• facebook
  • whatsapp
  • telegram

సముద్ర భద్రతకు భారత్‌ భరోసా



హిందూ మహాసముద్ర భద్రత, ఈ తీర ప్రాంత దేశాలకు ఆపన్నహస్తం అందించడంలో భారత్‌ కీలకంగా నిలుస్తోంది. ఈ కడలిలో ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ భద్రత పరంగా భారత్‌ ప్రాధాన్యం పెరుగుతోంది.


హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా, చైనాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే అమెరికాతో పాటు యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనాలు ఈ కడలిలోని చిన్న తీర దేశం జిబూటీలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. చాగోస్‌ ద్వీపసముదాయాల్లో ఒకటైన డియాగో గార్సియా విషయంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, మారిషస్‌ మధ్య వివాదం నెలకొంది. ఈ ద్వీపంలో అమెరికాకు మరొక సైనిక స్థావరం ఉంది. మరోవైపు చైనాకు జిబూటీలో కార్యకలాపాల స్థావరం ఉంది. గ్రేట్‌ కోకో దీవిలోనూ ఇలాంటిది ఒకదాన్ని డ్రాగన్‌ దేశం నిర్మిస్తోంది. ఈ దీవి బంగాళాఖాతంలో నికోబార్‌ దీవికి దక్షిణాన అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గ్వాదర్‌లోనూ చైనా మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. శ్రీలంకలోని హంబన్‌టోట ఓడరేవును బీజింగ్‌ దీర్ఘకాలికంగా అద్దెకు తీసుకుంది. సైనిక అవసరాలకు దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. తన నావికా స్థావరాల కోసం మాల్దీవుల్లోని కొన్ని దీవులను చైనా కోరుతున్నట్లు తెలుస్తోంది.


హిందూ మహాసముద్రంలో అతి పొడవైన తీర ప్రాంతం (7,600 కిలోమీటర్లు) భారత్‌కు ఉంది. అందువల్ల ఈ ప్రాంత భద్రత, ఇక్కడ సహాయ చర్యల విషయంలో ఇండియాకు సహజంగానే ఎక్కువ బాధ్యత దఖలుపడింది. 1987లో మాల్దీవుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఇండియాయే తొలుత వేగంగా స్పందించి సహాయం అందించింది. 2004లో హిందూ మహాసముద్ర దేశాలను సునామీ అతలాకుతలం చేసినప్పుడు భారత్‌ సహాయ చర్యలు చేపట్టింది. కొవిడ్‌ ఉద్ధృతి సమయంలోనూ టీకాలు అందించింది. ఇండియాకు అతిపెద్ద నావికా, తీర రక్షక దళాలు ఉన్నాయి. వీటి సాయంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సరకు రవాణా సురక్షితంగా సాగేందుకు భారత్‌ తోడ్పడుతోంది. ఈ ప్రాంతంలో సముద్ర దొంగల ఆగడాలను సమర్థంగా అడ్డుకుంటోంది. వీరి ఆట కట్టించడానికి ఆయా దేశాలు కలిసి ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ను (సీటీఎఫ్‌150) ఏర్పాటు చేశాయి. ఇది కొన్ని విజయాలు సాధించినా, నేరాలు మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదు. 2019 జూన్‌లో ఒమన్‌ సింధుశాఖలో కొన్ని వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన తరవాత భారత నౌకాదళం చేపట్టిన ‘ఆపరేషన్‌ సంకల్ప్‌’ మంచి ఫలితాలు అందించింది.


ఇజ్రాయెల్‌-హమాస్‌ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్‌ మద్దతు కలిగిన హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలపై దాడులు మొదలుపెట్టారు. దాంతో అంతర్జాతీయ సమాజం దృష్టి సోమాలియా సముద్ర జలాల నుంచి ఎర్ర సముద్రం, ఈడెన్‌ సింధుశాఖ వైపు మళ్ళింది. హూతీలతో సముద్రదొంగలు జట్టుకట్టి మరింతగా పేట్రేగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరకు, చమురు రవాణా అత్యధికంగా ఎర్రసముద్రం మీదుగానే సాగుతుంది. అక్కడ హూతీల దాడుల వల్ల వేరే గత్యంతరంలేక ఐరోపా నౌకలు గుడ్‌హోప్‌ భూభాగం నుంచి మొత్తం ఆఫ్రికాను చుట్టి రావాల్సి వస్తోంది. దీనికి అదనంగా 14 రోజుల సమయం పడుతోంది. సరకు రవాణా వ్యయమూ రెండున్నర రెట్లు ఎగబాకింది. ఇలాంటి సమయంలోనే భారత నౌకాదళం తన ఆపరేషన్‌ సంకల్ప్‌ను ముమ్మరం చేసింది.


ఎర్ర సముద్రం నడవా నుంచి వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు నిరుడు డిసెంబరు నుంచి భారత నావికాదళం 12కుపైగా యుద్ధనౌకలను ఈడెన్‌ సింధుశాఖ, ఉత్తర అరేబియా సముద్రంలో మోహరించింది. వాణిజ్య నౌకల రక్షణే ధ్యేయంగా ఇతర సంపన్న దేశాల నావికాదళాలూ ఈ ప్రాంతంలో తిరుగాడుతున్నాయి. హిందూ మహాసముద్రంపై భారత నావికాదళం నిరంతర నిఘా వేస్తోంది. లిబియా, మాల్టా, ఇరాన్‌ తదితర దేశాల నుంచి వస్తున్న నౌకలను ఇండియా నౌకాదళం ఇప్పటిదాకా రక్షించింది. 110 మందిని కాపాడింది. వారిలో 45 మంది భారతీయ, 19 మంది పాకిస్థానీ నావికులు ఉన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో హిందూ మహాసముద్ర భద్రతాపరంగా భారత నౌకాదళం పాత్ర కీలకంగా మారింది.


- జితేంద్ర కుమార్‌ త్రిపాఠి
(విశ్రాంత రాయబారి)

 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అమెరికా ధోరణి మారుతోంది..

‣ ప్రజాస్వామ్యంపై దాడి

‣ ఎగవేతలు అరికడితే.. మరింత రాబడి!

‣ కార్చిచ్చులతో పచ్చదనం బుగ్గిపాలు

‣ పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

Posted Date: 18-05-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం