• facebook
  • whatsapp
  • telegram

సత్వర న్యాయానికి సాంకేతిక సోపానం

కాలానుగుణంగా మారాల్సిన తరుణం

కృత్రిమ మేధ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చెయిన్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానాలు ప్రపంచ పరిస్థితులను మార్చేస్తున్నా, న్యాయస్థానాలు వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై ఇటీవల దుబాయిలో జరిగిన అంతర్జాతీయ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా పథకం కింద ఆర్థిక వ్యవస్థను భారీ మార్పుల వైపు నడిపిస్తున్న సమయంలో న్యాయస్థానాలు డిజిటలీకరణకు దూరంగా ఉండటం సరికాదు. ప్రపంచమంతటా బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక రంగాల్లో బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత శీఘ్ర సమర్థ ఫలితాలను, నాణ్యమైన సేవలను అందిస్తూ ఖాతాదారుల మన్ననలు చూరగొంటోంది.

సంపన్నదేశాల్లో సత్ఫలితాలు

భారత న్యాయవ్యవస్థ సాంకేతికతకు దూరంగా కునారిల్లుతున్నందు వల్లనే మన కోర్టుల్లో కింది నుంచి పైవరకు 4.4 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. తీర్పులు వెలువడటంలో దశాబ్దాలపాటు చోటుచేసుకొనే ఆలస్యంతో కోర్టుల వల్ల న్యాయం దక్కుతుందన్న నమ్మకం ప్రజల్లో క్షీణిస్తుంది. అది పరిపాలన  వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కేసుల సత్వర పరిష్కారానికి ఈ-ఫైలింగ్‌, ఈ-కోర్టులు, వర్చువల్‌ విచారణ, ఆన్‌లైన్‌ మధ్యవర్తిత్వం వంటి ప్రక్రియలను చేపట్టినా, మారుతున్న కాలానికి తగినట్లు కోర్టులు ఆధునికతను సంతరించుకోవాలి. న్యాయ ప్రక్రియకు కృత్రిమ మేధను జోడించి సంపన్న దేశాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. కేసుల విశ్లేషణ, పరిశోధన, అందుబాటులోని సాక్ష్యాధారాలను బట్టి తీర్పు ఎలా రావచ్చనే అంచనా, న్యాయమూర్తి గతంలో ఇచ్చిన తీర్పులు, ఆయన కేసులను విచారించే పద్ధతి, రాటుదేలిన నేరస్థుల స్వభావం, వారి గత చరిత్ర, వారికి పడిన శిక్షలు తదితర అంశాలను విశ్లేషించడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల తీర్పులు వేగంగా వెలువడి పెండింగ్‌ కేసుల కొండలు తరుగుతున్నాయి. భారత న్యాయ వ్యవస్థ ఈ అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ఇప్పటికీ వెనకబడి ఉంది.

న్యాయవాదులు, మధ్యవర్తుల జాబితాను, వారు గతంలో సాధించిన విజయాలను పరిశీలించి తమ అవసరాలు తీర్చగలవారిని ఎంచుకోవడంలో కృత్రిమ మేధ క్లయింట్లకు ఉపకరిస్తుంది. కోర్టు దస్తావేజుల అనువాదం, సాక్ష్యాధారాల క్రోడీకరణ, కొన్ని ముఖ్య పత్రాల రూపకల్పనకూ కృత్రిమ మేధ తోడ్పడుతుంది. భారతదేశంలో ఈ తరహా ఏఐ సాధనాలను ఉపయోగించడం చాలా తక్కువ. మధ్యవర్తిత్వ ప్రక్రియలో మానవ ప్రమేయం పెద్దగా ఉండని అనుబంధ అంశాలకు ఏఐ ఉపయోగపడుతుంది. చిన్నచిన్న కేసుల పరిష్కారానికి విస్తృత సాక్ష్యాధారాలు, లోతైన విశ్లేషణ, మానవ ప్రతిభతో పెద్దగా అవసరం ఉండదు. ఇలాంటి కేసులను వేగంగా పరిష్కరించడానికి ఏఐ టూల్స్‌ ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో వ్యాపార రంగంలో, వ్యక్తిగత జీవితాల్లో సాంకేతిక పరిజ్ఞానం విస్తృత మార్పులు తీసుకొస్తోంది. అన్ని రంగాల్లో అపార సమాచార రాశి (డేటా) ఉత్పన్నమవుతోంది. దీన్ని సమర్థంగా వినియోగించుకోవడంలో ఏఐ పోషించగల పాత్ర అంతా ఇంతా కాదు. అమెజాన్‌, ఈ-బే సంస్థలు వినియోగదారుల ఫిర్యాదులను కృత్రిమ మేధ సాయంతో ఆన్‌లైన్‌లోనే పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.

సవాళ్లు, అవకాశాలు...

బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత సాయంతో సృష్టించిన క్రిప్టో కరెన్సీలు దేశదేశాల్లో నిరాటంకంగా చలామణీ అవుతున్నాయి. మరి అంతర్జాతీయ బ్లాక్‌చెయిన్‌ సీమలో ఆయా దేశాల న్యాయస్థానాల పరిధి ఏమిటో నిర్ధారించేది ఎలా? ఈ విషయంలో వివాదాలు తలెత్తితే వాటిని ఏ విధంగా పరిష్కరించాలో మన చట్టాలు తెలపడం లేదు. క్రిప్టో వ్యాపారాన్ని నియంత్రించే అధికారం రిజర్వు బ్యాంకుకు ఉంది కానీ, క్రిప్టోలను నిషేధించే అధికారం లేదని, అది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ రిజర్వు బ్యాంకు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలి. ఏతావతా బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో పనిచేసే క్రిప్టోల నియంత్రణకు ఇంతవరకు ఒక చట్టమే లేదు. నేడు సంపన్న దేశాలతోపాటు వర్ధమాన దేశాల్లో కూడా అన్ని రంగాల్లో ఆటొమేషన్‌ పెరుగుతోంది. కార్యస్థానాల్లో రోబోలు, ఏఐ టూల్స్‌ వినియోగం పుంజుకొంటోంది. ఈ ప్రక్రియను కొవిడ్‌ వేగవంతం చేసింది. రోబోలు, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లతో యంత్రాలను నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి చట్టపరంగా ఎవరు బాధ్యత వహించాలనేది కీలక ప్రశ్న. డ్రైవర్లు లేకుండా ఏఐతో నడిచే కార్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే బాధ్యత కారు యజమానిదా, కారు ఉత్పత్తిదారుదా లేక కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌దా? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు సమాధానాల్ని గుర్తించి తగిన పరిష్కారం సూచించేలా మన చట్టాలు, న్యాయవ్యవస్థ సంసిద్ధం కావాలి. ఎదుటి వ్యక్తికి తెలియకుండానే ఏఐ సాయంతో అతడి వీడియో తీసే కళ్లద్దాలు, ఇతర సాధనాలను గూగుల్‌, రేబాన్‌ సంస్థలు రూపొందించాయి. ఇది వ్యక్తి గోప్యతకు భంగకరం. పుట్టస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. జంతువుల అవయవాలను ఏఐ సాయంతో మానవులకు అమర్చే సాంకేతిక పరిజ్ఞానాలూ వస్తున్నాయి. అవి కొత్త సమస్యలను కొనితెస్తాయి. వీటిని పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉందా? రోబోలు, ఏఐ ఉపకరణాలను చట్టం ఏ విధంగా పరిగణిస్తుంది, వాటికి ఏ ప్రతిపత్తినిస్తోంది? అవి మానవుడు అందించే డేటా, ప్రోగ్రామ్‌ల ద్వారా పనిచేస్తాయి. దురుద్దేశం గల వ్యక్తులు వాటికి తప్పుడు డేటా ఇచ్చి అక్రమాలు చేయిస్తే దానికి ఎవరిది బాధ్యత? మారుతున్న కాలం తెచ్చిపెడుతున్న చిక్కు ప్రశ్నలివి. సాంకేతికత వల్ల సమకాలీన సమాజంలో, భావి సమాజాల్లో రానున్న మార్పులను ముందుగానే పసిగట్టి వాటికి దీటైన విధంగా న్యాయసాధన ప్రక్రియను సంసిద్ధం చేయాలి.

సమాచార రాశి విశ్లేషణ

న్యాయవ్యవస్థ గతకాలపు తీర్పులు, సంప్రదాయాలను దిక్సూచిగా స్వీకరిస్తుంది. ఒకే విధమైన కేసులను ఒకే విధంగా పరిష్కరించాలని, ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను దిగువ కోర్టులు శిరోధార్యంగా పరిగణించాలని ఉద్ఘాటిస్తోంది. కాబట్టి పూర్వ వ్యాజ్యాలు, వాటిలో వెలువడిన తీర్పులకు సంబంధించిన అపార సమాచార రాశి(డేటా)ని విశ్లేషించి సత్వర న్యాయం సాధించవచ్చు. అందుకు బ్లాక్‌చెయిన్‌, కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతలు ఎంతగానో తోడ్పడతాయి. ఇటువంటి పరిశోధన కార్యకలాపాల కోసం సంపన్న దేశాలు ఇప్పటికే లెక్సిస్‌ నెక్సస్‌, డూ నాట్‌ పే, ఎగ్జా మ్యాచ్‌, రాస్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కృత్రిమ మేధ యాప్‌లను వాడుతున్నాయి.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం