• facebook
  • whatsapp
  • telegram

ఆత్మస్థైర్యమే ఆలంబనగా...

సర్కారీ తోడ్పాటే దివ్యాంగులకు ధీమా

విధి చిన్నచూపు చూసినా తరగని ఆత్మవిశ్వాసంతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు దివ్యాంగులు. వారి సంక్షేమానికి నేడు ఎన్నో దేశాలు సమధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా(జనాభాలో సుమారు 15శాతం) దివ్యాంగులున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సంయుక్త నివేదిక గతేడాది వెల్లడించింది. భారత్‌లో సుమారు 2.68 కోట్ల మంది దివ్యాంగులున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియజెబుతున్నాయి. వారిలో 69శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఇండియాలో అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 41.57లక్షల మంది, మహారాష్ట్రలో 29.63 లక్షలు, బిహార్‌లో 23.31 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 12.66 లక్షలు, తెలంగాణలో 10.46 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరి అక్షరాస్యత దేశ సగటుకంటే 19.52శాతం తక్కువ. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1992లో చేసిన తీర్మానం మేరకు ఏటా డిసెంబర్‌ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. సమ్మిళిత, సుస్థిర కొవిడ్‌-19 అనంతర ప్రపంచం దిశగా దివ్యాంగుల నాయకత్వం, భాగస్వామ్యం అన్నది ఈ ఏడాది నినాదం.

ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకొని నేడు వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అరుణిమా సిన్హా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు దుండగుల దాడిలో కాలు కోల్పోయారు. 2013లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ఆమె, ఆ ఘనత సాధించిన తొలి దివ్యాంగురాలిగా చరిత్ర సృష్టించారు. క్రీడల్లోనూ సత్తా చాటారు. దిల్లీకి చెందిన ఇరా సింఘాల్‌ వైకల్యాన్ని ఎదిరించి 2014లో సివిల్స్‌ పరీక్షల్లో అత్యున్నత స్థానంలో నిలిచారు. ఇటువంటి విజయ గాథలు మరెన్నో కనిపిస్తాయి. దివ్యాంగుల సంక్షేమంకోసం కేంద్రం 1995లో చట్టాన్ని తెచ్చింది. వారికి మరిన్ని హక్కులు దఖలుపరుస్తూ 2016లో నూతన చట్టాన్ని రూపొందించింది. దివ్యాంగుల సాధికారత, ఆత్మగౌరవం కాపాడటం, వారిపట్ల దుర్విచక్షణ లేకుండా చూడటం దీని లక్ష్యాలు. గతంలో దివ్యాంగుల పరంగా ఏడు వైకల్యాలను మాత్రమే గుర్తించేవారు. ప్రస్తుతం 14 రకాలను అధికారికంగా పరిగణిస్తున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. విద్య, ఉపాధి పరంగా అయిదు శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు దక్కాల్సిన హక్కులు చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దివ్యాంగుల సంక్షేమానికి కేంద్రం అరకొర నిధులే కేటాయిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారికోసం రూ.1325 కోట్లు కేటాయించిన కేంద్రం, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.150 కోట్ల మేర కోత విధించింది. కేటాయించిన నిధులనూ పూర్తిస్థాయిలో ఖర్చుచేయడంలేదు. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం దివ్యాంగుల సంక్షేమానికి దాదాపు రూ.4,772 కోట్లు కేటాయించగా, 2020 డిసెంబర్‌ చివరి నాటికి వాటిలో రూ.2,661 కోట్లనే ఖర్చు చేసింది. ప్రస్తుతం 13 రకాల పథకాలు దివ్యాంగుల కోసం అమలవుతున్నాయి. వాటి ప్రయోజనాలు అందరికీ సరిగ్గా అందడంలేదు. దివ్యాంగుల కోసం విద్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ర్యాంపుల ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పన పరంగా నూతన చట్టంలో పొందుపరిచిన మార్గదర్శకాలు చాలాచోట్ల విస్మరణకు గురవుతున్నాయి. ఆ మేరకు సామాజిక న్యాయం, సాధికారతపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ గతంలో ఆవేదన వ్యక్తంచేసినా- నేటికీ పరిస్థితి పెద్దగా మారలేదు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రధానంగా దిశ, వికాస్‌, సమర్థ్‌, సహ్‌యోగి, ప్రేరణ్‌, బడ్తే కదం వంటి పథకాలు అమలవుతున్నాయి. నిరామయ ఆరోగ్య బీమా వల్ల చాలామందికి మేలు చేకూరుతోంది. దానిపట్ల విస్తృతంగా ప్రచారం కల్పించవలసిన అవసరం ఉంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద పలు సంస్థలను దివ్యాంగుల సంక్షేమంలో కేంద్రం భాగస్వాములను చేసింది. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 చొప్పున, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.2,250 చొప్పున పింఛన్లు అందిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 4.98 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 6.02 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లు అందుకుంటున్నారు. వైకల్యానికి సంబంధించి సరైన ధ్రువపత్రాలు అందకపోవడంతో చాలామంది పింఛన్‌కు నోచుకోవడంలేదు. తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు దాదాపు పాతిక కోట్ల రూపాయల విలువ చేసే ఉపకరణాలను 17 వేల మంది దివ్యాంగులకు అందించారు. స్వయం ఉపాధికి ఏటా రాయితీ రుణాలను అందిస్తే దివ్యాంగులు సొంత కాళ్లపై ధీమాగా జీవించగల అవకాశం లభిస్తుంది. ప్రభుత్వాలు ఈ దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి.    

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌

(‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)
 

*********************************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సన్నద్ధత లోపం... వరదల శాపం!

‣ ఆచితూచి తాలిబన్ల అడుగులు

‣ అన్నదాత బాగుకు ఆధునిక సాగు

‣ ఆర్డినెన్సులు... ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు!

Posted Date: 03-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం