• facebook
  • whatsapp
  • telegram

నవీన సాంకేతికతతో సరికొత్త సేవలు

జాతీయ సాంకేతిక దినోత్సవం. నానాటికీ అందివస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చాలా మంచితో పాటు కొంత చెడూ కనిపిస్తోంది. మానవ నిత్య జీవన కార్యకలాపాల్లో సౌలభ్యం పెరగడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం కొన్ని సానుకూలతలు. ప్రజల్లో మానసిక రుగ్మతలు, హింసాత్మక ప్రవృత్తి అధికం కావడం తదితరాలు ప్రధానమైన నష్టాలు.

పాతికేళ్ల క్రితం ఇదే రోజున రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘ఆపరేషన్‌ శక్తి’ పేరిట భారత్‌ నిర్వహించిన అణు పరీక్షలు ప్రపంచాన్ని నివ్వెరపరచాయి. అవి విజయవంతం కావడంతో అణు శక్తి సంపన్న దేశాల జాబితాలో ఇండియా స్థానం సంపాదించుకున్నట్లు అయింది. అదే స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో మే 11ను ‘జాతీయ సాంకేతిక  దినోత్సవం’గా అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రకటించారు. గత రెండున్నర దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్ర, సాంకేతిక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తత్ఫలితంగా సమాజం తీరుతెన్నులు, ప్రజల జీవన విధానం ఎంతగానో మార్పులకు లోనయ్యాయి. విద్య, వైద్యం, రవాణా, సమాచార మార్పిడి, అంతరిక్ష పరిజ్ఞానం, ఎలెక్ట్రానిక్స్‌ విభాగాల్లో సాంకేతిక మార్పులు ప్రపంచం రూపురేఖల్ని శరవేగంగా మార్చివేస్తున్నాయి.

భారీ మార్పులు

పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుత సమాజం కొత్తగా, నిత్య నూతనంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం సాంకేతిక మార్పులే. ప్రస్తుతం మనుషుల నిత్య జీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారిపోయింది. సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా, కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధతో పనిచేసే గృహోపకరణాలు లేకుండా రోజు గడవదు. ఉత్పత్తి, సేవా రంగాలనూ నూతన సాంకేతిక పరిజ్ఞానం విశేషంగా ప్రభావితం చేస్తోంది. ఉత్పత్తి ప్రక్రియలు ఎంతో వేగవంతం అవుతున్నాయి. గతంలో ఊహకే అందని ఎన్నో వస్తువులు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం వీలు కల్పిస్తోంది. ఆన్‌లైన్‌ శిక్షణ సర్వసాధారణం అవుతోంది. అడ్మిషన్లు, బోధన, పరీక్షల నిర్వహణలో కంప్యూటర్ల పాత్ర పెరిగింది. చిటికెలో ఎక్స్‌రే తీసి, దాన్ని డాక్టరు తన సెల్‌ఫోన్లోనే చూసి జబ్బు ఏమిటనేది నిర్ధారించే సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సాంకేతిక మార్పులు ఇంతటితో ఆగిపోలేదు. మలిదశ విప్లవం ఇప్పుడే ప్రారంభమైంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌ జీపీటీ, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, డ్రోన్లు, ముఖాన్ని గుర్తించే యాప్‌లు, గూగుల్‌ మ్యాప్స్‌ తదితరాలు మనం ఇంతకు ముందెన్నడూ ఊహించని మార్పులను తీసుకు రాబోతున్నాయి.

మారిన అంతర్జాతీయ రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలో దిగుమతుల కోసం చైనాపై అధికంగా ఆధారపడకూడదని అమెరికా, ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. డ్రాగన్‌కు ప్రత్యామ్నాయంగా వియత్నాం, ఇండొనేసియాతో పాటు భారత్‌ వైపు ఆయా దేశాల్లోని అంతర్జాతీయ సంస్థలు చూస్తున్నాయి. ఇప్పటికే ఏటా దాదాపు 15,000 కోట్ల డాలర్ల సాఫ్ట్‌వేర్‌, 2,500 కోట్ల డాలర్ల ఔషధాలను ఇండియా ఎగుమతి చేస్తోంది. ఇకపై ఎలెక్ట్రానిక్స్‌, రక్షణ రంగ తయారీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎగుమతులను పెంచుకునే అవకాశం ఉంది. యూఎస్‌కు చెందిన ఎలెక్ట్రానిక్స్‌ దిగ్గజమైన ఆపిల్‌- స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తి కార్యకలాపాలను చైనా నుంచి పాక్షికంగా మనదేశానికి మళ్ళిస్తోంది. ఇక బోయింగ్‌, ఎయిర్‌బస్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌ వంటి అగ్రగామి ఏరోస్పేస్‌ సంస్థలు స్థానిక కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడే తయారీ కార్యకలాపాలు చేపడుతున్నాయి. క్షిపణులు, రాడార్లు, ఇతర ఆయుధ, నిఘా పరికరాల ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇవన్నీ నూతన సాంకేతిక పరిజ్ఞాన ఫలాలే. ఇకపై దీన్ని మరింత ప్రభావాన్వితంగా కొనసాగించడానికి ఇండియా కృషి చేయాలి. సాంకేతిక పరిశోధనల అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించాలి.

పరిమితులను నిర్దేశించుకొని..

నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మంచితో పాటు చెడూ ఉంది. మనుషులు ప్రతి చిన్న పనికీ టెక్నాలజీపై ఆధారపడి మెదడుకు, శరీరానికి పని చెప్పడం మానేస్తున్నారు. దానివల్ల శారీరక, మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి. ఇక డిజిటల్‌ టెక్నాలజీ, క్లౌడ్‌, డేటా మైనింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తున్న తరుణంలో సైబర్‌ నేరాలు, మోసాలు అధికమవుతున్నాయి. పొరుగు దేశాల నుంచి సైబర్‌ దాడులు, హ్యాకింగ్‌తో ఇండియా రక్షణ, బ్యాంకింగ్‌ వ్యవస్థలకు ముప్పు పొంచి ఉంది. యూకే, అమెరికాతో పాటు భారత్‌లోనూ సైబర్‌ నేరాల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిపై దేశీయంగా ప్రజల్లో చాలా మందికి సరైన అవగాహన ఉండటం లేదు. మరోవైపు సోషల్‌ మీడియాను వినియోగించుకొని తప్పుడు ప్రచారాలు చేపట్టడం, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడం ఎంతగానో పెరిగింది. దానివల్ల సరికొత్త వివాదాలు తలెత్తి సమాజంలో శాంతి, సామరస్యం దెబ్బతింటున్నాయి. మితిమీరిన టెక్నాలజీ వినియోగం వైద్య రంగంలో కొత్త సమస్యలకు తావిస్తోంది. వ్యాధి నిర్ధారణలో, శస్త్రచికిత్సల్లో పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడటం వల్ల కొన్నిసార్లు తప్పులు చోటుచేసుకొని రోగులు నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞానంపై అమితంగా ఆధారపడటం వల్ల ఎదురవుతున్న సమస్యలే. మానవాళి జీవనాన్ని సులభతరం చేయడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, అందిపుచ్చుకోవడం తప్పనిసరి. అయితే, దాని వినియోగంలో తగిన పరిమితులను నిర్దేశించుకొని వివేచనతో ముందుకు సాగడం అత్యావశ్యకం. అప్పుడే మెరుగైన భారతావని ఆవిష్కరణ సుసాధ్యమవుతుంది.

కనిపిస్తున్న ఫలితాలు

డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్‌ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ ఫలితాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. చెల్లింపుల వ్యవస్థ ప్రస్తుతం ఎంతగానో మారింది. చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు- వెంటనే నగదు చెల్లింపులు జరపవచ్చు. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ (ఏఆర్‌-వీఆర్‌) వల్ల మీడియా- వినోద- గేమింగ్‌ రంగాల్లో కొత్తదనం చోటుచేసుకుంటోంది. 5జీ సాంకేతికతతో సరికొత్త సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇండియా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. ఇప్పటికే సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న భారత్‌ ఉత్పత్తి విభాగంలోనూ తనదైన ముద్ర వేయడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా వెలుగొందుతోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేయడం ద్వారా ఆ స్థానాన్ని భారత్‌ దక్కించుకొనే రోజు ఎంతో దూరంలో లేదు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా

‣ సౌరశక్తితో ఇంధన భద్రత

‣ శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం!

Posted Date: 13-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం