• facebook
  • whatsapp
  • telegram

సమానత్వం మాటల్లోనేనా?

మహిళకు అందని ప్రగతి ఫలాలు

భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1991 ఆర్థిక సంస్కరణల తరవాత నాలుగు రెట్లు పెరిగింది. అయితే ఈ అభివృద్ధి ఫలాల్లో మహిళలకు సమాన వాటా లభించలేదన్నది నిర్వివాదాంశం. అక్కడికీ గడచిన మూడు దశాబ్దాల్లో భారతీయ మహిళలు మన సమాజంలోని సామాజిక, ఆర్థిక అవరోధాలను అధిగమించి వివిధ రంగాల్లో పురోగమన పథంలో సాగుతూనే ఉన్నారు. అయినా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి వారు అందిస్తున్న వాటా 18శాతం వద్దనే తచ్చాడుతోంది. ఇది మరెన్నో రెట్లు పెరగాల్సిన అవసరం ఉంది. భారత్‌లో 1990లో 30.27శాతంగా ఉన్న మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 2019 వచ్చేసరికి 20.8శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు సూచించడాన్ని బట్టి ఆర్థిక సంస్కరణలు స్త్రీలకు చేకూర్చిన ప్రయోజనం తక్కువేనని స్పష్టమవుతోంది. భారత ఆర్థికాభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కాలేకపోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది? ఈ దుస్థితికి పురుషాధిక్య సమాజం చాలా వరకు కారణమవుతోంది. కొవిడ్‌ వల్ల మహిళలు ఆర్థికంగా మరింత అన్యాయమైపోయారు. మహమ్మారి వల్ల ప్రతి పది మంది పనిచేసే మహిళల్లో నలుగురు ఉపాధి కోల్పోయారు. కొవిడ్‌ కాలంలో మహిళా ఉద్యోగినుల సంఖ్య మరింత తగ్గిపోయింది. ముఖ్యంగా 2020 జులై-సెప్టెంబరు మధ్యకాలంలో లాక్‌డౌన్లతో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 16.1శాతానికి పడిపోయింది. 2021 సెప్టెంబరు-డిసెంబరు త్రైమాసికంలోనైతే ఈ రేటు 9.4శాతానికి తగ్గిపోయినట్లు విదితమవుతోంది. కొవిడ్‌ దెబ్బకు గ్రామాల్లోకన్నా పట్టణాల్లో మహిళలు ఎక్కువ ఉపాధి నష్టాన్ని చవిచూశారు. పని మానేయవలసి వచ్చిన మహిళల్లో చాలామందికి తిరిగి ఉపాధి దొరుకుతుందా అనేది సందేహమే.

పెరుగుతున్న అంతరాలు

ప్రపంచంలోని 156 దేశాల్లో లింగ అంతరం విషయంలో ఒకప్పుడు 112వ స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు మరింతగా దిగజారి 140వ స్థానంలోకి పడిపోయిందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక-2021 తెలిపింది. దక్షిణాసియాలో లింగ భేదంలో మనకన్నా అధ్వాన స్థితిలో ఉన్నవి అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ మాత్రమే. మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 30 నుంచి 20 శాతానికి పడిపోయిందీ అంటే, పనిలో నుంచి తప్పుకున్న మహిళలు ఇప్పుడు ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న అనివార్యంగా ఎదురవుతుంది. 15-59 వయోవర్గంలోని మహిళల్లో కేవలం 20.6శాతమే వేతన ఉద్యోగాలు చేస్తున్నారని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సర్వే తేల్చింది. ఇదే వయోవర్గంలో 70శాతం పురుషులు వేతన కొలువులు చేస్తున్నారు. ఉపాధి, ఆదాయంలో స్త్రీ పురుషుల మధ్య పెరిగిపోతున్న అంతరాన్ని తగ్గించడానికి విధానకర్తలు అత్యవసర చర్యలు తీసుకోవాలి. దేశ ఆర్థిక ప్రగతి పర్వంలో స్త్రీలను క్రియాశీల భాగస్వాములను చేయాలి. దీనికోసం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రణాళికలు అమలు చేసి నిజమైన సమ్మిళిత వృద్ధిని సాధించాలి. స్వల్పకాలంలో ఇప్పటికే వేతన ఉపాధిలో ఉన్న స్త్రీలు ఆ ఉద్యోగాలను వదలివెళ్లే పరిస్థితులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. పనివేళల్లో వెసులుబాటు కల్పించడం, పని స్థలాల్లో లింగ భేదాలను తొలగించడం, పిల్లల ఆలనాపాలనకు వసతులు కల్పించడం ద్వారా మహిళలు ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన అగత్యాన్ని తప్పించవచ్చు. మధ్యకాలికంగా పిల్లల సంరక్షణకు శాశ్వత మౌలిక వసతులను నెలకొల్పడం ద్వారా ప్రస్తుతం వేతనం లేని పనుల్లో ఉన్న మహిళలు కూడా వేతన ఉపాధిలోకి మారే అవకాశాన్ని కల్పించాలి. తల్లులు పనిచేసేటప్పుడు వారి పిల్లల బాగోగులను చూసుకునేందుకు అవసరమైన సంరక్షణ కేంద్రాలను నెలకొల్పడానికి, వాటిలో సుశిక్షిత సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పెట్టుబడులు సమకూర్చాలి. ఈ సంరక్షణ సేవలకు జీడీపీలో కేవలం రెండు శాతాన్ని వెచ్చించినా 1.1 కోట్ల సంరక్షక సిబ్బంది ఉద్యోగాలు ఏర్పడతాయి. పిల్లల ఆలనాపాలన  చూసుకునేవారు ఉంటారనే భరోసాతో మహిళలు సంఘటిత ఉద్యోగాల్లో చేరి క్రమంగా ఆర్థిక సాధికారత సాధించగలుగుతారు. దీంతోపాటు బాలికలు విద్యావంతులు కావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందించాలి. తగిన నైపుణ్యాలు అలవరచి నాణ్యమైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. తద్వారా వనితలు ఉపాధి మార్కెట్‌లో మేలైన అవకాశాలు సంపాదించి అధిక సంపాదనపరులుగా ఎదుగుతారు. పోనుపోను కార్యక్షేత్రాల్లో పురుషాధిక్యత క్రమంగా తొలగి సమతూకం ఏర్పడుతుంది.

ఆర్థిక స్థిరత్వమే కీలకం

మహిళలకు ఆర్థిక స్థిరత్వం చేకూరినప్పుడే వారు తమ హక్కులు, సౌకర్యాల కోసం గట్టిగా డిమాండ్‌ చేయగలుగుతారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, మాతృత్వం, పిల్లల చదువు వంటి అంశాలపై ఎక్కువ నియంత్రణ సాధించగలుగుతారు. ఇదంతా సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి బలీయ పునాదిని ఏర్పరుస్తుంది. మహిళలకు సమానావకాశాలు లభిస్తే 2025కల్లా భారత జీడీపీకి అదనంగా 77 వేల కోట్ల డాలర్ల సంపద చేకూరుతుందని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2021 నివేదిక పేర్కొన్నది. కాబట్టి దేశాభివృద్ధికి మహిళా కార్మిక భాగస్వామ్యరేటు పెంచడం అత్యవసరమని తేలుతోంది. దీనికి అడ్డుపడుతున్న వ్యవస్థాగత లోపాలను సవరించడానికి తగిన విధానాలను వెంటనే రూపొందించాలి. రాజకీయ దృఢ సంకల్పం ఉంటేనే ఇటువంటి పటిష్ఠ విధానాలు రూపొందుతాయి. 75 ఏళ్ల స్వాతంత్య్ర కాలంలో కూడా మన పాలకులు మహిళాభ్యుదయానికి సమర్థ విధానాలను రూపొందించకపోవడం విచారకరం. ఈ పరిస్థితి మారినప్పుడే మగువకు మెరుగైన ఆర్థిక అవకాశాలు దక్కుతాయి.

ఇతర దేశాల్లో ఇలా...

ఆఫ్రికా పశ్చిమ తీరంలోని చిన్న దేశం లైబీరియా ఆర్థికాభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయడానికి విజయవంతంగా అనుసరించిన విధానాలు భారత్‌కూ ఉపకరిస్తాయి. లైబీరియాలో మహిళలు నడిపే వ్యాపారాలకు అదనపు విలువ జోడించడం ద్వారా వారు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంలోకి మారడానికి ప్రభుత్వం అండదండలిస్తోంది. మహిళలను విద్యావంతుల్ని చేయడం, నైపుణ్యాలను, వ్యాపార నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో వడివడి అడుగులు వేయిస్తోంది. లైబీరియా మహిళా, శిశు, సామాజిక భద్రతా శాఖ మహిళల పని పరిస్థితులను మెరుగు పరుస్తోంది. ఆర్థికంగా చేయూత, పిల్లల సంరక్షణ సేవలు అందిస్తోంది. వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు మహిళలకు ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలను నేర్పుతున్నాయి. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశమైన పెరూ మహిళా కార్మిక భాగస్వామ్య రేటును పెంచడానికి చట్టపరమైన సంస్కరణలు తెచ్చింది. ఫలితంగా 2004-14 మధ్య కాలంలో పెరూలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 58శాతం నుంచి 68శాతానికి పెరిగింది, లాటిన్‌ అమెరికా దేశాలన్నింటిలోకీ ఇదే అత్యధిక రేటు. పెరూ మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించి జీడీపీకి ఎక్కువ వాటా సమకూరుస్తున్నారు. దేశంలో పేదరికం స్థాయులూ తగ్గిపోయాయి.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం