• facebook
  • whatsapp
  • telegram

పేద దేశాల అన్నపూర్ణ

ప్రపంచ ఆహార కొరత తీర్చనున్న భారత్‌

కొన్నేళ్లుగా భారతదేశంలో వరి, గోధుమ, ఇతర ఆహారధాన్యాలు విరగపండుతున్నాయి. 2020-21లో ఆహారోత్పత్తి 30.87 కోట్ల టన్నులు. 2021-22 (జులై-జూన్‌) పంట సంవత్సరంలో అది 31.61 కోట్ల టన్నులకు పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాలకు గిరాకీ 28 కోట్ల టన్నులు మాత్రమేనని నీతి ఆయోగ్‌ అంచనా. ప్రస్తుతం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వద్ద ఇంతకు రెండున్నర రెట్లు ఎక్కువ ఆహార నిల్వలు పేరుకున్నాయి. కొన్నేళ్ల నుంచి ధాన్య సేకరణ పెరిగిపోవడమే దీనికి కారణం. మరోవైపు వివిధ కారణాలతో పలు దేశాల్లో ఆహార కొరత తలెత్తుతున్న తరుణంలో- ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2020-21లో ఎఫ్‌సీఐ వద్ద 64.3 కోట్ల టన్నుల బియ్యం, గోధుమ నిల్వలు ఉండగా 2021-22లో అవి 71.8 కోట్ల టన్నులకు పెరిగాయి. దేశంలో పండే గోధుమల్లో 35శాతాన్ని ఎఫ్‌సీఐ కేంద్ర నిల్వల కోసం సేకరిస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద పేదలకు పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను తీసుకొంటోంది. రెండు కోట్ల టన్నులను విదేశాలకు ఎగుమతి చేసినా ఎఫ్‌సీఐ నిల్వలు తరగవు.

సరైన తరుణంలో...

స్వదేశంలో గిరాకీకన్నా సరఫరా ఎక్కువ కావడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించవనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడికీ కొవిడ్‌ కాలంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేసినా ఎఫ్‌సీఐ నిల్వలు తరగలేదు. మరోవైపు కొవిడ్‌తోపాటు వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంవల్ల పేద దేశాలకు ఆహార కొరత వచ్చిపడింది. ఈ నేపథ్యంలో అన్నార్త దేశాలకు ఉచితంగానో, తగ్గింపు ధరలకో అందించి ఆదుకోవడానికి భారత్‌ ముందుకొచ్చింది. పొరుగున ఉన్న శ్రీలంకలో ఆకలి కేకలు మిన్నంటడంతో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు లక్షల టన్నుల బియ్యం పంపుతున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్‌కు 50,000 టన్నుల గోధుమలను పంపడానికి ఐక్యరాజ్యసమితికి అనుబంధమైన ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ (డబ్ల్యూఎఫ్‌పీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 25-30శాతం ఉక్రెయిన్‌, రష్యాల నుంచే వస్తున్నాయి. పేద దేశాల్లో పంచడానికి డబ్ల్యూఎఫ్‌పీ సేకరించే గోధుమల్లో 50శాతం ఉక్రెయిన్‌ నుంచే సరఫరా అవుతోంది. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్‌ రైతులు రష్యన్లతో పోరాడుతున్నందువల్ల గోధుమ ఉత్పత్తి పడిపోయింది. నౌకల ద్వారా గోధుమ రవాణా కూడా స్తంభించిపోయి ప్రపంచమంతటా ధరలు పెరిగిపోతున్నాయి. 2016-17 నుంచి పది అగ్రశ్రేణి గోధుమ ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలుస్తున్న భారత్‌ గత ఏడాది 61.2 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంకన్నా 11.2 లక్షల టన్నులు ఎక్కువ. గతంలో భారత్‌ ఎగుమతి చేసిన బియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయని, గోధుమలు నాసిరకంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. వీటిని నివారించడానికి గోధుమల నాణ్యతా పరీక్షకు 213 ప్రత్యేక ప్రయోగశాలలను అనుమతించింది. గోధుమల రవాణాకు మరిన్ని రైలు బోగీలను అందిస్తోంది. గోధుమ ఎగుమతులకు ప్రాధాన్య ప్రాతిపదికపై అనుమతులు ఇవ్వాలని రేవు అధికారులను ఆదేశించింది. రేవుల వద్ద ప్రత్యేక గిడ్డంగులను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ తీరంలోని రెండు రేవుల నుంచి గోధుమలను ఎగుమతి చేస్తుండగా ఇకపై తూర్పు తీరంలోని రేవుల నుంచి కూడా ఎగుమతి చేయబోతున్నారు. ఈ చర్యల వల్ల ప్రస్తుత రబీ సీజన్‌లో గోధుమ ఎగుమతులు కోటి టన్నులకు చేరుకుంటాయని అంచనా.

రైతులకు కొత్త అవకాశాలు

అనేక ప్రపంచ దేశాల్లో జూన్‌-జులైలో పంట కోతలు జరుగుతాయి. భారత్‌లో ఈ వారం నుంచే రబీ గోధుమ మండీలకు వస్తోంది. మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో గోధుమ రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు జరపడానికి ప్రైవేటు ఎగుమతిదారులు సంప్రతింపులు ప్రారంభించారు. ఆ రాష్ట్రాల్లో రైతులు ప్రభుత్వమిచ్చే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కాదనుకుని నేరుగా ప్రైవేటు ఎగుమతిదారులకే గోధుమలను విక్రయించాలనుకొంటున్నారు. క్వింటా గోధుమకు ప్రభుత్వ ఎంఎస్‌పీ రూ.2,015; ప్రైవేటు ఎగుమతిదారులు రూ.2,700 ఇవ్వజూపుతున్నారు. అంటే రైతు ప్రతి క్వింటాకు రూ.600 అదనంగా పొందుతాడు. బియ్యం, గోధుమ ఎగుమతులను పెంచడానికి తోడ్పడాలని ప్రధాని మోదీ ఇటీవల దేశదేశాల్లోని భారత దౌత్యకార్యాలయాలను ఆదేశించారు. ఇప్పటికే ఆసియాలో ఈజిప్ట్‌, ఇరాన్‌, సూడాన్‌, నైజీరియాలతోపాటు ఐరోపాలోని టర్కీ, బోస్నియాలు కూడా భారతీయ గోధుమలపై ఆసక్తి చూపుతున్నాయి. చివరికి చైనా సైతం భారత్‌ నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. ప్రపంచంలో బియ్యం ఎగుమతిదారుల్లో అగ్రగాములైన చైనా, వియత్నాంలూ 2020లో భారత్‌ నుంచి బియ్యం కొనుగోలు చేశాయి. కొవిడ్‌, అనావృష్టి వల్ల ఆ రెండు దేశాల్లో వరిపంట దెబ్బతినడమే దీనికి కారణం. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మరికొన్ని దేశాలకు తగ్గింపు ధరలకో, ఉచితంగానో ఆహార ధాన్యాలు సరఫరా చేస్తే భారత్‌కు అమిత ఆదరాభిమానాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’ పేరుతో ఈ రెండు ఖండాల్లో పేద దేశాలను చైనా రుణ ఊబిలోకి నెడుతున్న తరుణంలో భారత్‌ ఆహార దౌత్యంతో ముందుకు రావాలంటున్నారు.

తరగనున్న ధాన్యం కొండలు

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించక ముందు డబ్ల్యూఎఫ్‌పీ ప్రపంచమంతటా 12.5 కోట్లమందికి ఆహారం అందించేది. దాడులు మొదలైన తరవాత ఆహారం, ఇంధనం, నౌకా రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో తన సరఫరాలను తగ్గించుకోవలసి వచ్చింది. ఈ పరిస్థితిలో యెమెన్‌, ఇథియోపియా, సిరియా, అఫ్గానిస్థాన్‌లకు భారత్‌ ఆహారం అందించడంవల్ల కోట్లాది ప్రజల ఆకలి తీర్చినట్లవుతుంది. ఎఫ్‌సీఐ వద్ద పేరుకుపోయిన నిల్వల నుంచి ఈ దేశాలకు గోధుమలను పంపుతుంది. అందులో కొంత ఉచితంగా ఇవ్వనుంది. డబ్ల్యూఎఫ్‌పీ మొదట్లో 1.9లక్షల టన్నుల గోధుమలు, పది వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయవలసిందిగా భారత్‌ను కోరింది. ఎఫ్‌సీఐ నుంచి 95,000 టన్నుల గోధుమలను రూ.240కోట్లకు, 5,000 టన్నుల బియ్యాన్ని రూ.90కోట్లకు కొనుగోలు చేస్తామని తెలిపింది. మున్ముందు ఇంతకన్నా ఎక్కువ ఆహార ధాన్యాలను భారత్‌ నుంచి సేకరిస్తామని తెలిపింది. డబ్ల్యూఎఫ్‌పీ రెండు లక్షల టన్నుల తిండి గింజలను సేకరించినా ఎఫ్‌సీఐ వద్ద ఆహార ధాన్యపు కొండలు కొంతవరకు తగ్గుతాయి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీ తదితరాలకు అయ్యే రూ.300కోట్ల ఖర్చు ఆదా అవుతుంది.

- కైజర్‌ అడపా
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం