• facebook
  • whatsapp
  • telegram

ఫలితాలనివ్వని ప్రణాళికలు

వాస్తవిక దృక్పథంతోనే పట్టణాల పురోగతి

నగరాలు, పట్టణాల అభివృద్ధిలో పట్టణ ప్రణాళికలే అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. శాస్త్రీయమైన, వాస్తవిక దృక్పథంతో కూడిన అభివృద్ధి ప్రణాళికలే పురోగతికి బాటలు పరుస్తాయి. పట్టణ ప్రణాళికా విధానంలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ విధానం బ్రిటిష్‌ పట్టణ ప్రణాళికా చట్టాల నుంచి సంక్రమించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన పట్టణ ప్రణాళికా వ్యూహాలు, విధానాలలో చెప్పుకోదగిన మార్పులేమీ చోటు చేసుకోలేదు. ప్రపంచీకరణ, మార్కెటింగ్‌ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో నగరాల ప్రాథమ్యాలు మారాయి. అన్ని దేశాలకు నగరాలే ఆదాయ వనరులుగా, ఆర్థిక చోదక శక్తులుగా అవతరించాయి. ఆర్థికాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి కల్పన నేటి నగరాల ముఖ్య లక్షణాలు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన జరగక పోవడం, అస్తవ్యస్త విస్తరణ మన నగర ప్రణాళికల్లోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. నగరాలు, పట్టణాల అభివృద్ధి- సమ్మిళితంగా, సుస్థిర ఆర్థికవృద్ధి దిశగా సాగాలి. ఆ మేరకు పట్టణ ప్రణాళికల రూపకల్పన ఉండాలి. ప్రస్తుతం అమలులో ఉన్నది 20 సంవత్సరాలకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళిక. అది ప్రధానంగా భూవినియోగం జోనింగ్‌ నిబంధనలు, అభివృద్ధి కార్యకలాపాల నియంత్రణకే పరిమితమైంది. మాస్టర్‌ప్లాన్‌ చట్టబద్ధమైన ప్రణాళిక పత్రం కావడంతో అందులోని అంశాలను పరిస్థితులకు అనుగుణంగా సవరించే అవకాశం తక్కువే.

సుదీర్ఘ ప్రయాణం...

మామూలుగా, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన ప్రక్రియకు సుదీర్ఘ సమయం పడుతుంది. దిల్లీ, ముంబయి నగరాల మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి పదేళ్లు పట్టింది. 1975 తరవాత తిరిగి 2010లో హైదరాబాద్‌ నగర అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. వరంగల్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియ 2013 నుంచి కొనసాగుతోంది. అభివృద్ధి ప్రణాళికల మధ్య సుదీర్ఘ విరామం నగరాల పురోగతికి అవరోధంగా పరిగణమిస్తోంది. ప్రణాళికలు లేని నగరాలు అస్తవ్యస్తంగా విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా, ఇలాంటి పరిస్థితి భూ ఆక్రమణదారులకు, అక్రమ లే-అవుట్లకు, అవినీతి అధికారులకు సదవకాశంగా పరిణమిస్తోంది. మాస్టర్‌ ప్లాన్‌ విధానంలో ప్రధానమైన లోపం- రవాణా సౌకర్యాలకు సంబంధించిన ప్రణాళికలను భూవినియోగ ప్రణాళికతో సమీకృతం చేయకపోవడం. భూవినియోగ ప్రణాళిక, రవాణా ప్రణాళిక రూపకల్పన ఒకేతాటిపై జరగాలి. రెండింటి మధ్య అనులోమ సంబంధం ఉంది. రవాణా మార్గాలు భూవినియోగంలో మార్పు తెస్తే, భూవినియోగం రవాణా నెట్‌వర్క్‌ డిమాండ్‌ను పెంచుతూ ఆయా ప్రాంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. సమీకృత రవాణా భూవినియోగ ప్రణాళిక అనేది నగరాల ప్రణాళిక వ్యూహంలో కీలకమైన అంశం. ప్రస్తుత పట్టణ ప్రణాళికల్లో అల్పాదాయ వర్గాల ప్రయోజనాలకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. ఇలాంటి అంశాలపైనా దృష్టిసారించాల్సి ఉంటుంది. మాస్టర్‌ ప్లాన్‌లోని జోనింగ్‌ నిబంధనలు ఇలాంటి వర్గాల ప్రజలకు స్థలాల కేటాయింపు, ఆవాసాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనను విస్మరిస్తున్నాయి. ఈ తరహా వర్గాల అవసరాలనూ పరిగణనలోకి తీసుకోవాలనే సూచనలను విస్మరించకూడదు. ఆర్థిక చోదక శక్తులుగా నగరాలకున్న ప్రాధాన్యం దృష్ట్యా ఆయా నగరాల్లోని ఆర్థిక అభివృద్ధి అవకాశాలు, సహజ వనరుల్ని గుర్తించి వాటి సమర్థ వినియోగ ప్రతిపాదనలను అభివృద్ధి ప్రణాళికలో పొందుపరచడం చాలా ముఖ్యమైన అంశం. కానీ, చాలా నగరాల అభివృద్ధి ప్రణాళికలో ఆర్థికాభివృద్ధి ప్రతిపాదనలకు అంతగా ప్రాముఖ్యం లభించడం లేదు. లభించినా అవాస్తవికమైన, ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు చేస్తున్నారు. పర్యావరణ అంశాలను కూడా ప్రణాళికల్లో విస్మరిస్తుండటం సమస్యగా పరిణమిస్తోంది. ప్రణాళికల అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ, నిర్వహణ కూడా చాలా ముఖ్యమైన అంశమే. కానీ అలాంటి కీలక అంశాలకు సైతం ప్రణాళికల్లో చోటు దక్కడం లేదు. అందువల్ల అభివృద్ధి ప్రతిపాదనలు అమలుకు నోచుకోకుండా, ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమై పోతున్నాయి. నగరాలు, పట్టణాల్లో పురపాలక సంస్థలు రూపొందించే వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధి ప్రణాళికల్లోని అంశాలకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదు. అంతేకాదు, అభివృద్ధి ప్రణాళికలు నగరాల్లోని కీలకమైన ప్రధాన ప్రాంతాలకే పరిమితమై, వాటిపైనే దృష్టిసారిస్తూ, శివారు ప్రాంతాల బాగోలను విస్మరిస్తున్నాయి.

ప్రత్యామ్నాయాల అన్వేషణ

కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న మాస్టర్‌ ప్లానింగ్‌ విధానం ఆశించిన సత్ఫలితాలు ఇవ్వలేకపోయింది. పట్టణ ప్రణాళికా విధానంలో మౌలిక మార్పుల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వాలు సంస్కరణలకు, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకు శ్రీకారం చుడుతున్నాయి. సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, గృహ వసతి, పౌర సేవలు, సాంఘిక, భౌతిక, మౌలిక వసతుల కల్పన, రవాణా, భూవినియోగ ప్రణాళికల సమర్థ సమన్వయం నగర అభివృద్ధి లక్ష్యాలుగా ఉండాలని పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలు (యూడీపీఎఫ్‌ఐ) సూచించిన మార్గదర్శకాలు సృష్టీకరిస్తున్నాయి. నగర అభివృద్ధి వ్యూహంలో పట్టణ ఆకృతుల రూపకల్పన కీలకమైన అంశంగా ఉండాలి. నగరాల ఆకృతిని తీర్చిదిద్దడంలో సాంద్రత కూడా ముఖ్యపాత్ర నిర్వర్తిస్తుంది. పరిమితంగా ఉన్న భూమిని అన్ని సౌకర్యాలతో అధిక జనాభాకు ఆవాసంగా సరిపోయేలా తీర్చిదిద్దిన విషయంలో సింగపూర్‌ ఆదర్శంగా నిలిచింది. నగర, పట్టణ ప్రణాళికల రూపకల్పనలో అనుసరిస్తున్న ‘పై నుంచి కిందకు’ అనే భావనకు సవస్తి పలికి, ‘కింద నుంచి పైకి’ అనే విధానాన్ని అనుసరించాలి. ప్రణాళికల రూపకల్పన, అమలులో ప్రైవేటు రంగానికి సముచిత ప్రాధాన్యం ఉండాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు, దశలవారీ లక్ష్యాల సాధనకు స్వల్పకాలిక ప్రణాళికలు కూడా అవసరం. ప్రణాళికా లక్ష్యాలు సాకారం కావాలంటే నిధులను సమీకరించగలగాలి. ఇందుకు ప్రత్యేకంగా ప్రణాళిక అమలు విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ‘భూవినియోగ ప్రణాళికావేత్తల దార్శనికత, రవాణారంగ నిపుణుల వ్యూహం, ఆర్థిక శాస్త్రవేత్తల ఆర్థిక, సమ్మిళిత దృక్పథం... కలగలిసిన ప్రణాళిక- ఉత్తమమైనదే కాకుండా, ఆచరణాత్మకమైనది’ అని పట్టణాభివృద్ధి నిపుణులు అంటున్నారు. వర్తమాన, భవిష్యత్‌ అవసరాలను నెరవేర్చగల ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయగలిగితే సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. అభివృద్ధి ఫలాలు అంతరాలు లేకుండా అందరికీ అందుతాయి. అప్పుడే పట్టణ అభివృద్ధి ప్రణాళికల పరమార్థం నెరవేరుతుంది.

పౌర భాగస్వామ్యం కీలకం

ఎక్కడైనా, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో పౌరులకు తగినంత పాత్ర ఉండాలి. వారి భాగస్వామ్యమే కీలకం. కానీ, ప్రస్తుత అభివృద్ధి ప్రణాళికల తయారీ ప్రక్రియలో పౌరుల పాత్ర ఎంతమేర ఉంటోందనేది సందేహమే. ఈ వర్గాలు కేవలం సలహాలు, సూచనలకే పరిమితమవుతున్నట్లు స్పష్ట్టమవుతోంది. అభివృద్ధి ప్రణాళిక నిర్మాణం పూర్తిగా అధికారులు, పాలక వర్గాల చేతిలో కేంద్రీకృతమై ఉంటోంది.

- పుల్లూరు సుధాకర్‌ 
(పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)

 

Posted Date: 29-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం