• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక రథానికి కొత్త ఊపు

పీఎల్‌ఐ పథకంతో మేలిమి ప్రయోజనాలు

నువ్వు ఎక్కవలసిన బండి జీవిత కాలం లేటు అన్నారో కవి. ఇంతకాలం వ్యవసాయం, సేవా రంగాలపైనే ఇండియా ఎక్కువగా దృష్టి సారించింది. అందువల్ల భారతదేశ పారిశ్రామిక రథం ఎప్పుడూ ఆలస్యమేనని విజ్ఞులు వాపోతూ ఉండేవారు. భారత్‌కు భిన్నంగా పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన చైనా నేడు ప్రపంచానికే తయారీ కర్మాగారంగా వర్ధిల్లుతోంది. అమెరికా వంటి సంపన్న దేశాలతోపాటు భారత్‌ సైతం చైనా వస్తువుల దిగుమతులపై అధికంగా ఆధారపడవలసి వస్తోంది. ఈ తరుణంలో అనుకోని విపత్తులా కొవిడ్‌ విరుచుకుపడింది. సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై చైనాపై అతిగా ఆధారపడటం ఏమాత్రం మంచిది కాదని ప్రపంచానికి తెలిసివచ్చింది. కొవిడ్‌ ముప్పు ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలిపోయేలా లేదు. ఆ మహమ్మారికి వాతావరణ మార్పులు సైతం తోడై రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల భారత్‌ ఇతర దేశాలపై ఆధారడకుండా సొంతంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని, స్వదేశీ మార్కెట్‌ను విస్తరించుకోవడం అత్యవసరం. అలాగే డ్రాగన్‌ దేశానికి ప్రత్యామ్నాయంగానూ ఎదగాలి. మరో దశాబ్దందాకా భారత జనాభాలో యువతే అధికంగా ఉంటుంది కాబట్టి- నిపుణ మానవ వనరులకు, గిరాకీకి ఢోకా ఉండబోదంటున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరుడు మార్చిలో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహ(పీఎల్‌ఐ) పథకం చేపట్టింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో అంతర్భాగమైన భారత తయారీ కార్యక్రమ విజయానికి పీఎల్‌ఐ కీలకమవుతుంది.

జోరందుకున్న తయారీ

స్వదేశంలో పారిశ్రామిక ఉత్పత్తిని, ఇతర దేశాలకు ఎగుమతులను పెంచడంతోపాటు, దిగుమతుల బిల్లును తగ్గించడానికి పీఎల్‌ఐ పథకం తోడ్పడుతుంది. మొదట భారతదేశాన్ని ఎలక్ట్రానిక్‌ వస్తు ఉత్పత్తి కేంద్రంగా మలచాలని చేపట్టిన పీఎల్‌ఐ పథకాన్ని- సంవత్సరం తిరగకుండానే చక్కని ఫలితాలు రావడంతో మరో 13 రంగాలకు విస్తరించారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో పీఎల్‌ఐ పథకాలకు రూ.1.97 లక్షల కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఫార్మా, సౌర విద్యుత్‌ పరికరాలు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్ల వంటి పరిశ్రమలతోపాటు మొబైల్‌ ఫోన్లు, టెలికాం, ఆహార శుద్ధి, జౌళి వంటి రంగాల్లోనూ ఉత్పత్తి పెంచేవారికి పీఎల్‌ఐ ప్రయోజనాలు అందుతున్నాయి. భారత గడ్డపై ఉత్పత్తిని చేపట్టే విదేశీ కంపెనీలకు సైతం స్వదేశీ సంస్థలతో సమానంగా పీఎల్‌ఐ పథకం రాయితీలు కల్పిస్తారు. అందుకే ఫాక్స్‌కాన్‌, శాంసంగ్‌, విస్ట్రాన్‌, ఆపిల్‌ వంటి బహుళజాతి సంస్థలు భారత్‌లో రూ.10.50 లక్షల కోట్ల విలువైన వస్తువులను, ముఖ్యంగా మొబైల్‌ ఫోన్లను ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చాయి. వాటితోపాటు లావా, మైక్రోమ్యాక్స్‌ వంటి స్వదేశీ మొబైల్‌ సంస్థలకూ పీఎల్‌ఐ ఫలాలు అందుతున్నాయి. మొబైల్‌ ఫోన్ల తయారీలో స్వదేశీ విడిభాగాల వాటాను 15-20శాతం నుంచి 35-40శాతానికి, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో దాదాపు 50శాతానికి పెంచడానికి పీఎల్‌ఐ తోడ్పడనుంది. నిరుడు మొబైల్‌ ఫోన్ల తయారీకి పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిన తరవాత మొదటి అయిదు నెలల్లోనే రూ.35,000 కోట్ల ఉత్పత్తి సాధించి, 22,000 కొత్త ఉద్యోగాలు సృష్టించగలిగారు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో మొబైల్‌ ఫోన్ల ఎగుమతి 250శాతం పెరగ్గా, దిగుమతులు 80శాతం తగ్గాయి.

పీఎల్‌ఐ పథకం చలవతో ఏసీలు, వాషింగ్‌ మెషీన్ల వంటి వాటి ఉత్పత్తి 50 లక్షల యూనిట్ల నుంచి 2.4 కోట్లకు పెరగనుంది. ఈ పరికరాల్లో స్వదేశీ విడిభాగాల వాటా ఇప్పుడున్న 20-25శాతం నుంచి 80-85శాతానికి పెరుగుతుందని అంచనా. పీఎల్‌ఐ పథకం గణనీయ ఫలితాలను అందిస్తున్నందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నవంబరు చివరి వారంలో ఫార్మా, సౌర విద్యుత్‌, డ్రోన్ల రంగాలకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. డాక్టర్‌ రెడ్డీస్‌, నాట్కో, అరబిందో, బయొలాజికల్‌ ఈ, సన్‌, సిప్లా, లూపిన్‌, టోరెంట్‌ వంటి 55 ఫార్మా కంపెనీలకు రాబోయే ఆరేళ్లలో పీఎల్‌ఐ పథకం కింద రూ.15 వేల కోట్ల విలువైన రాయితీలను ఇవ్వనుంది. వాటిని పొందే ఫార్మా కంపెనీల జాబితాలో 20 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్లు(ఎంఎస్‌ఎంఈలు) సైతం ఉన్నాయి. భారత్‌లో కనీసం 20శాతం విడిభాగాలతో డ్రోన్లు, డ్రోన్‌ విడిభాగాలను తయారుచేసే సంస్థలకు పీఎల్‌ఐ పథకం కింద తాజాగా రూ.120 కోట్ల రాయితీలను ప్రకటించారు. సౌర విద్యుదుత్పాదనకు అవసరమైన సౌర ఘటాలు, ఇతర విడిభాగాలను స్వదేశంలోనే ఉత్పత్తి చేసే కంపెనీలకు పీఎల్‌ఐ రాయితీలను ప్రభుత్వం నాలుగు రెట్లు పెంచింది. ఇంతవరకు ఈ పథకానికి కేటాయించిన రూ.4,500 కోట్లను ఇకపై రూ.19,500 కోట్లకు పెంచనున్నారు. దీనివల్ల టాటా, అదానీ, ఎల్‌ అండ్‌ టీ తదితర ప్రైవేటు కంపెనీలతోపాటు కోల్‌ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలూ లబ్ధి పొందనున్నాయి.

లోటుపాట్లను సరిదిద్దాలి

భారత్‌ను ఎగుమతి కేంద్రిత ఆర్థిక వ్యవస్థగా మార్చి ప్రపంచ మార్కెట్‌లో చైనాతో పోటీ పడే స్థాయికి చేర్చాలి. అందుకోసం చైనా, వియత్నాం, తైవాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియాల మాదిరిగా పరిశ్రమలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం, పెట్టుబడులు సమకూర్చడం తక్షణావసరం. దీటైన మౌలిక వసతులను కల్పించుకుంటూ ఓడరేవు ఖర్చులు, రవాణా వ్యయాన్ని బాగా తగ్గించాలి. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తికి కీలకమైన ప్రత్యేక ఆర్థిక మండళ్లకు(ఎస్‌ఈజెడ్‌) కస్టమ్స్‌ సుంకాలు తగ్గించాలి. వ్యాపార సౌలభ్యం పెరగాలి. మొత్తంమీద పీఎల్‌ఐ పథకం విదేశీ ఉత్పత్తిదారులను భారత్‌కు ఆకర్షిస్తోంది. మొదటిసారిగా ఇక్కడి ఐటీ హార్డ్‌వేర్‌ రంగంలో యూనిట్లను స్థాపించడానికి వారు ముందుకొస్తున్నారు. అన్ని రంగాల్లో స్వదేశీ, విదేశీ యూనిట్లు విస్తరిస్తే ఎగుమతులు, ఉపాధి అవకాశాలు, ఎంఎస్‌ఎంఈ రంగానికి కాంట్రాక్టులూ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.

ఆధారపడటం మంచిది కాదు

ఇంతవరకు సౌర విద్యుత్‌ పరికరాల్లో 80శాతాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వియత్నాం, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉన్న చైనీస్‌ కంపెనీల ఎగుమతులనూ కలుపుకొంటే భారతీయ సౌర విద్యుదుత్పాదన రంగానికి కావలసిన విడిభాగాల్లో 95శాతానికి చైనాయే దిక్కు అని తేలుతుంది. అనేక ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు చైనా కంపెనీలు భారత్‌కు సరఫరా చేసే విడిభాగాల ధరలను పెంచేస్తున్నాయి. గల్వాన్‌ ఘర్షణల తరవాత కొన్ని చైనా కంపెనీలు భారత్‌కు సౌర విడిభాగాల ఎగుమతిని నిలిపివేస్తామని బెదిరించాయి. అంతర్జాతీయ విపణిలో భారత్‌ తమకు పోటీ వస్తుందని చైనా ఆందోళన చెందుతోంది. 2030కల్లా 450 గిగావాట్ల సౌర, పవన విద్యుదుత్పాదను భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని అందుకోవడానికి చైనా మీద ఆధారపడితే ప్రయోజనం ఉండదు.

- ఆర్య
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశార్థికానికి మేలెంత?

‣ ఆధునిక పద్ధతుల్లో ధాన్యం నిల్వ

‣ పౌరహక్కులకు సంకెళ్లు

‣ వాడి వేడి సమరానికి సిద్ధం

Posted Date: 03-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం