• facebook
  • whatsapp
  • telegram

స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ కోసం..ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో కొద్దికాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. చైనా ఆధిపత్య పోకడలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్‌ ప్రాంత స్థిరత్వం కోసం భారత్‌ కృషి చేస్తోంది.


పరస్పర పోటీ, వాణిజ్యం ప్రాతిపదికన అమెరికా, చైనా సంబంధాలు చాలా కాలంగా ప్రభావితం అవుతూ వచ్చాయి. దక్షిణ చైనా సముద్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి కొంతకాలంగా చైనా తహతహలాడుతోంది. ఈ క్రమంలో ఇరు దేశాల సంబంధాలు మరింతగా కుదుపులకు లోనవుతున్నాయి. ఇటీవల పశ్చిమదేశాలు, రష్యా, పశ్చిమాసియా మధ్య రాజకీయ వైరుధ్యాలు ముదిరాయి. తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి చైనా వీటిని పావులుగా వాడుకుంటోంది. భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంలో, తైవాన్‌ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ను బీజింగ్‌ తరచూ వేధింపులకు గురిచేస్తోంది. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమని, దాన్ని తమ ప్రధాన భూభాగంలో విలీనం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ చెబుతున్నారు. 2027లోగా ఈ ద్వీపాన్ని కలిపేసుకునేందుకు చైనా పావులు కదుపుతున్నట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.


కీలక, ఆధునిక సాంకేతికతలను చైనాకు ఎగుమతి చేయడంపై బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా పరిమితులు విధించింది. వీటి విషయంలో చైనా విధానం నమ్మదగినట్లు లేదని అగ్రరాజ్యం భావిస్తోంది. 2022లో చిప్స్‌, సైన్సెస్‌ చట్టంలో భాగంగా చైనాకు సాంకేతికతల ఎగుమతులపై బైడెన్‌ ఆంక్షలు విధించారు. అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ఇవి చైనాకు అవరోధంగా నిలిచాయి. ఈ ప్రభావం స్వల్పకాలమే ఉంది. దీర్ఘకాలంలో ఈ ఆంక్షలు చైనాలో జాతీయవాద భావాలను పెంచి ఆయా సాంకేతికల్లో స్వావలంబన సాధించేందుకు తోడ్పడ్డాయి. చైనా, అమెరికా ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. అంతర్జాతీయ స్థిరత్వం పరంగా ఈ రెండు దేశాల సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి మధ్య చెలిమి దెబ్బతింటే- భారత్‌తో పాటు దక్షిణ, ఆగ్నేయాసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం పడుతుంది. ఇటీవలి కాలంలో రష్యా, ఇరాన్‌లకు చైనా రహస్య మద్దతుపై అమెరికా గుర్రుగా ఉంది. దాంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బీటలు వారుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనా సాయంతో రష్యా, ఇరాన్‌లు సైనికంగా బలపడుతున్నాయి. రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియాలకు యంత్ర పరికరాలు, సాంకేతికతలను చైనా అందిస్తోంది. రష్యా, ఇరాన్‌ తదితర దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ వాటికి ఆదాయవనరుగానూ బీజింగ్‌ నిలుస్తోంది. రక్షణ ఎగుమతుల ద్వారా ఇరాన్‌ రక్షణ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇరాన్‌ రూపొందించిన చవకైన షాహెద్‌ డ్రోన్లు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. చైనాతో వాణిజ్య సంబంధాల ద్వారా రష్యా, ఇరాన్‌లు రెండూ పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌ గత నెలలో చైనాను సందర్శించారు. రష్యాకు బీజింగ్‌ చేస్తున్న సాయం గురించి ఆయన ప్రశ్నించారు. యంత్ర పరికరాలు, మైక్రో ఎలెక్ట్రానిక్స్‌ తదితరాల సరఫరాలో రష్యాకు చైనా కీలకంగా నిలుస్తోందని  వ్యాఖ్యానించారు. బ్లింకెన్‌ ద్వారా చైనాను అమెరికా హెచ్చరించే ప్రయత్నం చేసింది. దానికి బీజింగ్‌ దీటుగా స్పందించింది. చైనా విషయంలో అమెరికా తన పరిధిని దాటకూడదని హెచ్చరించింది.


భారత్‌ గడచిన అర్ధ శతాబ్దంలో చైనా, అమెరికా, రష్యాలతో నేర్పుగా సంబంధాలు నెరిపింది. అయితే 2020 గల్వాన్‌ ఘర్షణల తరవాత చైనా, భారత్‌ సంబంధాలు కుదుపులకు లోనయ్యాయి. ఈ క్రమంలో డ్రాగన్‌ ప్రాబల్యాన్ని నిలువరించేందుకు అమెరికాకు భారత్‌ చేరువవుతోంది. అమెరికా-చైనాల మధ్య పోటీ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. అత్యాధునిక సాంకేతికతలు, మౌలిక వసతులు, సరఫరా గొలుసులకు సంబంధించి ఇండో-పసిఫిక్‌ ప్రాంత ఏకీకరణకు భారత్‌ కృషి చేస్తోంది. అగ్రరాజ్యాల వైరుధ్యాల ప్రభావం ఈ మూడింటిపై ప్రసరించకుండా ఉంటేనే ఇండో-పసిఫిక్‌ ప్రాంత స్థిరత్వం సాధ్యమవుతుంది. ఈ మూడు రంగాల్లో స్వావలంబన సాధించాలని ఆకాంక్షిస్తున్న భారత్‌- ఏ అగ్రరాజ్య పోటీలో చిక్కుకోకుండా స్వేచ్ఛాయుత, నిర్నిబంధ, అందరినీ కలుపుకొని పోయే ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం కృషి చేస్తోంది.


- వివేక్‌ మిశ్రా

(అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూతాపం.. నగరం నరకం!

‣ సముద్ర భద్రతకు భారత్‌ భరోసా

‣ అమెరికా ధోరణి మారుతోంది..

‣ ప్రజాస్వామ్యంపై దాడి

‣ ఎగవేతలు అరికడితే.. మరింత రాబడి!

‣ కార్చిచ్చులతో పచ్చదనం బుగ్గిపాలు

‣ పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

Posted Date: 20-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని