• facebook
  • whatsapp
  • telegram

వీధిబాలల భవిత... అందరి బాధ్యత!

ప్రభుత్వాల చిత్తశుద్ధి మరింత కీలకం

భారతదేశంలోని అన్ని నగరాల్లో కూడళ్ల దగ్గర భిక్షాటన చేస్తూ చిన్నారులు కనిపించడం సర్వసాధారణ దృశ్యం. ఇలాంటి వారంతా వీధిబాలలే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం- వీధుల్లో పని చేస్తున్న, నివసిస్తున్న పిల్లలంతా వీధిబాలలే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది బాలలు వీధుల్లో నివసిస్తున్నట్లు అంచనా. దేశంలో వీధిబాలల సంఖ్య సుమారు 15 నుంచి 20 లక్షలదాకా ఉండవచ్చని జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) వెల్లడించింది. వీధి బాలల పునరావాస విధానం రూపకల్పనకు సంబంధించిన సూచనలను అమలు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించడంతో ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. వీధి బాలల సంరక్షణ, భద్రత, పునరావాసం కోసం ఎన్‌సీపీసీఆర్‌ రూపొందించిన ప్రామాణిక విధివిధానాలను అమలు చేయాలని, బాలస్వరాజ్‌ పోర్టల్‌లో నమోదైన పిల్లలను రక్షించడానికి, పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి బాలలను ఆశ్రయ కేంద్రాలకు తరలించడంకన్నా వారి కుటుంబాలతో కలిపేందుకు యత్నించాలని, వారికి అవసరమైన సంరక్షణ, భద్రతను అందజేయాలంటూ నిబంధనలు సూచిస్తున్నా- రాష్ట్రాలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తదితర వర్గాల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారుతోంది.

మాదక ద్రవ్యాల ముప్పు

చెత్త ఏరుకోవడం వీధి బాలల అత్యంత సాధారణ జీవనోపాధిగా మారుతోంది. భిక్షాటన, వీధుల్లో వస్తువులు అమ్ముకోవడం, రోడ్ల పక్కన దుకాణాల్లో పని చేయడంవంటివి వీరి ఉపాధి మార్గాలు. వీరు ప్రతిరోజూ పనిచేయాల్సిందే. మాదక ద్రవ్యాల ముప్పు వీధిబాలలు ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఎక్కువ పని గంటలు, శ్రమ, అలసట వంటివి మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. సంపాదనలో గణనీయ భాగాన్ని మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల కోసమే వెచ్చిస్తున్నారు. రోడ్లపై, వీధుల్లో ఉండటం వల్ల మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు లభ్యత తేలికవుతోంది. వీధిబాలల్లో గాయాలు, అనారోగ్యం వంటి సమస్యలు సర్వసాధారణం. విరేచనాలు, వైరల్‌ జ్వరాలు, కలుషితాహారం, అపరిశుభ్రమైన నీరు తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, బహిరంగ మలవిసర్జన వంటివాటివల్ల తరచూ అస్వస్థత బారిన పడటం వీరికి పెద్ద సమస్యగా మారుతోంది. తరచూ పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు, లైంగిక వ్యాధులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, అవాంఛిత గర్భాలు, అరక్షిత గర్భస్రావాలకు గురయ్యే ప్రమాదం అధికం. నిరంతర అభద్రతాభావం కారణంగా ఆందోళన, నిర్లక్ష్య వైఖరి తదితర మానసిక సమస్యలు వేధిస్తాయి. సురక్షితమైన ఆశ్రయం, పెద్దల సంరక్షణ లేకపోవడంతో వీధిబాలల్లో చాలామంది భావోద్వేగ, శారీరక, లైంగిక వేధింపులకు గురవుతుంటారు. శాశ్వత చిరునామా లేకపోవడం, ఏ జాతీయ సర్వేలోనూ వివరాలు నమోదు కాకపోవడంతో అదృశ్య బాలలుగా వారిని వ్యవహరిస్తున్నారు. చాలామంది పిల్లలకు జనన, కుల, కుటుంబ ఆదాయ ధ్రువీకరణ గుర్తింపు పత్రాలేవీ లేకపోవడంతో విద్య, ఇతర సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. వీరిపై సరైన పరిశోధనాత్మక అధ్యయనాలు, సర్వేలు, గణాంకాల నమోదు లేకపోవడంతో సమగ్ర సమాచారం అందుబాటులో ఉండటం లేదు. భారత్‌ గత రెండు దశాబ్దాలుగా వీధి బాలలకు సంబంధించి పలురకాల విధివిధానాలు రూపొందించినా, ఇలాంటి చిన్నారుల అవసరాలను గుర్తించడంలో అవి విఫలమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వీధిబాలల సహాయ కార్యక్రమం పథకాన్ని ప్రారంభించినా, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన సూచనలు, సిఫార్సులకు తుది ముసాయిదాలో చోటుదక్కలేదు. భారత బాలల సంక్షేమ మండలి కార్యక్రమాల్లోనూ వీధి బాలల్ని చేర్చారు. కార్మిక మంత్రిత్వ శాఖ కూడా వీరిని జీవనోపాధి శిక్షణా కార్యక్రమాల్లో చేర్చినా ఎలాంటి పురోగతీ సాధించలేకపోయింది. కొవిడ్‌ లాక్‌డౌన్ల సమయంలో వివిధ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా వీధిబాలల సంఖ్య మరింత పెరిగింది.

కలిసి అడుగులేస్తే మేలు...

వీధిబాలల సంక్షేమం, పునరావాసం కోసం ప్రభుత్వాలతోపాటు, సమాజంలోని వివిధ వర్గాలు కలిసి అడుగేయాల్సిన అవసరం ఉంది. కుటుంబాలు, సమాజం నుంచి దూరమైన పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి మానసిక వైద్యులు, మనస్తత్వ నిపుణులతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలోనూ వీధి బాలల సమాచారాన్ని సేకరించడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేయడం అత్యవసరం. చిన్నారులు తిరిగి ఆ విషవలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సరైన పునరావాస చర్యలపై దృష్టి సారించాలి. బాలికలకు సాధికారత కల్పించాలి. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వాడకం వంటి కేసుల్లో ఆరోగ్య సేవలు, న్యాయ సహాయం అందించాలి. బాలలకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు సంక్షేమ పథకాలతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలతో ఆదాయ మార్గాలను కల్పించాలి. తద్వారా బాలలను ప్రధాన జీవన స్రవంతిలో, సొంత కుటుంబంతో కలిసిపోయేలా సహాయపడాలి. బాధితుల కోసం ఏకీకృత సేవలతో కూడిన సురక్షితమైన ఆశ్రయ కేంద్రాల ఏర్పాటు చేయడం ముఖ్యం. కౌమార వయస్కులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలకు సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించాలి. సురక్షిత దత్తత విధానాలను రూపొందించాలి. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి చట్టాలను కట్టుదిట్టం చేయాలి. వీధి బాలల సంరక్షణలో స్థానిక సంస్థలూ క్రియాశీలక పాత్ర పోషించాలి. భారత్‌లో జనాభా పెరుగుతున్న కొద్దీ, నిరాశ్రయులయ్యే పిల్లల సంఖ్యా పెరుగుతోంది. ఈ సమస్యను అరికట్టి చిన్నారులకు మెరుగైన భవిష్యత్తును కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. నేతలు, ప్రభుత్వ అధికారుల నిబద్ధత, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీధి బాలలకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించడం కష్టమేమీ కాదు.

ఇంటికి దూరమైతే...

ఇంటి నుంచి పారిపోయే, ఇంటికి దూరమయ్యే పిల్లల జీవితం దాదాపు వీధిలోనే ముగుస్తోంది. ముంబయిలో నివసించే వెయ్యి మంది వీధిబాలలపై జరిపిన ఒక అధ్యయనంలో... కుటుంబ తగాదాల కారణంగానే ఇంటిని విడిచిపెట్టినట్లు 39.1శాతం చిన్నారులు చెప్పారు. కుటుంబ పేదరికం కారణంగా రోడ్డున పడినట్లు 20.9శాతం, నగరాన్ని చూడాలనుకుంటున్నట్లు 3.6శాతం చిన్నారులు వివరించారు. భారతదేశంలో వేలమంది పిల్లలను అపహరించి, భిక్షాటనకు వినియోగిస్తుండటంతో వీధిబాలల సమస్య పెరుగుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం అంచనా ప్రకారం- ఏటా సుమారు 40 వేల మంది పిల్లలు అపహరణకు గురవుతుండగా, అందులో పలువురు జాడ లేకుండా పోతున్నారు. కొన్నిసార్లు వీధిబాలలు సైతం అక్రమ రవాణా బాధితులుగా మారుతున్నారు.
 

Posted Date: 19-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం