• facebook
  • whatsapp
  • telegram

సమర్థ నిర్వహణతోనే జల సంరక్షణ

సమస్త జీవజాలం మనుగడకు నీరు అత్యావశ్యకం. జల వనరుల సంరక్షణ పట్ల ఆధునిక సమాజంలో అలక్ష్యం పెరుగుతోంది. దాంతో నీటి వనరులు కుంచించుకుపోతున్నాయి. భూగర్భ జలాలపైనా ఆ ప్రభావం పడుతోంది. ఫలితంగా నీటి ఎద్దడి సమస్య ముమ్మరిస్తోంది.

మానవ మనుగడకు, ఆర్థికాభివృద్ధికి నీటి వనరుల పరిరక్షణ కీలకం. అందుకే దేశీయంగా జల వనరుల సంరక్షణపై ప్రభుత్వాలు, ప్రజలు సమధిక దృష్టి సారించాలి. వాటిని సంరక్షించుకోవాలి. భారత్‌లో భూగర్భ జలాల్లో 80శాతం సేద్యానికి, 12శాతం పరిశ్రమలకు, ఎనిమిది శాతం తాగు నీటికి వినియోగిస్తున్నారు. భూగర్భ జల వనరుల అంచనా నివేదిక-2022 ప్రకారం దేశీయంగా పంజాబ్‌, హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌లలో భూగర్భ జలాలను అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. బెంగళూరు, దిల్లీ, చెన్నై వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు మరింతగా క్షీణించే ముప్పు ఉందని నీతి ఆయోగ్‌ గతంలోనే హెచ్చరించింది. దేశవ్యాప్తంగా సుమారు 256 జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గ్రామీణ భారతంలో 85శాతం ప్రజలు తాగునీటికి, రోజువారీ అవసరాలకు భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. అందుకే భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ నిర్వహణ, అవి కలుషితం కాకుండా చూడటం అత్యావశ్యకం.

భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల మరమ్మతు, పునరుద్ధరణ తదితరాల కోసం ప్రత్యేక జలగణన చేపట్టాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. ఆ మేరకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ 2018-19లో జలగణన చేపట్టింది. ఆ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షలకు పైగా కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, సరస్సుల వంటి జల వనరులు ఉన్నాయి. అందులో ముప్ఫై ఎనిమిది వేలకు పైగా ఆక్రమణకు గురయ్యాయి. దాదాపు నాలుగు లక్షల జలవనరులు నిరుపయోగంగా మారాయి. 97.1శాతం జల వనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 2.9శాతమే నగరాలు, పట్టణాల్లో నెలకొన్నాయి. దేశీయంగా నీటి సంరక్షణ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన చెక్‌ డ్యాములు వంటి నీటి వనరులు 12.7శాతమే. మొత్తం నీటి వనరుల్లో 55శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనే ఉన్నాయి. నేటికీ 45శాతం జల వనరులు ఎలాంటి మరమ్మతులకూ నోచుకోవడం లేదు.

ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా 18శాతం. నీటి వనరుల పరంగా ఇండియా వాటా నాలుగు శాతమే. విచ్చలవిడి వాడకంతో పాటు, తగిన సంరక్షణ చర్యల లేమితో భారత్‌లో నీటి కొరత ఏర్పడుతోంది. దీన్ని నివారించాలంటే కుంటలు, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా పూడికతీత పనులు చేపట్టాలి. నిరుపయోగంగా ఉన్న జల వనరులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలి. అవి ఆక్రమణకు గురికాకుండా చూడటమూ తప్పనిసరి. జల వనరుల్లోకి చెత్తా చెదారం వంటివి రాకుండా జాలీలను ఏర్పాటు చేయాలి. ప్రజలు వ్యర్థాలను నీటి వనరుల్లో వేసి కలుషితం చేయకుండా గస్తీ ఏర్పాటు చేయాల్సిన అవసరమూ ఉంది. వాన నీటిని ఒడిసిపట్టి సంరక్షించడంతో పాటు, వాడిన జలాన్ని శుద్ధిచేసి భూమిలోకి ఇంకేలా చేయాలి.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వాన నీటి సంరక్షణ, మురుగు నీటి నిర్వహణ పనులను విరివిగా చేపట్టాలి. నగరాలు, పట్టణాల్లో భారీ విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలు, సంస్థలు తప్పనిసరిగా తమ ప్రాంగణంలోనే మురుగు నీటిని శుద్ధి చేసి భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టాలి. బహుళ అంతస్తుల భవనాల్లోనూ వాన, వాడిన నీరు భూమిలోకి ఇంకేలా చూడాలి. నీటి వనరుల పరిరక్షణకు ప్రజలు, స్థానిక, స్వచ్ఛంద సంస్థలు, వాటర్‌షెడ్‌ కమిటీలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు కలిసి కట్టుగా కృషి చేయాలి. జల్‌శక్తి అభియాన్‌, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటల్‌ భూజల్‌, ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజనలు, అమృత్‌ సరోవర్‌ వంటి పథకాలను సమన్వయంతో చేపట్టాలి. స్థానిక నీటి సంరక్షణ విధానాలకు శాస్త్రీయత కల్పించి, సాంకేతికత సాయంతో సమర్థంగా ఆచరణ రూపంలోకి తేవాల్సిన అవసరం ఉంది. జల వనరుల సమర్థ నిర్వహణతో భూగర్భ జలాలు పెరుగుతాయి. అవి సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయి. జల వనరులను సంరక్షిస్తేనే- దేశీయంగా నీటి ఎద్దడిని నివారించడం సాధ్యమవుతుంది.

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పాక్‌ ఆర్థికం.. అతలాకుతలం!

‣ భూతాపంతో అకాల వర్షాలు

‣ కాలుష్యం కట్టడికి సహజ వాయువు

‣ సాగర వ్యూహం.. సరికొత్త బంధం!

Posted Date: 12-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని