• facebook
  • whatsapp
  • telegram

సెమీకండక్టర్లలో స్వావలంబనే లక్ష్యం

ప్రత్యేక విధానంతో కేంద్రం అడుగులు

ఒక దేశ ఆర్థిక, సాంకేతిక పటిమకు, సైనిక సత్తాకు సెమీకండక్టర్లే ప్రతీకలు. వాటిని మైక్రోచిప్స్‌, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌(ఐసీ)గానూ వ్యవహరిస్తారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), విద్యుత్‌ వాహనాలు(ఈవీలు), స్మార్ట్‌ఫోన్లు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, 6జీ సాంకేతికతలతో ఆవిర్భవించే డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు చిప్‌లే చోదక శక్తిగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఏ ఒక్క దేశానికీ రూపకల్పన స్థాయి నుంచి ఉత్పత్తి, సరఫరాదాకా ఏకబిగిన మైక్రోచిప్‌లను అందించే సామర్థ్యం లేదు. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాలు చిప్‌లను డిజైన్‌ చేస్తుంటే, శ్రామిక శక్తి చౌకగా లభ్యమయ్యే తైవాన్‌, చైనాలలో వాటి ఉత్పత్తి సాగుతోంది. చైనా తమ మేధాహక్కులను చోరీచేస్తూ తమకే సవాలు విసిరే స్థాయికి చేరుతోందని గ్రహించిన అమెరికా- డ్రాగన్‌ చిప్‌ కంపెనీలను నిషిద్ధ జాబితాలో చేర్చింది. ఆ క్రమంలో చైనా-అమెరికా, చైనా-తైవాన్‌ వైరం భారత్‌కు లాభించే అవకాశాలు దండిగా ఉన్నాయి. అందుకే భారత గడ్డపై వచ్చే ఆరేళ్లలో మైక్రోచిప్‌ల ఉత్పత్తికి బలమైన వేదికను ఏర్పరచేందుకు కేంద్ర ప్రభుత్వం సెమీకండక్టర్‌ విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు చొప్పున సెమీకండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ యూనిట్ల స్థాపనకు పెట్టుబడి వ్యయంలో 50శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. భారత్‌లో చిప్‌ల ఉత్పత్తి, డిజైనింగ్‌ కేంద్రాలను నెలకొల్పడానికి ముందుకొచ్చే సంస్థలకు కేంద్రం తాజాగా రూ.76,000 కోట్ల ప్రోత్సాహక పథకం ప్రకటించింది. దానివల్ల భారత్‌లో 20 కర్మాగారాలు స్థాపితమవుతాయని అంచనా. తన ప్రోత్సాహక పథకం రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని కేంద్రం భావిస్తోంది.

భారత్‌కు రప్పించేందుకు యత్నాలు

భారత్‌లో సెమీ కండక్టర్ల వినియోగం ఏటా 15శాతం చొప్పున పెరుగుతోంది. వాటిని సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యం లేనందువల్ల అవసరమైన మైక్రోచిప్‌లలో 40శాతాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. చిప్‌ల కోసం పూర్తిగా విదేశాలపై ఆధారపడితే మన ఆర్థిక, సైనిక ప్రయోజనాలు దెబ్బతింటాయని గ్రహించి దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఇండియా నడుంకట్టింది. మైక్రోచిప్‌ల డిజైన్‌ నుంచి ఉత్పత్తి, కూర్పు వరకు స్వావలంబన సాధించడం ఈ విధాన లక్ష్యం. అయిదు నానోమీటర్లకన్నా చిన్నవైన అత్యధునాతన చిప్‌లను డిజైన్‌ చేసే సామర్థ్యం కేవలం మూడు కంపెనీలకే ఉంది. అవి- ఇంటెల్‌ (అమెరికా), టీఎస్‌ఎంసీ (తైవాన్‌), శామ్‌సంగ్‌ (దక్షిణ కొరియా).అధునాతన చిప్‌ల ఉత్పత్తి ప్రధానంగా తైవాన్‌, దక్షిణకొరియాలలోనే జరుగుతోంది. చైనా కంపెనీ ఎస్‌ఎంఐసీ కార్లు, టీవీల్లో వాడే 28 నానోమీటర్ల చిప్‌లను మాత్రమే తయారు చేయగలదు. చిప్‌ల తయారీకి కావలసిన యంత్రాలను నెదర్లాండ్స్‌కు చెందిన ఏఎస్‌ఎంఎల్‌ అనే కంపెనీ ఒక్కటే తయారు చేస్తోంది. ఇలా చిప్‌ సరఫరా గొలుసులు దేశదేశాల్లో విస్తరించి ఉన్నాయి. దాన్ని అవకాశంగా మలచుకుని తైవాన్‌ కంపెనీలను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం యత్నిస్తుండగా, వాటికి పొరుగు సేవలు అందించేందుకు టాటా గ్రూప్‌ ప్రయత్నిస్తోంది. తైవాన్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్‌ చర్చలు జరుపుతోంది. ప్రపంచంలో 50శాతం సెమీకండక్టర్లను తయారుచేసే టీఎస్‌ఎంసీని భారత్‌లో ఏదో ఒక నగరంలో కర్మాగారం స్థాపించాల్సిందిగా కోరుతోంది. చిప్‌ల తయారీ చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే అమెరికాతో సహా ప్రధాన దేశాలు సెమీకండక్టర్‌ తయారీ యూనిట్‌ను స్థాపించే కంపెనీలకు 50శాతం పెట్టుబడి సమకూరుస్తున్నాయి. గతంలో కేవలం 25శాతం పెట్టుబడి సబ్సిడీని ఇచ్చిన భారత్‌, నేడు 50శాతం పెట్టుబడి వ్యయాన్ని అందిస్తానని ప్రకటించింది.

దీర్ఘకాలిక ప్రణాళిక  

సెమీకండక్టర్ల తయారీకి ఒక విడత ప్రోత్సాహకాలు ఇవ్వడంతో సరిపెట్టకుండా భారత్‌ 20 ఏళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ సుదీర్ఘ వ్యవధిలో నిపుణ మానవ వనరులను తీర్చిదిద్దుకొని, మౌలిక వసతులను ఏర్పరచుకోవాలని లక్షిస్తోంది. ఉపాధి అవకాశాలు దండిగా ఉండే ‘ఓశాట్‌’ విభాగంపైనా దృష్టి పెడుతోంది. సెమీకండక్టర్ల సరఫరా గొలుసులో పొరుగు సేవల కింద చిప్‌లను పరీక్షించడం, కూర్పు, ప్యాకేజింగ్‌ చేయడాన్ని ఓశాట్‌ విభాగంగా పరిగణిస్తారు. ఓశాట్‌ కంపెనీలకు 30శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని కొత్త విధానం ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే టాటా గ్రూప్‌ భారత్‌లో ఓశాట్‌ కేంద్రాన్ని నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంటెల్‌, ఏఎండీ, ఎస్‌టీ మైక్రో ఎలెక్ట్రానిక్స్‌ కంపెనీల తరఫున చిప్‌ల కూర్పు, ప్యాకేజింగ్‌ చేపట్టడం టాటా వ్యాపార వ్యూహం. ప్రపంచంలో అతిపెద్ద చిప్‌ తయారీదారులైన తైవాన్‌ కంపెనీలు-టీఎస్‌ఎంసీ, యూఎంసీలతో కలిసి చిప్‌ల తయారీ కోసం అది చర్చలు జరుపుతోంది. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన సెమీకండక్టర్ల విధానంపై వేదాంత గ్రూప్‌ సానుకూలంగా స్పందించింది. చిప్‌ల తయారీకి వచ్చే మూడేళ్లలో భారత్‌లో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. కర్మాగారాలను నెలకొల్పేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా సెమీకండక్టర్‌ సరఫరా గొలుసు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని క్వాడ్‌ సభ్య దేశాలైన అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ నిర్ణయించాయి. క్వాడ్‌తోపాటు తైవాన్‌, దక్షిణ కొరియాల భాగస్వామ్యాన్నీ ఆహ్వానించడం ద్వారా భారత్‌ తన సెమీకండక్టర్‌ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని యత్నిస్తోంది.

చిప్‌ డిజైన్‌లో సత్తా

సెమీకండక్టర్‌ పరిశ్రమ... చిప్‌ల డిజైన్‌నుంచి ఉత్పత్తి, కూర్పు, ప్యాకేజింగ్‌ వరకు అనేక పార్శ్వాల సమ్మేళనం. ప్రస్తుతం దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి జరగకపోయినా, వాటిని డిజైన్‌ చేసే పనిలో 24,000 మంది భారతీయ ఇంజినీర్లు నిమగ్నమై ఉన్నారు. ప్రధాన అంతర్జాతీయ సెమీకండక్టర్‌ కంపెనీలకు ఇక్కడ డిజైన్లను రూపొందించే యూనిట్లు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌లో 2000 మైక్రో చిప్‌లను డిజైన్‌ చేశారు. వాటిపై మేధాహక్కులు మాత్రం విదేశీ సెమీకండక్టర్‌ కంపెనీలవే. కేంద్రం ప్రకటించిన రూ.76,000 కోట్ల పథకంలో భాగంగా డిజైన్‌ అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని చేపట్టి, 100 స్వదేశీ సెమీకండక్టర్‌ రూపకల్పన కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. చిప్‌ డిజైనింగ్‌ సామర్థ్యం నుంచి ఉత్పత్తి స్థాయికి ఎదగడానికి భారత్‌ 2007, 2017లోనూ ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. చిప్‌ల ఉత్పత్తికి భారీ పెట్టుబడులు అవసరమనే కారణాన్ని అటుంచితే- వాటి తయారీకి నిరంతరాయంగా విద్యుత్‌, స్వచ్ఛమైన నీటిని అందించలేకపోవడం పెద్ద లోపం. భూమి, విద్యుత్‌, నీరు రాష్ట్రాల జాబితాలోని అంశాలు కాబట్టి, కొత్త జాతీయ సెమీ కండక్టర్‌ విధానంలో రాష్ట్రాలూ భాగస్వాములవుతాయి.

- వరప్రసాద్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చైనాకు పొరుగు పోటు

‣ నియంత్రణల నుంచి సరళీకరణ వైపు...

‣ భూమి హక్కుల్లో చిక్కులు

‣ హక్కుల పేరిట అమెరికా దూకుడు

Posted Date: 25-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం