• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ భారత్‌పై హ్యాకింగ్‌ పంజా



భారతదేశం సుమారు 80 కోట్ల అంతర్జాల వినియోగదారులతో అలరారుతోంది. దాదాపు 120 కోట్ల స్మార్ట్‌ ఫోన్లకు నెలవుగా మారింది. ఇదంతా ఆధునిక భారత్‌ విజయ ప్రస్థానానికి ఒకవైపు. మరోవైపు, అంతకంతకు హ్యాకింగ్‌ ముప్పు పెరుగుతోంది. దాంతో ప్రభుత్వంతోపాటు పౌరులకూ భద్రత కరవైంది.


అంతర్జాతీయంగా సైబర్‌ నేరాల బారిన పడిన దేశాల జాబితాలో 2023లో భారత్‌ 80వ స్థానంలో నిలిచింది. గతేడాది దేశంలో 34శాతం వినియోగదారులు సైబర్‌ దాడులకు గురయ్యారు. సింగపూర్‌కు చెందిన సైబర్‌ భద్రతా సంస్థ ‘సైఫర్మా’ 2023 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్‌ దాడుల్లో 13.7శాతందాకా భారత్‌పైనే జరిగినట్లు వెల్లడైంది. ఇండియాపై ఎక్కువ సైబర్‌ దాడులకు చైనా, పాకిస్థాన్, పశ్చిమాసియా దేశాల్లోని సైబర్‌ నేరగాళ్లే కారకులు. చైనా, పాకిస్థాన్‌ హ్యాకర్లు భారత ప్రభుత్వ వెబ్‌సైట్లు, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ల నుంచి కీలక సమాచారాన్ని కాజేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. కంప్యూటర్‌ వైరస్‌లతో మన వెబ్‌సైట్లలో చొరబడి వాటిని తమ గుప్పిట్లోకి తీసుకోవడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. 2009లో ధర్మశాలలో దలైలామాకు సంబంధించిన కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లోకి చైనీయులు ప్రవేశపెట్టిన ఘోస్ట్‌ నెట్‌ నిఘా వ్యవస్థను భద్రతా సంస్థలు కనుగొన్నాయి. 2012లో భారత నౌకాదళ తూర్పు కమాండ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో చొరబడటానికి చైనీయులు ప్రయత్నించారు. ఈ నెట్‌వర్క్‌లో భారతీయ జలాంతర్గాముల వివరాలు, దక్షిణ చైనా సముద్రంలో భారత నౌకల కదలికల గురించిన కీలక సమాచారం ఉంది. దాన్ని కాజేయడానికి చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. పూంఛ్‌లో మోహరించిన భారతీయ సైనిక బలగాల వివరాలను తస్కరించడానికి పాకిస్థానీలు హ్యాకింగ్‌ చేశారు. 2020లో భారతీయ సైనిక, దౌత్యాధికారుల వివరాలను చేజిక్కించుకోవడానికి పాక్‌ సైబర్‌ దాడి నిర్వహించింది. 2021 ఫిబ్రవరిలో భారతీయ విద్యుత్కేంద్రాలు, పంపిణీ యంత్రాంగంపై చైనా హ్యాకర్లు దాడి చేశారు. 2022 నవంబరు 23న వారు దిల్లీ ఎయిమ్స్‌ కంప్యూటర్లను హ్యాక్‌ చేశారు. 2023 అక్టోబరులో దిల్లీ జీ-20 సమావేశాలకు అంతరాయం కలిగించాలని పాక్, ఇండొనేసియాలలోని హ్యాకర్లు కుట్ర పన్నారు. భారత జనాభాలో 55శాతం పౌరుల వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌లో అందుబాటులో ఉన్నాయని ‘రీసెక్యూరిటీ’ అనే అమెరికన్‌ సంస్థ వెల్లడించింది. 2024 మార్చిలో భారతీయ ఇంధన రంగాన్ని హ్యాక్‌ చేసినవారిని భారతీయ సంస్థలు ఇంతవరకు గుర్తించలేకపోయాయి.


కార్యరూపం దాల్చని వ్యూహం

ఎక్కడెక్కడ సైబర్‌ దాడులు జరగవచ్చనేది ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు తీసుకోవడానికి ఎథికల్‌ హ్యాకర్లు ఉపయోగపడతారు. వారు ప్రభుత్వం లేదా కంపెనీల అనుమతితో సర్వర్లు, క్లౌడ్‌ స్టోరేజి వ్యవస్థల్లో చొరబడి వాటిలోని లోపాలను పసిగట్టి నిర్మూలిస్తారు. ఇటువంటి లోపాలను ప్రత్యర్థులు ఉపయోగించుకోకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తారు. భారతీయ కంప్యూటర్‌ అత్యవసర ప్రతిస్పందన బృందం, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ, డీఆర్‌డీఓ, సీబీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రా, రక్షణ సైబర్‌ ఏజన్సీలు ఎథికల్‌ హ్యాకర్ల సేవలను ఉపయోగించుకుంటున్నాయి. భారత సైన్యం, వైమానిక సేన, నౌకా దళాలు సైబర్‌ దాడులను ఎదుర్కోవడానికి సొంత గ్రూపులను నియమించాయి. మాల్‌వేర్‌ దాడులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం 2023లో జాతీయ సైబర్‌ భద్రతా వ్యూహ ముసాయిదాను వెలువరించినా, అది ఇంతవరకు కార్యరూపం ధరించలేదు. అయితే 2023లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. సైబర్‌ దాడులను ఎదుర్కొనే పద్ధతులను నేర్పించారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిర్వీర్యం చేయడానికి హ్యాకర్లు సరికొత్త ఉపాయాలను అన్వేషిస్తున్నారు. మెటా స్ల్పాయిట్, చాట్‌ జీపీటీ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. సైబర్‌ దాడులను ఎదుర్కోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్న 20 డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల గురించి అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) 2022-23 నివేదికలో వివరించింది. ఆ 20 దేశాల్లో భారత్‌ 17వ స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో, నెదర్లాండ్స్‌ రెండో స్థానంలో నిలిచాయి. భారతదేశం డిజిటల్‌ వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న కొద్దీ సైబర్‌ దాడులు పెచ్చుమీరే ప్రమాదం ఉంది. వీటిని ఎదుర్కోవడానికి పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే భారత ఆర్థిక, భద్రతా వ్యవస్థలకు ముప్పు వాటిల్లుతుంది. మన దేశం ఇప్పటికే బ్లాక్‌ షేడ్స్‌ అనే ట్రోజన్‌ మాల్‌వేర్‌ నుంచి ముప్పు ఎదుర్కొంటోంది. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌లోకి చొరబడే కాయిన్‌ మైనర్‌ నుంచీ ప్రమాదం ఉంది. పాస్‌వర్డ్‌లను తస్కరించే మిమికాట్స్, స్టక్స్‌ నెట్, పౌలోడ్, స్కై వైపర్‌ వంటి మాల్‌వేర్‌ల నుంచి సైతం సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటితో పాటు అత్యాధునిక డీడీఓఎస్‌ వంటి టూల్స్‌ను కూడా హ్యాకర్లు ఎక్కుపెడుతున్నారు.


గట్టి చర్యలతోనే..

ప్రస్తుత కాలంలో హ్యాకర్లు దేశదేశాల్లో ఏకకాలంలో సైబర్‌ దాడులు నిర్వహిస్తున్నారు. వారిని దేశాల సరిహద్దులు ఆపలేకపోతున్నాయి. భారత్‌ కూడా పలుదేశాలతో కలిసి హ్యాకర్ల ఆటకట్టించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. హ్యాకర్ల గురించి గూఢచర్య సమాచారం పంచుకోవడం, సైబర్‌ నేరాల దర్యాప్తులో సహకరించుకోవడం, పకడ్బందీ సైబర్‌ చట్టాల రూపకల్పనలో సహాయ సహకారాలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. 2023 డిసెంబరులో భారత్, అమెరికా, తైవాన్‌లు హ్యాకింగ్‌ కట్టడికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2023లో భారత్‌-జపాన్, భారత్‌-ఐరోపా సమాఖ్య (ఈయూ)లు సైబర్‌ భద్రతా వ్యూహాలపై చర్చలు జరిపాయి. హ్యాకింగ్‌ను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి, క్వాడ్‌ తదితర అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని నిశ్చయించాయి. భారత సైనిక సమాచారం, పౌరులు, కంపెనీల ఆర్థిక వివరాలు, విదేశీ సంబంధాల డేటాను తస్కరించడానికి హ్యాకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఉపాయాలు అనుసరిస్తున్నారు. శత్రు దేశాలతోపాటు సైబర్‌ సమాచార చోరులు కూడా ఆన్‌లైన్‌ ఆగడాలకు పాల్పడుతున్నారు. మిత్ర దేశాల ప్రభుత్వాలు, సైన్యాలతో కలిసి సమర్థంగా హ్యాకర్లను ఎదుర్కోవడానికి భారత్‌ గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ రంగంలో అధునాతన సాంకేతికతలను మిత్ర దేశాలతో పంచుకోవాలి.


దేశ భద్రత కోసం..

అమెరికాలో 50 ప్రముఖ విశ్వవిద్యాలయాలు స్వదేశ భద్రతకు హ్యాకింగ్‌ పేరిట అధునాతన కోర్సులను బోధిస్తున్నాయి. ఇలాంటి కోర్సులను భారతీయ విశ్వవిద్యాలయాలూ అందుబాటులోకి తీసుకురావాలి. సైబర్‌ నైపుణ్యాల కోర్సునూ చేపట్టాలి. ఐరోపాలో నెదర్లాండ్స్‌ జాతీయ హైటెక్‌ క్రైమ్‌ యూనిట్‌ సైబర్‌ నేరాలపై శక్తిమంతమైన అస్త్రాలను నియోగిస్తోంది. వీటిని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నందువల్ల భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బారెడు ఖర్చులు మూరెడు ఆదాయం

‣ హద్దుమీరుతున్న పెడసరం

‣ అభివృద్ధికి గొడ్డలిపెట్టు.. అసమానతలు!

‣ మారుతున్న డ్రాగన్‌ రణ తంత్రం

Posted Date: 24-05-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం