• facebook
  • whatsapp
  • telegram

సరిహద్దుల రగడ

అసోం-మిజోరం ఘర్షణలతో ఉద్రిక్తత

చైనాతో యుద్ధ సమయంలో కొన్ని తెగలకు చెందిన తిరుగుబాటు బృందాలతో ఈశాన్య భారతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బయటి శక్తులతో పోరాడాలంటే ముందు అంతర్గత శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని భారత్‌కు అప్పుడు అనుభవంలోకి వచ్చింది. ఫలితంగా తరవాతి కాలంలో నాగాలాండ్‌, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడింది. మిజోరం సరిహద్దుల విషయంలో చారిత్రక వివాదాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఇప్పుడు భారత్‌కు తలనొప్పిగా మారింది. పది రోజుల క్రితం అసోంలోని కచార్‌ జిల్లాలో ఒకటి, మరుసటి రోజు మిజోరం సరిహద్దుల్లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో అసోం-మిజోరం సరిహద్దు వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది.

‘ఈశాన్య ప్రాంతాల పునర్విభజన చట్టం 1971’ ప్రకారం అసోం నుంచి లుషాయి హిల్స్‌ ప్రాంతాన్ని విడదీసి మిజోరం పేరిట కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. 1986లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ గ్రూపుతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందంతో 20 ఏళ్ల వేర్పాటువాదానికి తెరపడింది. ఆ మరుసటి ఏడాదే మిజోరమ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య 164 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. బ్రిటిష్‌ పాలనలోని నిర్ణయాలతో మిజో ఆదివాసుల్లో నెలకొన్న అసంతృప్తి- ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసోమ్‌తో సరిహద్దు వివాదంగా రూపాంతరం చెందింది. బ్రిటిష్‌ పాలకులు వేర్వేరు సందర్భాల్లో జారీ చేసిన రెండు నోటిఫికేషన్ల ఆధారంగా ఇరు రాష్ట్రాలు ఘర్షణలకు దిగుతున్నాయి. బెంగాల్‌ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం 1875లో నాటి లుషాయి హిల్స్‌, కచార్‌ మైదాన ప్రాంతాల సరిహద్దులను బ్రిటిష్‌ పాలకులు నిర్ణయించారు. భౌగోళిక లబ్ధిని దృష్టిలో పెట్టుకొని మిజోరం ఇదే సరైనదిగా వాదిస్తోంది. లుషాయి హిల్స్‌- మణిపూర్‌ మధ్య సరిహద్దులను నిర్ణయిస్తూ 1933లో బ్రిటిష్‌ ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తన వాదనకు అనుకూలంగా ఉండటంతో అసోం దాన్ని నెత్తికెత్తుకొంది. ఈ మ్యాప్‌ రూపొందించేటప్పుడు సర్వే అధికారులు స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోలేదని మిజోరం నాయకులు వాదిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడవులతో నిండి ఉన్నందువల్ల కచ్చితంగా హద్దులను గుర్తించడం కష్టం. ఫలితంగా ఇరువైపులా గ్రామీణులు చాలా సందర్భాల్లో సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళి సాగుచేస్తున్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. 1994లో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. ఆ తరవాత నుంచి రెండు వైపులా సరిహద్దుల్లో బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 2006తో పాటు నిరుడూ ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. 306వ నెంబర్‌ జాతీయ రహదారి దాదాపు 12 రోజులు మూతపడింది. మిజోరం వైపు సరకుల రవాణాకు ఇదే జీవనాడి. అసోం వైపు నుంచి అక్రమంగా వచ్చిన బంగ్లా జాతీయులే ఈ ఘర్షణలకు కారణమని మిజోరం నాయకులు ఆరోపించారు. ఘర్షణల నివారణకు ఇరు రాష్ట్రాల పోలీసు క్యాంపుల మధ్య బీఎస్‌ఎఫ్‌, సశస్త్రసీమాబల్‌ బలగాలను మోహరించారు. మేఘాలయలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ సమస్య పరిష్కారానికి అసోం-మిజోరం అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. వివాదానికి పరిష్కారం లభించే వరకు యథాతథా స్థితి కొనసాగించాలని నిర్ణయించారు.

తాజా ఘర్షణల దృష్ట్యా కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాల అధికారులను దిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది. కానీ, కచ్చితమైన పరిష్కారం వెలుగు చూడలేదు. ఇంతలోనే కాల్పులు జరిపైనా ఆక్రమణలను అడ్డుకోవడానికి తమవాళ్లు సిద్ధంగా ఉన్నారంటూ మిజోరం నార్తర్న్‌ రేంజ్‌ ఐజీ ఖియాంగ్టే బాధ్యతారహితమైన ప్రకటన చేశారు. మిజో వాసులే 100 ఏళ్లుగా సరిహద్దులు దాటి ఆక్రమణలకు పాల్పడినట్లు ఉపగ్రహ చిత్రాలు చూస్తే అర్థమవుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెబుతున్నారు. రాష్ట్రాల మధ్య భూవివాదాలతో రాజకీయ పార్టీలు చలికాచుకోవడం దేశంలో కొత్తేమీ కాదు! ఈశాన్య భారత్‌లో అసోం కీలకమైన రవాణా మార్గం. మిజోరం రెండు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని వేగంగా పరిష్కరించాలి. భారత్‌ ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ విజయవంతానికి ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే భారత సరిహద్దుల దగ్గరికి చేరింది. ఈ తరుణంలో ఈశాన్య రాష్ట్రాల మధ్య కీచులాటలు దేశానికి ఎంతమాత్రం క్షేమం కాదు.

- లక్ష్మీతులసి
 

Posted Date: 20-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం