• facebook
  • whatsapp
  • telegram

భూమి హక్కుల్లో చిక్కులు

సామాన్యుడికి తప్పని ఇక్కట్లు

దశాబ్దాలుగా భూమి సాగులో ఉన్నప్పటికీ అది పట్టాకాక ఎందరో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పట్టా ఉన్నప్పటికీ భూమి స్వాధీనంలో లేనివారు చాలామంది దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ భూములకు పెద్దయెత్తున వేలంపాటలు నిర్వహిస్తున్నారు. భూమిహక్కులకోసం పేదలు పోరాటాలు సాగిస్తున్నారు. అసైన్డ్‌ భూములకు పట్టా హక్కులు కావాలనీ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సాగు చేస్తున్న భూమి సర్వే నంబరు పట్టాలో మారిపోయి ఉండటం వల్ల హక్కుల చిక్కులు ఏర్పడుతున్నాయి. వీటన్నింటినీ పరికిస్తే ఎన్నో మౌలిక ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు భూమి ఎవరిది? సాగులో ఉన్నవారిదా, యజమానిదా, ప్రభుత్వానిదా, ప్రజలదా? భూ సమస్యలు తలెత్తినప్పుడు భూమి ఎవరిదో నిర్ధారించడానికి ఏది ప్రామాణికం? సాగులో ఉండటమా, కాగితాలు కలిగి ఉండటమా? ఒకప్పుడు అనుభవంలో ఉన్నవారే భూమికి యజమాని. ఆ తరవాతి కాలంలో అనుభవంతో పాటు హక్కుపత్రాలు ఉంటేనే యజమాని అన్న నియమం బయలుదేరింది. భూమి స్వాధీనంలో ఉండి కాగితాలు లేకున్నా, కాగితాలు ఉండి భూమి లేకున్నా యాజమాన్య హక్కులకు చిక్కులు తప్పడంలేదు. ఆ సమస్యలను పరిష్కరించాలంటే భూహక్కులపై లోతైన చర్చ, భద్రమైన భూహక్కుల కల్పన జరగాలి.

రైతుల ఆవేదన

మానవ నాగరికత పరిణామక్రమంలో వేటాడే దశనుంచి పోడు సాగు, ఆ తరవాత స్థిర వ్యవసాయం దశకు చేరుకున్న తరవాతనే భూమిపై హక్కుల అవసరం ఏర్పడింది. మొదట్లో భూమిని సాగులోకి తెచ్చిన వారికే దానిపై సర్వ హక్కులు ఉండేవి. పోనుపోను యుద్ధాల్లో గెలవడం, రాజులిచ్చే దానం, ఇనాములద్వారా భూమిపై హక్కులు సంక్రమించాయి. వారసత్వం, కొనుగోలు, దానం, తాకట్టు వంటి మార్గాల్లోనూ భూ యాజమాన్య హక్కులు దక్కుతాయి. భూమి ఎలా వచ్చినా దానిపై యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలంటే స్వాధీనం, హక్కు పత్రాలు రెండూ ఉండాలి. ప్రాచీన కాలంలో చట్టాలను రూపొందించినవారు ఇదే విషయాన్ని తెలియజెప్పారు. అయితే, మూడు తరాలుగా భూమి ఒకరి స్వాధీనంలో ఉన్నట్లయితే, హక్కుపత్రాలు లేకున్నా యాజమాన్య హక్కులకు అదే అంతిమ సాక్ష్యంగా నిలుస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. తరతరాలుగా భూమిని సాగుచేసుకుంటున్నప్పటికీ, పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేకపోయిన రైతులెందరో రెండు రాష్ట్రాల్లో కనిపిస్తారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని అటవీ హక్కుల చట్టం పేర్కొంటుంది. దాని ప్రకారం మూడు తరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు సైతం పట్టాలివ్వాలి. అది అమలు కాకపోవడంతో గిరిజనులు పోరాటం సాగించారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించింది. హక్కుల క్రమబద్ధీకరణకోసం రైతులు పెట్టుకున్న లక్షల దరఖాస్తులు నేటికీ అపరిష్కృతంగానే పడి ఉన్నాయి. స్వాధీనంలో భూమి ఉన్నప్పటికీ హక్కుపత్రాలు లేకపోవడం, ఇతరులకు ఆ భూమిపై హక్కుపత్రాలు దఖలుపడటం లేదా వివాదాలు నెలకొనడం వంటి కారణాలతో భూ యజమానులు కాలేకపోతున్న రైతులు ప్రతి పల్లెలో ఉన్నారు. ఒకప్పుడు భూమి ఉంటే ఏ కాగితాలతో అవసరం ఉండేది కాదు. ప్రస్తుతం పత్రాలుంటేనే స్వాధీనంలో ఉన్న భూమిపై లబ్ధి పొందడానికి ఆస్కారం లభిస్తోంది. ప్రాచీన నియమాలు భూమి స్వాధీనానికే పెద్దపీట వేశాయి. నేటి చట్టాలు మాత్రం కాగితాలకే అధిక విలువ ఇస్తున్నాయి. భూమి ఉన్నా, కాగితాలు లేక యాజమాన్య హక్కులు పొందలేని రైతులకు మేలు చేసే విధంగా గట్టి ప్రయత్నాలు జరగాలి.

దున్నేవాడికే దక్కాలి

భూమిపై హక్కులు దున్నేవాడికే ఉండాలని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. ఆయన అడుగు జాడల్లో నడిచిన ఆచార్య వినోబా భావే- భూదానానికి పిలుపిచ్చారు. భూమి దున్నేవాణ్ని స్వేచ్ఛా మానవుణ్ని చెయ్యాలని భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పిలుపిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ప్రజలు ఆక్రమించుకున్న పది లక్షల ఎకరాలకుపైగా భూమి నుంచి వారిని తొలగించాలని అప్పట్లో చర్చ వచ్చింది. భూమిని ఎలా పొందినప్పటికీ ముందుగా వారి హక్కులను పరిరక్షించాలని నెహ్రూ పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ ఇద్దరూ భూమిని దున్నేవారి హక్కులను గుర్తించాలని, వాటిని కాపాడాలని అభిలషించారు. ప్రస్తుతం పత్రాలు ఉన్నవారి హక్కుల రక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పేదలు, బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి భూమి అనుభవంలో ఉన్నవారికి యాజమాన్య హక్కులు దక్కేలా ప్రభుత్వాలు కృషిచేయాలి. భూ హక్కుల చిక్కులను సత్వరం తీర్చే వ్యవస్థలను కొలువుతీర్చాలి. పేదలందరికీ ఎంతో కొంత భూమిని ఇచ్చే కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలుచేసి అసంపూర్ణంగా మిగిలిన భూసంస్కరణలను ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. భూమి హద్దులకు, హక్కులకు స్పష్టత, భద్రత ఇచ్చే చట్టాలు, వ్యవస్థలు రూపుదిద్దుకోవడం తప్పనిసరి.

వేలం సబబేనా?

నాగరికత ప్రారంభంలో భూమి అందరిదీ. పోనుపోను వ్యక్తిగత సంపదగా మారింది. వ్యక్తుల భూ హక్కులను రక్షించినందుకు రాజు పన్నులు వసూలు చేసేవాడు. రాజు వాటికి రక్షకుడు మాత్రమే. తన అధీనంలో ఉన్న బంజరు, స్వయం అనుభవ భూములకు రాజు యజమాని. వాటిని ఇతరులకు బహుమానంగా ఇచ్చేవాడు. భూమి రాజ్యానిది, ప్రజలది. కొంత భూమి ప్రజల వ్యక్తిగత యాజమాన్యంలో ఉండేది. రాజు లేదా ప్రభుత్వం భూమికి ధర్మకర్త మాత్రమే. భూ పంపిణీకి, భూ హక్కులను ఇవ్వడానికి, గుర్తించడానికి ప్రభుత్వాలకు ప్రత్యేక, పరిమిత అధికారాలు ఉంటాయని బ్రిటిష్‌ ప్రభుత్వంలో పనిచేసిన ప్రముఖ భూపరిపాలన నిపుణులు బేడెన్‌ పావెల్‌ వ్యాఖ్యానించారు. ఈ కోణంలో చూస్తే ప్రభుత్వ భూములు ప్రజలవి. వాటిని వేలం వేయడం సరైన విధానం కాకపోవచ్చు. అటువంటప్పుడు పేదలకు పంచిన ప్రభుత్వ భూములపై వారికి సంపూర్ణ హక్కులుంటాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన భూములను తరతరాలు అనుభవించాలేగానీ అన్యాక్రాంతం చెయ్యకూడదని చట్టం చెబుతోంది. దాన్ని సవరించి అసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కులు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ మేరకు కొన్ని వెసులుబాట్లు వచ్చాయి. అలా చేయడంవల్ల బడుగుల చేతుల్లో భూములు మిగలవనే వాదనలూ వినిపిస్తున్నాయి.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హక్కుల పేరిట అమెరికా దూకుడు

‣ పంటలను ముంచుతున్న విపత్తులు

‣ ప్రజలపైనే అప్పుల భారం

‣ మోన్‌ మారణకాండకు బాధ్యులెవరు?

‣ సహజత్వం కోల్పోతున్న వాతావరణం

Posted Date: 20-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం