• facebook
  • whatsapp
  • telegram

మారుతున్న డ్రాగన్‌ రణ తంత్రంభవిష్యత్తులో యుద్ధాలు అంతరిక్షంలోనూ జరగనున్నాయి. ఇందుకోసం పలు దేశాలు ప్రత్యేక దళాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా, రష్యా వంటి అగ్ర దేశాలతోపాటు భారత్‌ కూడా అంతరిక్ష సైనిక కమాండ్‌ను ఏర్పాటు చేసింది. చైనా అంతరిక్ష-వైమానిక దళం ఇప్పటికే సిద్ధమైంది. డ్రాగన్‌ సైనిక పునర్‌వ్యవస్థీకరణతో భావి యుద్ధాలకు సన్నద్ధమవుతోంది.


ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ 2015లో వ్యూహాత్మక మద్దతు దళం(ఎస్‌ఎస్‌ఎఫ్‌) ఏర్పాటు చేశారు. ఆయన చైనా అధ్యక్షుడిగా   మూడోసారి ఎన్నిక కావడానికి పీఎల్‌ఏ పునర్‌వ్యవస్థీకరణ కూడా తోడ్పడింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ఎస్‌ఎస్‌ఎఫ్‌ను రద్దు చేస్తున్నట్లు చైనా ప్రకటించడం ఆశ్చర్యకరం. పీఎల్‌ఏలోని వివిధ విభాగాల నుంచి తీసుకున్న బలగాలతో ఎస్‌ఎస్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. సైబర్, అంతరిక్ష సీమలు, సమాచార, ఎలెక్ట్రానిక్‌ యుద్ధాల్లో చైనా పోరాట పటిమను ఇనుమడింపజేయడమే ఎస్‌ఎస్‌ఎఫ్‌ లక్ష్యం. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా సమాచార యుద్ధ మద్దతు దళం (ఐఎస్‌ఎఫ్‌), సైబర్‌ పోరాట దళం, అంతరిక్ష-వైమానిక దళాలుగా ఎస్‌ఎస్‌ఎఫ్‌   పనిచేస్తుంది. దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కేంద్ర సైనిక   కమిషన్‌ అదుపాజ్ఞల్లో ఎస్‌ఎస్‌ఎఫ్‌లోని ఈ విభాగాలు పనిచేస్తాయి. సైబర్, అంతరిక్ష, సమాచార యుద్ధ సామర్థ్యాలనూ సంతరించుకోవాలని చైనా పట్టుదలగా ఉంది. ఈ లక్ష్య సాధన కోసం ఏర్పాటుచేసిన ఎస్‌ఎస్‌ఎఫ్‌ను ఆకస్మికంగా రద్దు చేయడానికి కారణమేమిటో అంతుచిక్కకుండా ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు చైనా నాయకత్వం లోతుగా తర్జనభర్జన జరిపే ఉంటుంది. చైనాపై సైబర్‌ దాడులను ముందే పసిగట్టి నివారించడానికి, ప్రత్యర్థులపై సైబర్‌ పోరు చేపట్టడానికి సైతం సైబర్‌ సీమా బలగం సిద్ధంగా ఉంటుందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు గతంలోనే స్పష్టంచేశారు.


రద్దు వెనక రహస్యమేమిటి?

సమాచార యుద్ధానికి చైనా ఎంతో ప్రాముఖ్యం ఇస్తోంది. సమాచారపరంగా ఆధిక్యం సంపాదించేవారే రేపటి యుద్ధాల్లో విజేతలని పీఎల్‌ఏ భావిస్తోంది. అందుకే చైనా సమాచార యుద్ధ మద్దతు దళాన్ని (ఐఎస్‌ఎఫ్‌) నెలకొల్పింది. ఐఎస్‌ఎఫ్‌ ఏర్పాటు చైనా సాయుధ దళాల ఆధునికీకరణను వేగవంతం చేస్తుందని చైనా అధినేత      జిన్‌పింగ్‌ ఇటీవల ప్రకటించారు. ప్రజా విమోచన సైన్యం(పీఎల్‌ఏ) నుంచి కమ్యూనికేషన్లు, నెట్‌వర్క్‌ రక్షణ బాధ్యతలను ఐఎస్‌ఎఫ్‌ తీసుకుంటుందని మొదట్లో ప్రకటించారు. ప్రత్యర్థులకన్నా ముందే సమాచార యుద్ధం ప్రారంభించి పైచేయి సాధిస్తుందని భావించారు. భారత్‌ ఇప్పటికే చైనా నుంచి సమాచార యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. వాస్తవాధీన రేఖ వెంబడి, అరుణాచల్‌ ప్రదేశ్‌లో స్థానికులను ఆకట్టుకోవడానికి వివిధ సమాచార మాధ్యమాలలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని తనకు అనువుగా మలచుకోవడం, మానసిక, చట్టపరమైన యుద్ధాలను సమాచార యుద్ధంలో మూడు అంతర్భాగాలుగా పరిగణిస్తున్న చైనా ఈ బాధ్యతలను ఐఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తోంది. ఈ క్రమంలో చైనా సమాచార, సైబర్, అంతరిక్ష యుద్ధ సామర్థ్యాల సాధనకు ఏర్పరచిన ఎస్‌ఎస్‌ఎఫ్‌ను ఒక్కసారిగా రద్దు చేయడంపై వ్యూహ నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. బహుశా ఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆశించిన లక్ష్యాల సాధనలో విఫలమై ఉండవచ్చని కొందరి అంచనా. పీఎల్‌ఏలోని వివిధ విభాగాలతోపాటు సైబర్, అంతరిక్ష, నెట్‌వర్క్‌ డిఫెన్స్‌ విభాగాల మధ్య సమన్వయం సాధించలేకపోయి ఉండవచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. మరికొందరి అంచనా ప్రకారమైతే, ఎస్‌ఎస్‌ఎఫ్‌ తనకు అప్పగించిన లక్ష్యాలను నెరవేర్చి కొత్త విధులకు మరలుతుండవచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తెలియకుండా అమెరికాపైకి గూఢచారి బెలూన్‌ను ప్రయోగించడం, అమెరికా దాన్ని కూల్చివేయడం జరిగి ఉంటుందని, అది కూడా ఎస్‌ఎస్‌ఎఫ్‌ రద్దుకు దారితీసి ఉండవచ్చనే భాష్యమూ వినవస్తోంది. ఇటీవల రాకెట్‌ దళంతో సహా పీఎల్‌ఏలోని వివిధ విభాగాల్లో అవినీతి ప్రక్షాళన దాడులు నిర్వహించారు. దీంతో జిన్‌పింగ్‌ నాయకత్వంలోని కేంద్ర సైనిక కమిషన్‌ (సీఎంసీ) సాయుధ దళాలపై మరింత పట్టు సాధించాలని నిశ్చయించింది. అందులో భాగంగా ఎస్‌ఎస్‌ఎఫ్‌ను రద్దు చేసి ఉండవచ్చు. నేరుగా సీఎంసీ అదుపాజ్ఞల్లో నడుస్తున్న రవాణా దళం ఎంతో విజయవంతమైంది. దీంతో పోరాట దళాలు, వాటికి సాధన సంపత్తి సమకూర్చే రవాణా దళాలు తన పర్యవేక్షణలోనే పనిచేయాలని సీఎంసీ నిర్ణయించి ఉండవచ్చు. ఎస్‌ఎస్‌ఎఫ్‌ రద్దు ఇందులో భాగం కావచ్చు.


పెరుగుతున్న ఉద్రిక్తతలు

భారత సరిహద్దులో, దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రాలలో డ్రాగన్‌ దుశ్చేష్టలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సైనిక పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడంపై భారత్, అమెరికా తదితర దేశాలు ఆరాతీస్తున్నాయి. భారత్‌-చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు చోటుచేసుకోగా, చైనా-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు సాధన సంపత్తిని చైనా సమకూరుస్తోందని అమెరికా అనుమానిస్తోంది. తమపై చైనా సైబర్‌ దాడులకు పాల్పడుతోందని అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్‌లు ఆరోపిస్తున్నాయి. భారతదేశంలో ఇస్రో, డీఆర్డీఓ వంటి కీలక సంస్థలపై చైనా, పాకిస్థాన్‌ల నుంచి రోజూ వందలాది సైబర్‌ దాడి యత్నాలు జరుగుతున్నాయి. 2035కల్లా చైనా సైన్యాన్ని అత్యంత ఆధునిక సేనగా తీర్చిదిద్దడానికే జిన్‌పింగ్‌   పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. తద్వారా నాలుగోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. రేపటి యుద్ధాలు భూ, జల, గగన సీమలతోపాటు సైబర్, అంతరిక్ష, సమాచార సీమల్లోనూ జరగనున్నాయని, అందుకు మనం సన్నద్ధంగా ఉండాలని భారత వైమానిక    దళాధిపతి ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి ఇటీవల ఉద్ఘాటించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈ క్రమంలో మన సన్నద్ధత అదేస్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది.


సమాచార యుద్ధం

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం సమాచార పంపిణీ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పాయి. ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడంతోపాటు తన వాదనే సరైనదని ప్రపంచాన్ని నమ్మించడానికి సమాచార యుద్ధం ఉపకరిస్తుందని అవగతమైంది. అందుకే చైనా సమాచార యుద్ధానికి ఎనలేని ప్రాముఖ్యమిస్తోంది. భారత్‌ సొంతంగా అంతరిక్ష, సైబర్‌ కమాండ్‌లను నెలకొల్పింది. త్రివిధ సాయుధ దళాధిపతుల సంఘం 2012లో చేసిన సిఫార్సు ఈ కమాండ్‌ల ఏర్పాటుకు దారితీసింది. అంతరిక్ష, సైబర్‌ కమాండ్‌లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లతో కలిసి పనిచేస్తాయి. సైనిక, పౌర సమన్వయానికి ప్రతీకగా నిలుస్తాయి. అంతరిక్షం మున్ముందు భూతల, గగనతల, సాగర తలాలపై పోరాటాలను ప్రభావితం చేస్తుందని భారత త్రివిధ సాయుధ దళాధిపతుల సంఘ (సీడీఎస్‌) అధ్యక్షుడు జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ప్రకటించారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ కోసం..

‣ భూతాపం.. నగరం నరకం!

‣ సముద్ర భద్రతకు భారత్‌ భరోసా

‣ అమెరికా ధోరణి మారుతోంది..

Posted Date: 20-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని