• facebook
  • whatsapp
  • telegram

సమూల క్షాళనే సహకారానికి భరోసా

ప్రత్యేక శాఖ ఏర్పాటుతో సాధించేదేమిటి?

 దిద్దుబాటలో రాష్ట్రాల వెనకంజ

స్వాతంత్య్రానికి పూర్వమే 1904లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఏర్పడినప్పటి నుంచి మన దేశంలో సహకార ఉద్యమం ఎన్నో దశలను దాటివచ్చింది. సహకార సంఘాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా కిందకు వచ్చినా, ఈ రంగంలో రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించే సహకార సంఘాల కోసం బహుళ రాష్ట్ర సహకార చట్టాన్ని తీసుకొచ్చారు. 74 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నియమించిన పలు కమిటీలు సహకార సంఘాల సమస్యలకు పరిష్కారాలను సూచించినా, అవి అమలుకు నోచుకోలేదు. దీనికి రాజకీయ నేతలతోపాటు అధికారులూ బాధ్యులే. ఈ రెండు వర్గాలు సహకార సంఘాలను స్వప్రయోజనాలకు వినియోగించుకొంటూ- పరిస్థితిలో గుణాత్మక మార్పు రాకుండా అడ్డుపడుతున్నాయి. ఇప్పటిదాకా కేంద్రంలో సహకార శాఖ వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండేది. దాన్ని ఇప్పుడు విడదీసి ప్రత్యేక శాఖగా ఏర్పరచారు. హోంమంత్రి అమిత్‌ షాకు అదనంగా సహకార సంఘ వ్యవహారాల శాఖను అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఆర్థిక క్రమశిక్షణ లోపం

పీఎంసీ బ్యాంకు కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి పట్టణ సహకార బ్యాంకుల నిర్వాకాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. నియంత్రణ సంస్థ అయిన రిజర్వు బ్యాంకు పాత్ర విమర్శలకు లోనైంది. కార్పొరేట్‌ రంగ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వాణిజ్య బ్యాంకులు పరిమితమయ్యాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, గ్రామీణ స్వల్పకాలిక రుణ అవసరాలను తీర్చే సహకార సంస్థలు రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), చిన్న చిల్లర రుణగ్రహీతలకు- ముద్ర, చిన్నపాటి ఫైనాన్స్‌ బ్యాంకులు, చెల్లింపుల (పేమెంట్‌) బ్యాంకులు తోడ్పడుతున్నాయి. మౌలిక వసతుల రంగ రుణ అవసరాలను డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు తీరుస్తున్నాయి. వ్యవసాయ రంగ అవసరాలకు నాబార్డ్‌, ఎంఎస్‌ఎంఈ రంగం కోసం భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్‌ఐడీబీఐ) ఏర్పాటుకు ప్రత్యేక చట్టాలు చేశారు. పట్టణ సహకార బ్యాంకులు సాంకేతిక పటిమను సంతరించుకోవాలని, ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకోవాలని, లేదంటే చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులుగా రూపాంతరం చెందాలని ప్రభుత్వం సూచించింది. గ్రామీణ సహకార సంఘాల్లో ఇప్పటిదాకా సంస్కరణలు చేపట్టలేదు. అవి ఇంకా రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోనే ఉన్నాయి. వీటిని సరైన మార్గంలో నడిపించడంలో నాబార్డ్‌ విఫలమైంది.

బ్రిటన్‌, కెనడాల్లో సహకార బ్యాంకులు ఏకంగా బడా వాణిజ్య బ్యాంకులకే గట్టి పోటీ ఇస్తున్నాయి. నిబంధనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా ఎన్నికలు జరుపుకొంటాయి. బోర్డు సభ్యులకు పాలనా వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు అందిస్తాయి. కార్యనిర్వహణ స్వేచ్ఛను నిలబెట్టుకొంటాయి. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల వ్యవహారాల్లో పదేపదే జోక్యం చేసుకుంటుందని రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. పాలు, చక్కెర, ఎరువుల రంగాల్లో విజయవంతంగా పనిచేస్తున్న సహకార సంస్థలు- ఆర్థిక రంగంలో విఫలం కావడానికి కారణాలను పరిశీలించడం అవసరం. సహకార రుణ వితరణ వ్యవస్థను అధికారి-ఉద్యోగి యంత్రాంగం హైజాక్‌ చేయడమే వైఫల్యానికి ప్రధాన కారణం. ఫైనాన్స్‌ రంగానికి అవసరమైన ఆర్థిక క్రమశిక్షణను సహకార సంఘాల పాలక మండలి సభ్యులు పాటించకపోవడం మరో పెద్ద లోపం. అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉందనుకోకూడదు. తెలంగాణలో ముల్కనూరు సంస్థ అత్యంత విజయవంతమైన సహకార సంఘంగా పేరొందింది.

సవరణలు తప్పనిసరి 

గతంలో వ్యాస్‌, వైద్యనాథన్‌ కమిటీలు సహకార సంఘాల్లో పాలన పరమైన లోపాలను బహిర్గతం చేశాయి. రాష్ట్ర స్థాయి సహకార చట్టాన్ని సవరించాలని సూచించాయి. సహకార రంగ పునర్వ్యవస్థీకరణకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి పునరావాస నిధులు పొందాలంటే ఈ సవరణలు తప్పనిసరి అని పేర్కొన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను  సంస్కరించనిదే సహకార రుణ సంస్థలను పటిష్ఠం చేయలేమని వైద్యనాథన్‌ కమిటీ స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాలు ఈ సంస్కరణలను చేపట్టలేదు. సహకార బ్యాంకింగ్‌ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పని చేయాలనే నియమాన్ని తమిళనాడు తుంగలో తొక్కింది. ఆ రాష్ట్రంలో గ్రామీణ సహకార పరపతి సంఘాలకు రెండు దశాబ్దాలపాటు ఎన్నికలే నిర్వహించలేదు. సహకార సంఘాల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారులకే అప్పగించింది. దీనివల్ల సహకార బ్యాంకింగ్‌ రంగంలో ప్రజాస్వామ్య సూత్రాలకు తావులేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమిత్‌ షా నేతృత్వంలో సహకార రంగ స్థితిగతులు మారతాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ రంగంలో సమూల సంస్కరణలు తీసుకురానిదే భవిష్యత్తు మనల్ని క్షమించదు.

పకడ్బందీగా సవరణలు

సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొనే హక్కును రాజ్యాంగంలోని 19వ అధికరణ కింద ప్రాథమిక హక్కుగా గుర్తించి పకడ్బందీ ప్రాతిపదికను ఏర్పరచారు. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో సహకార సంఘాల అభివృద్ధి కోసం కొత్త అధికరణను ప్రవేశపెట్టారు. 43బి అధికరణ ప్రకారం రాష్ట్రాలు 2013 జనవరికల్లా కొత్త సహకార చట్టాన్ని తీసుకురావాలి. అన్ని రాష్ట్రాల్లో అంతవరకు అమలులో ఉన్న సహకార చట్టాల్లోని కీలకాంశాలను కొత్త చట్టంలో పొందుపరచారు. సహకార సంఘాలను నెలకొల్పడానికి, రద్దు చేయడానికి 2012నాటి 97వ రాజ్యాంగ సవరణ చట్టం వీలు కల్పిస్తోంది. సహకార సంఘాల బోర్డులో గరిష్ఠంగా 21 మంది డైరెక్టర్లు ఉండవచ్చు. డైరెక్టర్ల బోర్డు పదవీ కాలం ముగిసిన తరవాత కొత్త బోర్డు ఎన్నికకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలి. ప్రతి అయిదేళ్లకు ఒకసారి విధిగా ఎన్నికలు జరపాలి. ప్రభుత్వ వాటాలు, రుణాలు ఉన్న సహకార సంఘ బోర్డు పదవీ కాలం పూర్తయిన తరవాత అవసరమైతే, ఆ కాలాన్ని ఆరు నెలల వరకు పొడిగించవచ్చు. రిజర్వు బ్యాంకు అనుమతితో బ్యాంకింగ్‌ విధులు నిర్వహించే సహకార సంఘాల బోర్డు పదవీకాలం పొడిగించాలంటే- రిజర్వు బ్యాంకు సమ్మతి కావాలి. నిర్దిష్ట రంగాల్లో నిష్ణాతులైన ఇద్దరిని బోర్డు డైరెక్టర్లుగా నియమించవచ్చు కానీ, వారికి ఓటింగ్‌ హక్కులు మాత్రం ఉండవు. ఇంకా ఇలాంటి నిబంధనలెన్నో అమలులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం 19వ అధికరణను సవరించడాన్ని, 97వ రాజ్యాంగ సవరణను తీసుకురావడాన్ని గుజరాత్‌ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. ఆ కేసులో హైకోర్టు కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లగా తీర్పును వారం క్రితం నిలిపి ఉంచారు.

సహకారానికి సంస్కరణల చికిత్స

సహకార రంగాన్ని సంస్కరణల పథంలో నడిపించే విషయంలో రాష్ట్రాలు ముందడుగు వేయలేదనే విమర్శలున్నాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి సహాయ ప్యాకేజీ పొందాలంటే సహకార సంఘాల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని, సహకార చట్టాల్లో మార్పులు చేయాలని వైద్యనాథన్‌ కమిటీ చేసిన సిఫార్సును చాలా కొద్ది రాష్ట్రాలు మాత్రమే అమలు చేశాయి. దీంతో ప్రమాణాలను సడలించక తప్పలేదు. సంస్కరణలు చేపట్టని రాష్ట్రాలకు కూడా సహాయ ప్యాకేజీ అందించారు. దీనికి 2004 ఏప్రిల్‌ను గడువుగా విధించారు. సహకార సంఘాలు ఆ గడువుకల్లా బ్యాలన్స్‌ షీట్లను ఒక కొలిక్కి తీసుకురావాలనే షరతు విధించారు. అప్పటి నుంచి మూడు నెలల్లోగా సహాయ ప్యాకేజీని అందిస్తామని తెలిపారు. అయినా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్‌) ఉద్యోగుల నియామక ప్రమాణాలు, అకౌంటింగ్‌ పద్ధతులు, కంప్యూటరీకరణకు సంబంధించిన సమస్యలను చాలా రాష్ట్రాలు పరిష్కరించలేదు. తమ లొసుగులు బయట పడతాయని వాటిని కప్పిపెట్టి ఉంచాయి. కొన్ని రాష్ట్రాల్లో సహకార చట్టాలను సవరించినా, అమలు చేయలేదు. అనేక రాష్ట్రాల్లో పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరపలేదు. దాంతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహణకు తావులేకుండా పోయింది. పలు రాష్ట్రాల్లో పీఏసీఎస్‌లు తమ బ్యాలన్స్‌ షీట్లను కొలిక్కి తేలేదు.

రుణమాఫీ వరం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణ, వడ్డీ మాఫీ పథకాలను ప్రకటించడం ప్రాథమిక, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు వరంగా మారింది. దీంతోపాటు లైసెన్సింగ్‌ ప్రమాణాలను సడలించడం వల్ల అనేక డీసీసీబీలు బ్యాంకులుగా పనిచేయడానికి రిజర్వు బ్యాంకు అనుమతి పొందగలిగాయి. వ్యవసాయ రుణ వితరణకు ఆర్థిక క్రమశిక్షణ, సమానత్వం చాలా ముఖ్యం. గ్రామీణ సహకార పరపతి సంఘాలకు సరిగ్గా ఆ లక్షణాలే లోపించాయి. సహకార సంఘాలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలని వైద్యనాథన్‌ కమిటీ సూచించినా- ఆచరణలో స్వయంప్రతిపత్తి వక్రీకరణకు లోనైంది. సహకార సంఘాల సభ్యులకు సక్రమంగా రుణాలు మంజూరు చేసే బదులు పెత్తనం చలాయించడానికి స్వయం నిర్ణయాధికారాన్ని దుర్వినియోగం చేశారు. దీంతో వైద్యనాథన్‌ కమిటీ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు.

వ్యవసాయ రుణ విధానాన్ని నియంత్రించాల్సిన నాబార్డ్‌ మాటను పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతరు చేయడం లేదు. అందువల్ల నాబార్డ్‌ తన అజమాయిషీలోని గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి సంస్థ వ్యవహారాలకే పరిమితమైంది. సహకార వ్యవస్థలో డిజిటలీకరణ సాధన గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే పీఏసీఎస్‌ల నుంచి డీసీసీబీల వరకు యావత్‌ సహకార పరపతి వ్యవస్థను సంపూర్ణంగా డిజిటలీకరించగలిగింది. రాష్ట్రంలో పాడి, మత్స్యకార సహకార సంఘాల బాధ్యతలను సమర్థంగా నిర్వహించే స్థాయికి రాష్ట్ర సహకార వ్యవస్థ ఎదిగింది. సహకార ప్రాతిపదికపై గిడ్డంగుల అనుసంధానం, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, గ్యాస్‌, పెట్రోలు బంకుల నిర్వహణలో తెలంగాణ ముందంజ వేస్తోంది. ధరణి పోర్టల్‌ ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన దీనికి కలిసి వచ్చింది. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడంపై శ్రద్ధ పెడుతున్నారు. సహకార సంఘాలు సమర్థంగా నడిస్తే అందరికీ సమానంగా ఆర్థిక ఫలాలను అందించడం వీలవుతుంది. తెలంగాణ తరహాలో ఉత్తరాఖండ్‌ కూడా సహకార సంస్థల డిజిటలీకరణపై దృష్టి కేంద్రీకరించింది. ఆ రాష్ట్ర బడ్జెట్‌లో ఇందుకు రూ.1,800 కోట్లు కేటాయించారు. వడ్డీ సబ్సిడీలు, సంస్కరణలకు దన్ను, సహకార సంఘాల డిజిటలీకరణలకు కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తోంది. సహకార సంఘాల వ్యవస్థలో ఏవైనా సంస్కరణలు వచ్చాయంటే, ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుంది. కేంద్రం సూచనలను రాష్ట్రాలు సంపూర్ణంగా పాటించకపోవడం వల్లనే చిక్కులు తలెత్తుతున్నాయనే విమర్శలు లేకపోలేదు.

అమిత్‌ షాకే ఎందుకు అప్పగించారు?

సహకార సంఘాల రాజకీయాలు, అవి రికార్డు స్థాయిలో నమోదు చేసిన సభ్యత్వాలు, సృష్టించిన ఓటు బ్యాంకు- కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దృష్టిని బాగా ఆకర్షించాయని, సహకార శాఖను హోంమంత్రి అమిత్‌ షాకు అప్పగించడాన్ని ఈ కోణం నుంచే చూడాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అమిత్‌ షా కేంద్ర హోంమంత్రి కావడం వల్ల సహకార సంఘాల్లో అవకతవకలకు పాల్పడిన రాజకీయ నాయకులపైకి సీబీఐని, ఇంటెలిజెన్స్‌ బ్యూరోను ప్రయోగిస్తారేమోననే ఆందోళన ప్రత్యర్థి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి నాయకులపై ఒత్తిడి తెచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయించేలా చేస్తారని భావిస్తున్నారు. సహకార శాఖను అమిత్‌ షాకు అప్పగించడానికి వెనక బలమైన కారణం ఇదేనా? లేకపోతే, ఈ రంగంలో విస్తృత సంస్కరణలు తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమా అన్నది మున్ముందు తేలుతుంది. ఏదేమైనా సహకారోద్యమాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాలపై ఉందనడంలో సందేహం లేదు.
 


 

Posted Date: 17-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం