• facebook
  • whatsapp
  • telegram

స్వశక్తితో అలుపెరుగని ప్రస్థానం

రక్షణ స్వావలంబనలో డీఆర్‌డీఓ

రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)’ పాత్ర కీలకం. భారత సాయుధ దళాల కోసం అత్యాధునిక రక్షణ సాంకేతికతలను, యుద్ధంలో గెలిపించే ఆయుధ వ్యవస్థలను రూపొందించే సామర్థ్యం డీఆర్‌డీఓ సొంతం. 1948లో డాక్టర్‌ డీఎస్‌ కొఠారి ప్రారంభించిన రక్షణ సర్వీసు సంస్థ (డీఎస్‌ఓ) నుంచి కాలక్రమంలో డీఆర్‌డీఓ ఆవిర్భవించింది. డీఎస్‌ఓ మొదట్లో ప్రధానంగా సలహాదారు పాత్రను నిర్వహించింది. సాయుధ దళాలకు పరిశోధన, బాలిస్టిక్స్‌, ఆయుధ శక్తి మూల్యాంకనం, శరీర ధర్మశాస్త్రం, పౌష్టికాహారం తదితర రంగాల్లో తోడ్పడింది. 1958 జనవరి ఒకటిన అవతరించిన డీఆర్‌డీఓ- సలహాదారు పాత్ర నుంచి సాయుధ దళాలకు కావలసిన ఆయుధాలు, ఇతర సామగ్రి రూపొందించే స్థాయికి ఎదిగింది.

భారీ ఆయుధ వ్యవస్థలు...

రక్షణ సమస్యల పరిష్కారానికి విజ్ఞానశాస్త్రాల వినియోగం, వివిధ ఆయుధాలు, రక్షణ వ్యవస్థల మూల్యాంకన బాధ్యతలనూ డీఆర్‌డీఓ చేపట్టింది. క్రమేణా ఉద్దండుల నాయకత్వంలో రక్షణ ఎలక్ట్రానిక్స్‌, క్షిపణులు, నౌకాదళానికి అవసరమైన సాంకేతికతల రూపకల్పన బాధ్యతలు తీసుకుంది. భారీ ఆయుధ వ్యవస్థలను రూపుదిద్ది ఉత్పత్తికీ తోడ్పడుతోంది. మహామహుల సారథ్యంలో విస్తృతరీతిలో శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను, మౌలిక వసతులను సమకూర్చుకుంది. 1970-80ల్లో డీఆర్‌డీఓ శాంతియుత ప్రయోజనాలకు అణు పరీక్షలు నిర్వహించింది. దూరాన్ని కచ్చితంగా కొలిచే సాధనాలను, రాకెట్లకు ఘన, ద్రవ ఇంధనాలను రూపొందించింది. మోర్టార్లు, క్షిపణులు, ఫిరంగులు, నిఘా రాడార్లు, ఇంద్ర రాడార్‌ను తయారుచేసింది. 1980-90 మధ్య యుద్ధ విమానాలు, ట్యాంకులు, అధునాతన క్షిపణుల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించింది. సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (ఐజీఎండీపీ), ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్‌, తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ తయారీకి సన్నాహాలు చేపట్టింది. పైలట్ల శిక్షణకు యుద్ధ విమాన సిమ్యులేటర్‌నూ తయారుచేసింది. ఇవి సాంకేతికంగా చాలా సంక్లిష్ట వ్యవస్థలు. వీటి అభివృద్ధికి విదేశీ సాంకేతిక సహకారం పొందడంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, పట్టుదలగా ముందడుగు వేసింది. నేల మీద నుంచి నేలపైకి ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించగల పృథ్వి క్షిపణి, దూరశ్రేణి క్షిపణి అగ్ని అభివృద్ధికి 1980-90 దశకంలో డీఆర్‌డీఓ అంకితమైంది. అత్యాధునిక క్షిపణుల అభివృద్ధి, తయారీకి ఈ దశాబ్దంలోనే గట్టి పునాది పడింది. ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వ్యవస్థనూ రూపొందించి, శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణ దళాలకు అందించింది.

1990లలో సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో జటిలమైన ఆయుధ వ్యవస్థలను రూపొందించింది. ప్రయోగశాలల్లో రూపొందిన నమూనాలను యుద్ధ రంగంలో ఉపయోగించుకోవడానికి సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతి ఉపకరించింది. విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమలతో చేతులు కలిపి కన్సార్షియం పద్ధతిలో వినూత్న ఆయుధ వ్యవస్థల రూపకల్పనకు నడుంకట్టింది. విదేశాలు మనకు ఇవ్వడానికి నిరాకరించిన పరిజ్ఞానాలను, పరికరాలను మనమే స్వయంగా తయారు చేసుకోవడానికి ఈ కన్సార్షియం పద్ధతి తోడ్పడింది. 90వ దశకంలో పృథ్వి, లక్ష్య, అజేయ ట్యాంకు, వంతెనలు నిర్మించే ట్యాంకు, సంచార వంతెనల నిర్మాణ వ్యవస్థలను రూపొందించుకున్నాం. 20వ శతాబ్దంలో ఏరోనాటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆయుధాలు, భూతల పోరాట సాధనాలు, సెన్సర్లు, ఏవియానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ యుద్ధ రీతులు, వైర్‌లెస్‌, ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, క్షిపణులు, నౌకాదళ ఆయుధ వ్యవస్థలు తదితరాలను డీఆర్‌డీఓ సొంతంగా రూపొందించసాగింది. రష్యాతో కలిసి బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూజ్‌ క్షిపణుల నిర్మాణం చేపట్టింది.

భవిష్యత్‌ సాంకేతికతలపై దృష్టి

ప్రత్యేక ఆయుధాల రూపకల్పనలోనూ డీఆర్‌డీఓ దూసుకెళ్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్‌, అంతరిక్ష సీమల్లో శత్రు దాడులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంతరించుకుంటూ, సమాచార సాంకేతికత (ఐటీ), స్మార్ట్‌ సెన్సర్లు, రోబోటిక్స్‌, కృత్రిమ మేధ, బిగ్‌ డేటా పరిజ్ఞానాలపై పట్టు సాధిస్తోంది. భావి యుద్ధాలలో కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉండటంతో వాటిని సాయుధ బలగాలకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు సాంకేతికతలు శత్రు సేనలపై నిఘా వేసి, వాటి నుంచి ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఎదురుదాడికి సమాయత్తం కావడానికి తోడ్పడతాయి. శత్రు రాడార్లకు కనిపించని అయిదో తరం ఏఎంసీఏ యుద్ధ విమానం, మలితరం ప్రధాన యుద్ధ ట్యాంకు, శత్రు విమానాలు, క్షిపణుల రాకను ముందే పసిగట్టి హెచ్చరించే అవాక్స్‌, కేంద్రీకృత లేజర్‌ ఆయుధాలు, దీర్ఘకాలం గాలిలో ఎగరగల మానవ రహిత డ్రోన్లు (యూఏవీ), దీర్ఘకాలం నీటి అడుగున సంచరించే మానన రహిత వాహనాలు, సౌర శక్తితో నడిచే యూఏవీలు, రోబోటిక్స్‌, కృత్రిమ మేధ పోరు వ్యవస్థలు, హైపర్‌ సోనిక్‌ ఆయుధాల రూపకల్పనను డీఆర్‌డీఓ చేపట్టింది. 35 ఏళ్లలోపు యువ శాస్త్రజ్ఞులతో కూడిన అయిదు బృందాలను ఏర్పాటు చేసి కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, కాగ్నిటివ్‌ సాంకేతికతలు, స్మార్ట్‌ పదార్థాలు, ఎసిమెట్రిక్‌ సాంకేతికతల అభివృద్ధికి నియోగించింది. ప్రస్తుతం ప్రధాన మంత్రి ద్వారా ‘భారత్‌లో తయారీ’ పిలుపునకు అనుగుణంగా రక్షణకు సంబంధించిన అన్ని రంగాల్లో స్వశక్తి, స్వావలంబన సాధిస్తోంది. పరిశ్రమలకు రాయల్టీ రుసుము లేకుండా కొత్త సాంకేతికతలను అందిస్తూ ఆయుధోత్పత్తిని ముమ్మరం చేస్తోంది. ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తికి పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మున్ముందు దేశం ఆయుధాల ఎగుమతి సామర్థ్యం పెంచుకొనే దిశగా డీఆర్‌డీఓ పరిశ్రమలతో కలిసి పనిచేస్తోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

అపూర్వ విజయాలు

నేల మీద నుంచి నేలకు, నేల నుంచి నింగికి, నింగి నుంచి నింగికి ప్రయోగించే క్షిపణులను, క్రూజ్‌ క్షిపణులు, పలు వేదికల నుంచి ప్రయోగించగల క్షిపణులు డీఆర్‌డీఓ కృషితో రూపొందాయి. తేజస్‌ యుద్ధ విమానం, అర్జున్‌ ట్యాంకు, ఉప్రగహ విధ్వంస క్షిపణి, రాడార్‌ నిరోధక రుద్రం క్షిపణి, పినాక రాకెట్‌ వ్యవస్థ, రుస్తుం-2 పైలట్‌ రహిత విమానం రూపకల్పనలో అపూర్వ విజయాలు సాధించింది. ఏసా రాడార్లు, జలాంతర్గాముల కోసం సోనార్లు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలు, అత్యధిక దూరాలదాకా గుండ్లను పేల్చగలిగే 155 మి.మీ. శతఘ్ని తదితర అధునాతన ప్రత్యేక ఆయుధాలను రూపొందించింది. ఇలాంటి ప్రత్యేక పరిజ్ఞానాలున్న అతి కొద్ది దేశాల సరసన భారత్‌ సగర్వంగా నిలుస్తోంది. ఇటీవల నేల మీద నుంచి నేలకు ప్రయోగించే ప్రళయ్‌ క్షిపణిని ప్రయోగించి స్వల్పకాలంలోనే సంక్లిష్ట ఆయుధాలను సృష్టించే సత్తా ఉందని నిరూపించింది. అత్యాధునిక అగ్ని పి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. శత్రు డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేయగల వ్యవస్థనూ రంగంలోకి దించుతోంది. ఈ డ్రోన్‌ నిరోధక సాంకేతికతను పరిశ్రమలకూ బదిలీ చేస్తోంది. మన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను శత్రు రాడార్లు, క్షిపణుల నుంచి రక్షించే అధునాతన ఎలెక్ట్రానిక్‌ యుద్ధ సాంకేతికతను సిద్ధం చేసింది.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు

‣ ఓటరు మౌనం... పార్టీల్లో ఉత్కంఠ!

‣ అందరికీ అందని వైద్య సేవలు

‣ ప్రాథమిక హక్కులకే అగ్రాసనం

‣ ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం