• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధికి గొడ్డలిపెట్టు.. అసమానతలు!సంపన్నులకు పేదలకు మధ్య ఆదాయ అంతరాలు పెరిగిపోవడం సామాజిక విభేదాలకు దారితీస్తుంది. వివిధ వర్గాల మధ్య అపనమ్మకాలను పెంచుతుంది. సమాజ సమగ్రాభివృద్ధిని దెబ్బతీస్తుంది. అందువల్ల ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు చేపట్టాలి.


ఆర్థిక అసమానతలు సామాజిక అస్థిరతకు దారితీస్తాయి. ఆదాయ అసమానతలు సంపదపరమైన వ్యత్యాసాలకు కారణమవుతాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో పొదుపు మొత్తాలు, పెట్టుబడులు, షేర్లు, ఆభరణాలు, స్థిరాస్తులు సైతం సంపదపరమైన అసమానతలకు కొలమానమవుతాయి. భారతదేశంలో ఆర్థిక అసమానతలనేవి ఎల్లవేళలా చర్చనీయాంశాలే. అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం గురించి మనదేశంలో ఆర్థిక నిపుణులు, రాజకీయవేత్తలు తరచూ ప్రస్తావిస్తుంటారు. ఆర్థికాభివృద్ధి సాధించి ఆదాయ, సంపదపరమైన అసమానతలను నిర్మూలిస్తామని రాజకీయ పార్టీలు తమ విధానాలు, అజెండాలను ప్రకటిస్తుంటాయి.


పేద దేశాల్లో అధికం

ప్రపంచ అసమానతల ల్యాబ్‌ ఈ ఏడాది మార్చిలో భారతదేశంలో ఆదాయ, సంపదపరమైన అసమానతలపై నివేదిక వెలువరించింది. అది ఇటీవల దేశంలో చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్రం రావడానికి ముందు భారత్‌ తీవ్ర అసమానతలకు నిలయంగా ఉండేది. వీటిని నిర్మూలించడానికి 1953లో ఎస్టేట్‌ పన్నును, 1957లో సంపదపై పన్నును విధించారు. తరవాత వీటిని వరసగా 1985లో, 2016లో ఉపసంహరించారు. ఈ పన్నుల ద్వారా కేవలం 0.25శాతం ఆదాయం పెరగ్గా ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చులు అంతకుమించి అధికమయ్యాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. సంపద, ఎస్టేట్‌ పన్నులు రెండూ విధించడం జంట పన్నుల విధానమవుతుందనే వాదన సైతం ఉంది. భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరవాత నుంచి 1980ల వరకు అసమానతలు తగ్గాయని ప్రపంచ అసమానతల ల్యాబ్‌ నివేదిక వెల్లడించింది. 1970ల్లో 2.9శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు 1980ల నాటికి 5.6శాతానికి పెరిగింది. పారిశ్రామిక, వాణిజ్య సంస్కరణలు, విదేశీ రుణాలు, మౌలిక వసతులపై వ్యయం కారణంగా జీడీపీ వృద్ధిపథంలో సాగింది. ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి తోడ్పడినా, అసమానతలు పెరగడానికీ దారితీశాయి. తరవాత ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య అసమానతలు తగ్గినా ఒక్కో దేశంలో అవి పెరిగాయి. సంపన్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో అసమానతలు మరింతగా అధికమయ్యాయి. సంపన్న దేశాలకు సంబంధించి రష్యా, అమెరికాల్లోనూ అసమానతలు మరింతగా ఎగబాకాయి. రష్యాలో 58.6శాతం సంపద కేవలం ఒక శాతం జనాభా వద్ద పోగుపడింది. బ్రెజిల్‌లో ఒక శాతం జనాభా చేతిలో 50శాతం సంపద కేంద్రీకృతమైంది. భారతీయ అతి సంపన్నుల వద్ద 40.6శాతం సంపద పోగుపడింది. అసమానతలపరంగా ప్రపంచంలో భారతదేశానిది మూడో స్థానం. నాలుగో స్థానంలో ఉన్న అమెరికాలో ఒక శాతం సంపన్నుల వద్ద 35.1శాతం సంపద కేంద్రీకృతమైంది. జనాభాలో పేద, మధ్యతరగతి వర్గాల వద్ద ఉన్న సంపద చాలా తక్కువ. భారతదేశంలో 1951లో అగ్రశ్రేణిలోని 10శాతానికి జాతీయాదాయంలో 37శాతం వాటా చేరగా, 1982నాటికి అది 30శాతానికి తగ్గింది. 1990ల నుంచి గణనీయంగా పెరిగింది. ఇటీవలి కాలంలో 60శాతానికి చేరింది. 2022-23లో జనాభాలో దిగువ అంచెలోని సగంమంది జాతీయాదాయంలో 15శాతం వాటాతో సరిపెట్టుకున్నారు. పేద వర్గాలు విద్యాపరంగా వెనకబడి ఉండటం వారి ఆదాయాలపై దుష్ప్రభావం చూపుతోంది.


ఎదుగుదలకు అవరోధం

భారతదేశం అధిక వృద్ధి రేట్లను సాధిస్తున్నా ఆర్థిక అసమానతలను నివారించలేకపోతోంది. దీన్ని పరిష్కరించాలంటే ఆదాయ పన్నుల క్రమబద్ధీకరణ చేపట్టాలి. పన్నులకు ముందు, పన్నుల తరవాత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. తద్వారా ఉపాధి అవకాశాలను, ఆదాయాలను పెంపొందించాలి. ధనిక, పేద వర్గాల మధ్య విద్య, వైద్యం, గృహవసతి పరంగా ఉన్న అసమానతలు విపరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇవి అల్పాదాయ వర్గాల పిల్లలు జీవితంలో ఎదగకుండా అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వపరంగా విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. తాగునీరు, పారిశుద్ధ్య కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాథమిక ఆరోగ్య సేవలను విస్తరించాలి. అసమానతలకు అవకాశం లేని రీతిలో ఆర్థికాభివృద్ధి సాధనకు విధానకర్తలు ప్రాధాన్యం కల్పించాలి. ముఖ్యంగా, భారత్‌ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.


కొవిడ్‌ తెచ్చిన కష్టాలు

కొవిడ్‌ మహమ్మారి పలుదేశాల్లో ప్రజల ఆర్థిక స్థితిగతులను అస్తవ్యస్తం చేసింది. ఆదాయాలు దెబ్బతిని సగటు పౌరులు అల్లాడిపోయారు. పేదల పరిస్థితి మరింత దిగజారింది. ఇండియాలో వలస కార్మికులు ఉపాధి కరవై విలవిల్లాడిపోయారు. కొవిడ్‌ కాలంలో ఉన్నత విద్యావంతులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం లభించింది. సాధారణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. చదువుకు ఉన్న ప్రాధాన్యాన్ని ఇది చాటిచెప్పింది. తగిన విద్యార్హతలు, నైపుణ్యాలు లేని సిబ్బంది ఉద్యోగ, ఆదాయ నష్టాలను ఎదుర్కొన్నారు. పిల్లలు, యువతీయువకుల సంఖ్య ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఆర్థికంగా మరింత తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనక తప్పలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వెల్లడించింది. తరచూ లాక్‌డౌన్ల వల్ల ఉత్పత్తి ప్రక్రియ మందగించి ఆర్థిక ప్రగతి నెమ్మదించింది. తద్వారా కొవిడ్‌ పేదరికాన్ని, ఆదాయ అసమానతలను పెంచేసింది. కొవిడ్‌ మహమ్మారి భారతీయ స్టాక్‌ మార్కెట్లపైనా ప్రభావం చూపింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మారుతున్న డ్రాగన్‌ రణ తంత్రం

‣ స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ కోసం..

‣ భూతాపం.. నగరం నరకం!

‣ సముద్ర భద్రతకు భారత్‌ భరోసా

‣ అమెరికా ధోరణి మారుతోంది..

Posted Date: 20-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని