• facebook
  • whatsapp
  • telegram

పాక్‌ ఆర్థికం.. అతలాకుతలం!

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తరిగిపోతున్న విదేశ మారక ద్రవ్య నిల్వలు, గుదిబండలా మారుతున్న రుణ భారం- పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి నుంచి దాయాది దేశం కోలుకోవడం అంత తేలిక కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్‌ నిలిచింది. అక్కడ చిల్లర ధరల ద్రవ్యోల్బణం నిరుడు ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో 36.4శాతం పెరిగింది. ధరల పెరుగుదల విషయంలో శ్రీలంకనూ ఇస్లామాబాద్‌ మించిపోయింది. ప్రస్తుతం అప్పులు చెల్లించలేని దుస్థితి పాక్‌కు దాపురించింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి ఆర్థిక సాయం పొందినా పరిస్థితి మెరుగుపడలేదు. నిజానికి 1960-90 మధ్య కాలంలో దక్షిణాసియాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా పాక్‌ నిలిచింది. 1990లో పాకిస్థాన్‌లో ఒక వ్యక్తి సగటు సంపాదన ఇండియాతో పోలిస్తే దాదాపు 25శాతం అధికం. అలాంటి పాక్‌ ప్రస్తుతం దారుణమైన దుస్థితిలోకి జారిపోయింది.

అప్పుల ఊబిలోకి..

పాక్‌లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం ముప్ఫై శాతానికి మించి ఎగబాకింది. గత 48 ఏళ్లలో ఇదే గరిష్ఠం. ప్రస్తుతం లీటరు పెట్రోలు అక్కడ 280 పాకిస్థాన్‌ రూపాయలు, డీజిలు 290, కిరోసిన్‌ 200, కిలో చికెన్‌ 780, లీటరు పాలు 235 పాక్‌ రూపాయలు పలుకుతున్నాయి. వీటిని భరించే స్థోమత లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఔషధాల కొరతా తీవ్రంగా ఉంది. మూడు నెలల క్రితం ఒక డాలరుతో పాకిస్థాన్‌ రూపాయి మారకపు విలువ 231గా ఉండేది. ఇప్పుడది సుమారు 280 పాకిస్థాన్‌ రూపాయలకు చేరింది. దానివల్ల దిగుమతులు మరింత భారమవుతాయి. ప్రస్తుత పాక్‌ విదేశ మారక ద్రవ్య నిల్వలు నాలుగు లేదా అయిదు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. పాకిస్థాన్‌ మొత్తం విదేశీ రుణం నిరుడు డిసెంబరు నాటికి సుమారు 13,000 కోట్ల డాలర్లు. జీడీపీలో ఇది 95.39శాతం. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న మూడేళ్ల వ్యవధిలోనే పాక్‌ విదేశీ రుణభారం రెట్టింపు అయ్యింది. చైనా నుంచి గత మూడేళ్లలో పాకిస్థాన్‌ 500 కోట్ల డాలర్ల అప్పు తెచ్చింది. 75 ఏళ్లలో ఐఎంఎఫ్‌ నుంచి ఇస్లామాబాద్‌ 23 సార్లు రుణం తీసుకుంది. ఇన్నిసార్లు మరే దేశమూ అప్పు చేయలేదు. మరోసారి రుణం కోసం పాక్‌ ఐఎంఎఫ్‌ చుట్టూ తిరుగుతోంది.

ప్రజలకు విపరీతంగా ఉచితాల హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయడమే పాక్‌ ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్క ప్రభుత్వం వాటి దుష్ఫలితాలపై దృష్టి సారించలేదు. ఉచితాలను అందించడానికి భారీగా అప్పులు చేశాయి. భవిష్యత్తులో ఆదాయాలను సృష్టించే వాటిపై రుణాలను ఖర్చు చేస్తే తప్పులేదు. ఉచితాలు, ఆయుధాలు, సంఘ విద్రోహ కార్యకలాపాలపై అప్పులను వెచ్చించిన దేశం దివాలా తీయాల్సిందే. పాక్‌లోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇస్లామాబాద్‌ మొత్తం రుణంలో ఒక్క చైనా వాటాయే 30శాతం. పాక్‌లో కొన్నేళ్లుగా చైనా భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. వాటిపై డ్రాగన్‌ ఆరు శాతం వడ్డీ వసూలు చేస్తోంది. బీజింగ్‌ ఆర్థిక సహకారంతోనే చైనా-పాకిస్థాన్‌ నడవాలో భాగంగా గ్వాదర్‌ పోర్టును అభివృద్ధి చేశారు. ఎలాంటి ఆదాయం లేకపోవడంతో అది తెల్ల ఏనుగులా మారింది. పాత రుణాలు తీర్చడానికి పాక్‌ మళ్ళీ కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. గతంలో సౌదీ అరేబియా నుంచి తీసుకున్న రుణం గడువు తీరడంతో దాన్ని కొంతమేర చెల్లించింది. దానికోసమూ అప్పు చేసింది. ఇలా ఇస్లామాబాద్‌ రుణాల ఊబిలో కూరుకుపోయింది. తిరిగి అప్పు చెల్లించే ప్రణాళికల గురించి పట్టించుకోకుండానే రుణాలు తీసుకుంటోంది. గతంలో రుణాల కోసం బాండ్లను పాక్‌ విడుదల చేసింది. గడువు తీరేనాటికి వడ్డీతో వాటిని చెల్లించాలి. అవి ప్రభుత్వానికి చాలా భారంగా మారాయి.

కార్మికుల ఇక్కట్లు

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా- పాక్‌లో నిరుడు వచ్చిన వరదలు ఆ దేశానికి భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. దేశం క్లిష్ట సమస్యల్లో ఉంటే విలాసవంతమైన కార్లను దిగుమతి చేసుకోవడానికి పాక్‌ సెంట్రల్‌ బ్యాంకు విదేశ మారక ద్రవ్య నిల్వలను విడుదల చేయడం స్థానికుల్లో ఆగ్రహం రగిలించింది. మరోవైపు విదేశ మారక ద్రవ్య నిల్వల కొరతతో కంపెనీలు ముడిసరకులు లభించక ఉత్పత్తిని నిలిపివేశాయి. దాంతో భారీ సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారు. వస్త్ర పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది. దేశ విద్యుత్‌ గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు చైనా ఆర్థిక సహకారంతో భారీ వ్యయంతో నిర్మించిన అణు విద్యుత్‌ కేంద్రం సైతం నిరుడు వరదలకు దెబ్బతిని పనిచేయడం లేదు. ఈ కష్టాలకు తోడు పాక్‌లో ఆత్మాహుతి దాడులు సర్వ సాధారణమయ్యాయి. ఇటీవల ఇలాంటి ఘటనలో పెషావర్‌లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. రాబోయే మూడేళ్లలో పాక్‌ ప్రభుత్వం 8,000 కోట్ల డాలర్ల విదేశీ అప్పును తిరిగి చెల్లించాలి. ప్రస్తుతం ఇస్లామాబాద్‌ దుస్థితి చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పోనుపోను దాయాది దేశం మరింత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అప్రమత్తత  అవసరం

ఒక వైపు ప్రజలు తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆయుధాలపై పాక్‌ భారీగా వెచ్చిస్తోంది. బెలూచిస్థాన్‌లో భారీగా ఖనిజ సంపద ఉంది. పరిశ్రమల స్థాపనకు ఆ ప్రాంతం చాలా అనుకూలం. అక్కడ వేర్పాటువాద ఉద్యమం మొదలు కావడంతో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. రాజకీయ అస్థిరతకూ పాక్‌ నెలవైంది. ఇప్పటిదాకా అధికారాన్ని చేపట్టిన 30 మంది ప్రధానుల్లో ఏ ఒక్కరూ పూర్తిగా అయిదేళ్ల పాటు పాలన కొనసాగించలేదు. పాక్‌ జనాభాలో సగం మంది 22 ఏళ్ల లోపు యువతే. వారిని విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలంటే విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ వంటి వాటిపై సమధికంగా వెచ్చించాలి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో దాయాది దేశం యువతలో చాలామంది ఉగ్రవాదం వైపు మొగ్గుతున్నారు. ఇలాంటివారి విషయంలో భారత్‌ జాగరూకతతో వ్యవహరించాలి. సంక్షోభం ముదురుతున్న దృష్ట్యా పాక్‌ నుంచి ఇండియాలోకి వలసలు పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. వాటిపై భారత్‌ అప్రమత్తతతో ఉండాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూతాపంతో అకాల వర్షాలు

‣ కాలుష్యం కట్టడికి సహజ వాయువు

‣ సాగర వ్యూహం.. సరికొత్త బంధం!

‣ భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా

‣ సౌరశక్తితో ఇంధన భద్రత

‣ శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం!

Posted Date: 12-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం