• facebook
  • whatsapp
  • telegram

ఆదర్శ గ్రామాలతో భారత వికాసం

చురుకందుకోని కార్యాచరణ

మహాత్మాగాంధీ కలలుకన్న పల్లెసీమలను ఆవిష్కరించే దిశగా ‘సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన’ను 2014 అక్టోబర్‌ 11న లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ జయంతి నాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ అప్పటికే దేశంలో బాగా పేరు సంపాదించుకొన్న మూడు ఆదర్శ గ్రామాల(గుజరాత్‌ లోని పున్సారీ, తెలంగాణలోని   గంగదేవిపల్లి, మహారాష్ట్రలోని హివారీ బజార్‌)ను ఉదాహరించారు. అవి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. ఈ పథకం ద్వారా వందలకొద్దీ కొత్త ఆదర్శ గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పథకాన్ని   సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు భాషల్లో మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చింది.

ప్రధాన లక్ష్యాలివే...

సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాల్లో పొందుపరచిన నాలుగు ముఖ్య లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేయాలి. నిర్దేశిత గ్రామాల్లో సంపూర్ణాభివృద్ధికి కావలసిన ప్రక్రియల్ని తక్షణమే మొదలుపెట్టడం మొదటి లక్ష్యం. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచడం రెండోది. అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో గ్రామాలను చైతన్యపరచి ఇతర గ్రామాలకూ ఆదర్శప్రాయంగా మారేలా చేయడం మూడో లక్ష్యం.  ఇక నాలుగోది- ఆదర్శప్రాయంగా ఎదిగిన పల్లెలను ఇతర గ్రామ పంచాయతీలకు అభ్యాస పాఠశాలలుగా ఉపయోగించడం. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన కింద ప్రతి పార్లమెంటు సభ్యుడు 2016లోగా ఒక పల్లెను, 2019లోగా మరో రెండు గ్రామాలను (మొత్తం మూడింటిని) ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దీని ప్రకారం 788 మంది పార్లమెంటు సభ్యులు (లోక్‌సభ నుంచి 543 మంది, రాజ్యసభ నుంచి 245 మంది) 2,364 పల్లెటూళ్లను తీర్చిదిద్దాలి. 2019లో ఎన్నికైన ఎంపీలు చేపట్టిన పల్లెలను కూడా జోడిస్తే మొత్తం 4,728 గ్రామాల భవిష్యత్తు ఈ పాటికి మారి ఉండాలి. అయితే వాస్తవానికి 2014-19లో ఎన్నికైన ఎంపీలు మొదటి దశలో కేవలం 1,509 గ్రామాలనే ఎన్నుకొన్నారు. ఆ తరవాత (2019-2024) ఎన్నికైన ఎంపీలు 1,257 గ్రామాల్లోనే పనులు మొదలుపెట్టారు. మొత్తానికి 2,766 (58శాతం) గ్రామాలను మాత్రమే రెండుదశల్లో కలిపి పథకం కింద గుర్తించి పనులు మొదలుపెట్టారు.

గత నెల (ఏప్రిల్‌) చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం ఆదర్శగ్రామాల ర్యాంకుల్ని ప్రకటించింది. పన్నెండు ప్రశ్నల ఆధారంగా మార్కులు వేసి, ర్యాంకుల్ని నిర్ణయించారు. ప్రకటించిన ఫలితాల్లో టాప్‌ ర్యాంక్‌ 95.17 స్కోరుతో మొదలైంది. అతి తక్కువగా 1.25 స్కోరు నమోదైంది. జాబితాలో 514 గ్రామాలున్నా 485వ స్థానంలో ఉన్న గ్రామానికి 1.25 స్కోరు వచ్చింది. ఆ తరవాతి గ్రామాలన్నింటికీ (486 నుంచి 514 వరకు) జీరో స్కోరు ఇచ్చారు. అయితే ఒక గ్రామం ‘ఆదర్శ’ స్థాయికి చేరడానికి కనీస స్కోరు ఎంత ఉండాలనే వివరణ లేదు. కటాఫ్‌ స్కోరును నిర్ణయిస్తే ఈ ర్యాంకింగ్‌ ప్రక్రియకు గుర్తింపు, విలువ ఉంటాయి. ఉదాహరణకు 50 స్కోరును కటాఫ్‌గా అనుకొంటే, ఈ జాబితాలో కేవలం 191 గ్రామాలనే ఆదర్శ గ్రామాలుగా పరిగణించవచ్చు. గుజరాత్‌ నుంచి 158 గ్రామాలు, ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి 38 గ్రామాలు, కేరళ నుంచి 31 గ్రామాలు, బిహార్‌ నుంచి మూడు గ్రామాలు ర్యాంకులు సాధించాయి. తెలంగాణ అన్ని రాష్ట్రాలకంటే ముందు నిలిచి మొదటి పది ర్యాంకులను కైవసం చేసుకొంది. ర్యాంకింగ్‌ జాబితాలో తొలి 20 స్థానాల్లో 19 తెలంగాణకు చెందిన గ్రామాలే ఉన్నాయి. తెలంగాణ నుంచి మొత్తం 74 గ్రామాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. మొత్తం జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రామాలు 20. మొదటి గ్రామం 51.25 స్కోరుతో 178వ స్థానంలో ఉంది. 19వ గ్రామం 1.25 స్కోరుతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రామం సున్నా స్కోరుతో ఉంటే, తెలంగాణలో 74 గ్రామాల్లో ఒక్కటి కూడా సున్నా స్కోరుతో లేదు.

లోపాలను అధిగమించాలి

ఈ పథకం కింద చేపట్టిన గ్రామాల సంఖ్య అనుకొన్నదానికంటే చాలా తక్కువ. రెండోదశలో ఆదర్శ గ్రామాల సంఖ్య 1,257 దగ్గరే ఆగింది. ఇది ఎంతో నిరాశాజనకం. రానున్న రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న ఆశలేదు. పథకం పట్ల మన ఎంపీలు ఎందుకు ఆసక్తి చూపలేదో, వారికి ఎలాటి సవాళ్లు ఎదురయ్యాయో తెలుసుకొనేందుకు అధ్యయనం జరగాలి. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఐఆర్‌డీ వంటి జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలి. మార్గదర్శకాలను మరింత పటిష్ఠంగా సవరించేందుకు అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయి. రాబోయే ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు సత్వరమే ఆదర్శ గ్రామాల పనులను చేపట్టడానికి తోడ్పడతాయి. పథకం వెబ్‌సైట్‌ను విస్తృతపరచి లోటుపాట్లు లేకుండా చూడాలి. ఆదర్శ గ్రామాల సుస్థిరాభివృద్ధికి పెద్దపీట వేసి, ప్రత్యేక శ్రద్ద చూపాలి. ఎన్నికలు జరిగి పార్లమెంటు సభ్యులు మారినా నిర్దేశిత గ్రామ పంచాయతీల్లో పురోభివృద్ధికి ఏమాత్రం ఆటంకం ఎదురు కాకూడదు. రాజకీయ, స్థానిక, సామాజిక మార్పులవల్ల కలిగే ఒడుదొడుకులను ధైర్యంగా ఎదుర్కొనేలా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలి. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు ఆదర్శ గ్రామాల పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన పార్లమెంటు సభ్యులను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే గ్రామీణ భారతం అన్ని కోణాల్లో పురోగమించి, పథకం లక్ష్యాలు నెరవేరతాయి. మహాత్మా గాంధీ కన్న కలలూ సాకారమవుతాయి.

- డాక్టర్‌ టి.సంపత్‌కుమార్‌
 

Posted Date: 05-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం