• facebook
  • whatsapp
  • telegram

మధ్యవర్తిత్వం... మేలిమి పరిష్కారం!

ప్రజా సహకారంతో సత్ఫలితాలు

అన్ని వివాదాలూ కోర్టుల్లోనే పరిష్కారం కానక్కర్లేదు. కోర్టు వెలుపల నిష్పాక్షిక మధ్యవర్తి సాయంతోనూ వాటిని పరిష్కరించుకోవచ్చు. దీన్ని ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్‌)గా వ్యవహరిస్తారు. మధ్యవర్తిత్వం వల్ల వ్యాజ్యం ఖర్చులు తగ్గుతాయి. వివాదాలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. న్యాయస్థానాల్లో కొండలా పేరుకుపోయిన అపరిష్కృత కేసుల భారమూ తరుగుతుంది. అమెరికా, కెనడా, ఐరోపా, జపాన్‌ దేశాల్లో ఏడీఆర్‌ ప్రక్రియకు చట్టబద్ధత ఉంది. వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి తొలి మెట్టుగా పరిగణించాలని, దానికోసం ఒక చట్టం తీసుకురావాలని గతేడాది భారత్‌-సింగపుర్‌ మధ్యవర్తిత్వ సదస్సులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రతిపాదించారు. తదనుగుణంగా ప్రభుత్వం 2021 డిసెంబరులో పార్లమెంటులో మధ్యవర్తిత్వ బిల్లును ప్రవేశపెట్టింది.

కోర్టు తీర్పులతో సమానం 

గతంలో కొన్ని చట్టాలు మధ్యవర్తిత్వానికి గుర్తింపును ఇచ్చాయి. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (1908), మధ్యవర్తిత్వం, రాజీ చట్టం (1996), కంపెనీల చట్టం (2013), వాణిజ్య కోర్టుల చట్టం (2015), వినియోగదారుల రక్షణ చట్టం (2019)... వీటిలో మధ్యవర్తిత్వాన్ని అనుమతించే సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. మధ్యవర్తిత్వ ప్రాముఖ్యం గురించి అవగాహన సైతం ఉండటం లేదు. అందువల్ల ఆయా చట్టాల్లో మధ్యవర్తిత్వానికి సంబంధించిన సెక్షన్లను ఆచరణలో ఉపయోగించడం అరుదైపోయింది. ప్రత్యేకంగా మధ్యవర్తిత్వం కోసమే సమగ్ర చట్టం లేకపోవడం పెద్ద లోపమే.

మధ్యవర్తిత్వ బిల్లు వివిధ మధ్యవర్తిత్వ ప్రక్రియలకు చోటు కల్పించింది. కక్షిదారులు స్వచ్ఛందంగా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్‌) ప్రక్రియను- అంటే మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోవడానికి అది అనుమతిస్తుంది. ఇంకా సివిల్‌, వాణిజ్య వివాదాలలో కోర్టు వ్యాజ్యానికి ముందు తప్పనిసరిగా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలనీ నిర్దేశిస్తోంది. రెండుసార్లు అటువంటి ప్రయత్నాలు జరిగి పరిష్కారం కుదరకపోతే మధ్యవర్తిత్వ ప్రక్రియ నుంచి వైదొలగే వెసులుబాటునిస్తోంది. కోర్టు తోడ్పాటుతో మధ్యవర్తిత్వానికీ ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఇక్కడ మధ్యవర్తులను కోర్టే నియమిస్తుంది. అంతర్జాతీయ, స్థానిక వివాదాలను సామరస్యంగా ఆన్‌లైన్‌లో సైతం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. చాలా క్రిమినల్‌ కేసులకు మూలం సివిల్‌ వివాదాల్లోనే ఉంటుంది. అందువల్ల సివిల్‌ వివాద దశలోనే మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. వైవాహిక వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిని ఆశ్రయించేలా కోర్టు ఆదేశించవచ్చునని బిల్లు పేర్కొంటోంది. ఏ వివాదాల్లోనైనా మధ్యవర్తి నియామకానికి, మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తిచేయడానికి బిల్లు కాలపరిమితులను నిర్దేశించింది. అవసరమైన సందర్భాల్లో మధ్యవర్తిత్వం ఆంతరంగికంగా, రహస్యంగా జరగాలని బిల్లు సూచిస్తోంది. మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన పరిష్కారాలను కోర్టు తీర్పులతో సమానంగా పరిగణిస్తోంది. మోసం, అవినీతి వంటివి జరిగితే తప్ప ఈ పరిష్కారాలపై అప్పీలుకు వీల్లేదని స్పష్టం చేస్తోంది.

మధ్యవర్తిత్వానికి అర్హం కాని వివాదాలేవో బిల్లులో పేర్కొన్నారు. తీవ్రమైన మోసాలు, పత్రాల తారుమారు, నకిలీ పత్రాల సృష్టి, మైనర్లు, శారీరక, మానసిక స్వస్థత కొరవడినవారిపై క్లెయిములకు సంబంధించిన వివాదాలు మధ్యవర్తిత్వానికి అర్హమైనవి కావు. క్రిమినల్‌ నేరాల ప్రాసిక్యూషన్‌పై వివాదాలూ దీని పరిధిలోకి రావు. ప్రభుత్వ విధానానికి, నైతిక విలువలకు, క్రమశిక్షణ చర్యలకు, వృత్తి నిపుణుల అనుచిత ప్రవర్తనపై విచారణకు సంబంధించిన వివాదాలకు మధ్యవర్తిత్వ ప్రక్రియను వర్తింపజేయకూడదు. ఈ ప్రక్రియపై విస్తృత పర్యవేక్షణాధికారాలతో భారత మధ్యవర్తిత్వ మండలిని నెలకొల్పాలని, మధ్యవర్తిత్వ ప్రక్రియ అభివృద్ధి సంస్థలను ఏర్పాటుచేయాలని, మధ్యవర్తి సేవలను అందించే వ్యక్తులు, సంస్థలను నియమించాలని బిల్లు నిర్దేశిస్తోంది. మధ్యవర్తులకు శిక్షణ ఇవ్వాలని సిఫార్సు చేస్తోంది.

స్వతంత్రంగా, నిష్పాక్షికంగా, తటస్థంగా, సమర్థంగా వ్యవహరించగల మధ్యవర్తులకు నేడు తీవ్ర కొరత ఉంది. కాబట్టి సుశిక్షిత మధ్యవర్తులను తయారు చేసుకోవడం, పకడ్బందీ మౌలిక వసతులతో మధ్యవర్తిత్వ యంత్రాంగాన్ని నెలకొల్పుకోవడం తక్షణావసరం. ఆన్‌లైన్‌ మధ్యవర్తిత్వానికి బిల్లు అనుమతిస్తున్నా, కోర్టు నియమించిన మధ్యవర్తులు సైతం సరైన సాంకేతిక వసతులు లేక తమ విధులను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారన్నది సత్యం. నిరంతరాయంగా అంతర్జాల సేవలు అందేలా చూస్తూ, ఆన్‌లైన్‌ మధ్యవర్తిత్వ నిర్వహణకు సుశిక్షిత మధ్యవర్తులతోపాటు, సాంకేతిక దన్ను ఇచ్చే సిబ్బందినీ సిద్ధం చేసుకోవాలి.

కలిసికట్టుగా పనిచేస్తేనే... 

మధ్యవర్తిత్వ ప్రయోజనాల గురించి అన్ని వర్గాల్లో అవగాహన పెంచాలి. కక్షిదారులకు ధనరూపేణా, ఇతరత్రా ప్రయోజనాలు కలిగేలా చూడటం ద్వారా వారిని మధ్యవర్తిత్వ ప్రక్రియవైపు ఆకర్షించాలి. అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ ప్రక్రియలో సంభవిస్తున్న పురోగతిని, తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. వాటిని మన దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయిస్తూ మధ్యవర్తిత్వ చట్టంలో అంతర్భాగం చేయాలి. మధ్యవర్తులకు వృత్తి, నైతికపరమైన ప్రమాణాలను నిర్దేశించి, వాటిని తప్పకుండా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు సంబంధించి తగిన విధివిధానాలను రూపొందించాలి. ఏదిఏమైనా మధ్యవర్తిత్వ ప్రక్రియ పాదుకోవడమనేది కేవలం చట్టం ద్వారానే జరగదు. దాన్ని కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు స్వచ్ఛందంగా స్వీకరించి ఉత్సాహంగా అమలు చేయాలి. అదే దేశంలో మధ్యవర్తి ద్వారా పరిష్కారానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.  

న్యాయవ్యవస్థ చొరవ కీలకం

దేశ విదేశాల్లో మధ్యవర్తిత్వంలో వస్తున్న మార్పులను బోధించడానికి మధ్యవర్తులకు నిర్ణీత కాలావధిలో సమీక్ష తరగతుల నిర్వహణకు బిల్లులో నిబంధన పొందుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బిల్లు చట్టరూపం ధరించినప్పుడు, అది సక్రమంగా అమలు కావడమనేది న్యాయవాదులు, న్యాయమూర్తుల దృక్పథం, ధోరణులపై చాలావరకు ఆధారపడి ఉంటుంది. మధ్యవర్తిత్వ ప్రక్రియను ఎంచుకునేలా కక్షిదారులను ప్రోత్సహించవలసింది న్యాయమూర్తులు, న్యాయవాదులే. కాబట్టి వారి మానసిక వైఖరి ఇక్కడ కీలకమవుతుంది. న్యాయ నిపుణులను అందుకు సన్నద్ధుల్ని చేయడానికి బిల్లులో తగిన ఏర్పాట్లు ఉండాలి. కోర్టు వ్యాజ్యానికి ముందు మధ్యవరిత్వాన్ని ఎంచుకునేలా కక్షిదారులను ఒప్పించడంద్వారా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమాజం పట్ల తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చినవారవుతారు.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 22-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం