• facebook
  • whatsapp
  • telegram

హిమంత ముందు ముళ్లబాట

అసోమ్‌ కొత్త సర్కారుకు సమస్యల స్వాగతం

హిమంత బిశ్వశర్మ నాయకత్వంలోని అసోమ్‌ కొత్త ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. శక్తియుక్తులన్నింటినీ సమీకరించుకుని వెంటనే కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టవలసిన అవసరాన్ని కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసుల రూపంలో నూతన ముఖ్యమంత్రికి తక్షణ సవాలు ఎదురవుతోంది.

ఎన్నికల ప్రచారం, పోలింగ్‌, ఓట్ల లెక్కింపులతో పాటు ఏప్రిల్‌ మధ్యలో అంబరమంటిన బోహగ్‌ బిహు (అస్సామీల కొత్త సంవత్సరాది) వేడుకలతో రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి జోరందుకుంది. రోజుకు సగటున అయిదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు ఎనిమిది శాతానికి చేరుతోంది. పరిస్థితి మరింత విషమించకముందే హిమంత రంగంలోకి దిగాలి. వైద్య సదుపాయాలు, ఉపకరణాలు, ఔషధాలు, ఆక్సిజన్‌లకు కొరత ఏర్పడకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేయాలి. విపరీతమైన ఒత్తిడితో ఇప్పటికే అలసిపోయిన వైద్యులు, సిబ్బందితో సమన్వయం చేసుకొంటూ కొవిడ్‌ను కట్టడి చేయాలి. కరోనాపై రాష్ట్రం చేస్తున్న యుద్ధాన్ని సమర్థంగా ముందుకు నడిపించేందుకు గతంలో ఆరోగ్య మంత్రిగా హిమంత సముపార్జించుకున్న అనుభవం అక్కరకు రానుంది. తనపై నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడమూ హిమంతకు కత్తిమీద సామే!

నిరుద్యోగ సమస్యతో అసోమ్‌ అల్లాడుతోంది. ఏటా 15 లక్షల మంది యువత నిరుద్యోగుల జాబితాలోకి కొత్తగా వచ్చి చేరుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 8.1 శాతానికి చేరింది. ముఖ్యంగా స్త్రీలలో ఇది 13.9 శాతానికి పెరిగిపోయింది. జాతీయ మహిళా నిరుద్యోగితా రేటు 5.7 శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ! ఈ పరిస్థితుల్లో ఏడాదికి లక్ష కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్న హిమంత హామీ పూర్తిగా అమలులోకి వచ్చినా సమస్య పరిష్కారం కాబోదు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం కలిసివస్తేనే యువత ఆకాంక్షలు ఈడేరతాయి. సాధారణంగా పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు ఊపందుకుంటాయి. కానీ, రాష్ట్రంలో ప్రైవేటు రంగం దాదాపు శూన్యం! పెట్టుబడులకు ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం ఉండదన్న పేరు చేటుచేస్తోంది. దశాబ్దాల పాటు నిత్యకృత్యాలైన ఆందోళనలతో రూపుదిద్దుకున్న రాష్ట్ర సామాజిక రాజకీయ సంస్కృతి పెట్టుబడిదారులను పెద్దగా ఆకర్షించడం లేదు. నీతిఆయోగ్‌ ఎగుమతి సంసిద్ధత సూచికలో 75.19 మార్కులతో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంటే, 22.81 మార్కులతో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసోమ్‌ 28వ స్థానంలో నిలిచింది. మరోవైపు, రాష్ట్ర ఆర్థికవృద్ధిపై ప్రస్తుత మహమ్మారి- దాని తదనంతర పరిణామాలూ ప్రభావం చూపనున్నాయి. ఈ చీకటి మేఘాలు చెదిరిపోయి ఆర్థికంగా అసోమ్‌ వృద్ధి సాధించాలంటే పెట్టుబడులకు స్నేహపూరిత వాతావరణం కల్పించాలి. మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ పెట్టుబడులను ఆకర్షించగలగాలి. అంతిమంగా నిరుద్యోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. మరోవైపు, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా కొత్త ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సి ఉంది. మౌలిక వసతుల కల్పనలో రహదారుల నిర్మాణం ప్రధానమైనది. అసోమ్‌లోని ప్రాకృతిక పరిస్థితుల కారణంగా ఇలాంటి కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వీటిని తట్టుకుని కొత్త ప్రభుత్వం అభివృద్ధిని పట్టాలెక్కించాల్సి ఉంటుంది. ‘తూర్పు వైపు అడుగు’ (యాక్ట్‌ ఈస్ట్‌) విధానంలో భాగంగా అసోమ్‌ను ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా అభివృద్ధి చేయడం ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. ఇప్పటి వరకు ఇది కాగితాలపైనే ఉంది. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే బాధ్యతనూ హిమంత నెరవేర్చాల్సి ఉంది. సరిహద్దు దేశమైన మయన్మార్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులపైనా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరముంది.

అనేక ఆదివాసీ జాతులు, వివిధ మతాలు, సంస్కృతుల కలబోత అయిన అసోమ్‌లో విభిన్న ఆకాంక్షలు, అంచనాలు నిత్యం జ్వలిస్తూ ఉంటాయి. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న తిరుగుబాటు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. లెక్కకుమిక్కిలిగా జరిగిన చర్చల తరవాతా ఉల్ఫాతో ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 1985 అసోమ్‌ ఒడంబడికలో హమీ ఇచ్చిన మేరకు అస్సామీల సంస్కృతి, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఇంకా అలాగే ఉన్నాయి. వీటికి ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వ్యతిరేక ఆందోళనలు తోడయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న భాజపాకు- అసలు కష్టం ఇప్పుడే మొదలు కాబోతోంది.

- సంజీవ్‌ కె. బారువా

Posted Date: 17-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం