• facebook
  • whatsapp
  • telegram

పెచ్చరిల్లుతున్న పేదరికం

ఉపాధి తగ్గడమే కారణం

కరోనాను కట్టడి చేయడానికి విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రాలు లాక్‌డౌన్ల బాట పడుతున్నాయి. దీనితో ఉపాధి అవకాశాలు కొరవడి అనేక మంది పేదరికంలోకి జారిపోతున్నారని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్‌ కారణంగా ఆదాయ వనరులు కుంచించుకుపోవడంతో దేశంలో పేదరికం గణనీయంగా పెరిగిందని ఈ నివేదిక స్పష్టంచేస్తోంది. సుమారు 23 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు పడిపోయారు. శ్రమజీవుల ఆదాయం గతంలో కంటే సగటున 17 శాతం మేర కోసుకుపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో దారిద్య్రం ఇంకా పెరిగే ప్రమాదముంది. కాబట్టి ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కృషి చేస్తూనే ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి.  

పెరుగుతున్న అప్పుల భారం

ఏడాది కాలంగా ఉద్యోగ, ఉపాధి భద్రత లేక కోట్ల మంది శ్రామికులు, ప్రైవేటు ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాల్లో భారీ కోతల నుంచి ఉద్యోగాలను పూర్తిగా కోల్పోవడం వరకు అన్నిచోట్లా అభద్రత రాజ్యమేలుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు పేదలకు కాస్త ఊరట కలిగించినా, పట్టణ ప్రాంత శ్రామిక వర్గాలకు ఆ భరోసా సైతం కరవైంది. అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వస్తున్న ఆదాయానికీ ఖర్చులకూ లంకె కుదరక చాలామంది నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలు మూతపడటంతో వాటిలో పనిచేసే సుమారు 60 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి కోల్పోయారు. పేరున్న పాఠశాలలు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం పది శాతానికి మాత్రమే ఉద్యోగ భద్రత ఉంటోంది. వారూ చాలీచాలని జీతాలతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగిలిన వారు కుటుంబ పోషణ కోసం అసంఘటిత రంగంలో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. ఇటువంటి వారి ముందస్తు ఆర్థిక ప్రణాళికలన్నీ దెబ్బతిన్నాయి. అనేక మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. మరోవైపు, నానాటికీ క్షీణిస్తున్న ఉపాధి అవకాశాల ప్రభావం పేదలు, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం మీదా పడుతోంది. పౌష్టికాహారానికి దూరమైన వారు త్వరగా వ్యాధుల బారిన పడతారు. దీనికి తోడు దేశంలో సామాన్యుల ఆరోగ్య అవసరాలకు తగిన ఆర్థిక రక్షణలు లేకపోవడంతో ఏటా సుమారు 6.3 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోతున్నారని నీతిఆయోగ్‌ అంచనా వేసింది.

ప్రస్తుతం జనాభాలో అధిక శాతం తమ ఆదాయంలో 60 శాతాన్ని వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద దేశవ్యాప్తంగా 24 వేల ఆసుపత్రులలో పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని అందిపుచ్చుకోకపోవడంతో ప్రజలకు మేలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పంతాలూ పట్టింపులు మాని ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తే పేదలకు అప్పుల భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తే ఎక్కువ మందికి సురక్షిత వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఉపాధి అవకాశాలు ఇంకా మూసుకుపోతాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. గ్రామీణ పేదలను ఆదుకుంటున్న ఉపాధి హామీ పని రోజులను రెట్టింపు చేసి వేతనాలను పెంచాలి. పట్టణ ప్రాంత పేదలకూ దాన్ని వర్తింపజేయాలి. చిరు వ్యాపారులను ఉద్దీపన పథకాలతో ఆదుకోవాలి. పేదలకు నిత్యావసర సరకులను ఎక్కువ మొత్తాల్లో అందించాలి. ఎంతో మందిని అప్పుల పాలుచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలి.

ప్రజారోగ్య రంగం బలోపేతం

71వ జాతీయ నమూనా సర్వే ప్రకారం భారతీయుల వైద్యవ్యయంలో దాదాపు 71 శాతం ఔషధాలపైనే ఖర్చవుతోంది. దీన్ని నివారించాలంటే జనరిక్‌ మందుల దుకాణాలను ఇంకా ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావాలి. వాటిని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలి. వాటిలో అన్ని రకాల ఔషధాలు లభ్యమయ్యేలా చూడాలి. ఇప్పుడు ఎదురవుతున్న అనుభవాలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో పడకలు, ఇతర మౌలిక సదుపాయాలను పెంచాలి. ప్రజారోగ్య రంగంలో వైద్యులు, నర్సుల నియామకాల్లో జాప్యాన్ని నివారించాలి. సర్కారీ దవాఖానాల్లో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకొంటేనే సామాన్యుల ఆరోగ్యానికి భరోసా లభిస్తుంది. లేదంటే అంతకంతకూ అధికమవుతున్న వైద్యఖర్చుల భారంతో మరింత మంది అప్పులపాలై... అంతిమంగా దుర్భర పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతి బూడిదలో పోసిన పన్నీరు కాకూడదంటే పాలకులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి! 

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ (సెస్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

Posted Date: 24-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం