, ఉపగ్రహాలు సైతం సైనిక లక్ష్యాలకూ తోడ్పడటం... వంటివన్నీ ఈ విధానంలో భాగం కానున్నాయి.

ఇలాంటి ప్రక్రియకు 2015లోనే పునాది పడింది. 2015 మే 21న, మిరాజ్‌-2000 యుద్ధవిమానాన్ని యమునా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై దించారు. హైవేలపై యుద్ధ విమానాలు దిగడానికి, ఎగిరేందుకు  వెసులుబాటు ఉందా లేదా అనే విషయంలో సాధ్యాసాధ్యాలను పరీక్షించారు. యుద్ధ సమయంలో ఇలాంటి సౌకర్యం తప్పకుండా మన శక్తిని ఇనుమడింప చేస్తుందనడంలో సందేహం లేదు. ఆ తరవాత 2017 నవంబర్‌లో మూడు మిరాజ్‌-2000 విమానాలు, మూడు సుఖోయ్‌ యుద్ధ విమానాలు ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై సురక్షితంగా దిగాయి. 2017 అక్టోబర్‌ 24వ తేదీన భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన పూర్తిస్థాయి వైమానికశ్రేణి ఆరు వరసల ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై దిగింది. అందులో మూడు జాగ్వార్లు, పన్నెండు అత్యున్నత స్థాయి బహుళ వినియోగ మిరాజ్‌-2000 విమానాలు, ఓ సుఖోయ్‌-30, సీ-130జే సూపర్‌ హెర్కులెస్‌ ఎయిర్‌లిఫ్టర్‌ ఉన్నాయి. రహదారిపై మూడు కిలోమీటర్ల పరిధిలో యుద్ధ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో నైపుణ్యం, సామర్థ్య ప్రదర్శన కసరత్తు నిర్వహించాయి. యుద్ధ సమయంలో సైన్యానికి చెందిన విమానాలను సాధారణ విమానాశ్రయాల్లో దింపడం కష్టమవుతుంది. ప్రత్యర్థి గురి ఎప్పుడూ అలాంటి రద్దీ విమానాశ్రయాలపైనే ఉంటుంది. అందుకే ఈ తరహా సరికొత్త ఎయిర్‌ స్ట్రిప్స్‌తో ఎంతో ఉపయోగం ఉంటుందని సైన్యం భావిస్తోంది. నిజానికి ఈ తరహా పౌర మౌలిక వసతులను సైనిక అవసరాలకు ఉపయోగించుకునే విషయంలో భారత్‌ కొంత వెనకంజలోనే ఉంది. పలు పాశ్చాత్య దేశాలు తమ జాతీయ రహదారులను విమానాలు దిగేందుకు ప్రత్యామ్నాయ సౌకర్యాలుగా ఉపయోగించడం సాధారణమే. చైనా, పాకిస్థాన్‌ చాలా సంవత్సరాల క్రితమే తమ యుద్ధ విమానాలను రహదారులపై దింపాయి. పాకిస్థాన్‌ విషయమే తీసుకొంటే- పొరుగు దేశం 17 సంవత్సరాల ముందే ఇస్లామాబాద్‌-లాహోర్‌ రహదారిపై యుద్ధ విమానాల్ని విజయవంతంగా దింపి పరీక్షించింది.  

పౌర మౌలిక వసతులను బహుళార్థ సాధకంగా ఉపయోగించుకునే అంశంపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించినట్లు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇటీవల వివేకానంద ఇండియా ఫౌండేషన్‌లో చేసిన ప్రసంగంలో సూచనప్రాయంగా వెల్లడించారు. ‘మౌలిక వసతులను పౌర సేవలతోపాటు సైనిక అవసరాలకు కలిపి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. పౌర విమానయాన, సైనిక విమానాశ్రయాలను అనుసంధానించే విషయాన్ని పరిశీలించాలి. దీనివల్ల వైమానిక భద్రత ఇనుమడిస్తుంది. గగనతల నిర్వహణ, యుద్ధ సహకార సామర్థ్యం మెరుగు పడతాయి. రిమోట్‌ సెన్సింగ్‌, సమాచారం, నేవిగేషన్‌ కోసం ఉపయోగించే ఉపగ్రహాలను సైనిక అవసరాలకు సైతం తోడ్పడేలా తీర్చిదిద్దాల్సి ఉంది. రైల్వే వ్యాగన్లను, ట్రక్కుల వెనకుండే భాగాలను రెండు రకాల రవాణా అవసరాలకు ఉపయోగపడేలా తయారు చేయాలి. అవి భారీ సైనిక పరికరాలు, యుద్ధ వాహనాలను సైతం రవాణా చేసే రీతిలో రూపొందించాలి’ అని బిపిన్‌ రావత్‌ సూచించారు. ‘సరిహద్దు రాష్ట్రాల్లో సాయుధ దళాలు సైతం వినియోగించుకొనే రీతిలో- కమ్యూనికేషన్‌ టవర్లు, రైలు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వెంబడి విద్యుత్‌ రంగ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనీ అభిప్రాయపడ్డారు. ‘చమురు, ఇంధనం, నిత్యావసర సరకులు, ఆయుధ సరఫరా వంటివాటి నిల్వ, గిడ్డంగుల సౌకర్యాల విషయంలో పౌర, సైనిక అనుసంధానత జరగాలి’ అన్నది రావత్‌ సూచనల సారాంశం. భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో ఇలాంటి యత్నాలు భారీ మార్పులకు నాంది పలుకుతాయి.

- సంజీవ్‌ బారువా
 

Posted Date: 20-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం