• facebook
  • whatsapp
  • telegram

బారెడు ఖర్చులు మూరెడు ఆదాయం



భారతీయ కుటుంబాల ఆర్థిక విజయ ప్రస్థానానికి పొదుపే పునాది. కానీ, ప్రస్తుత కాలంలో అవి పొదుపు సూత్రాన్నే విస్మరిస్తున్నాయి. మన దేశంలో కుటుంబాలు, వ్యక్తులు పొదుపు కోసం పక్కనపెడుతున్న సొమ్ముకన్నా, రుణాలే ఎక్కువగా తీసుకొంటున్నారని తేలడం ఆందోళనకరం. ఈ కఠోర వాస్తవాన్ని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాలు బయటపెట్టాయి.


భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న సమయంలో పొదుపు పెరిగితే పెట్టుబడులూ పెరుగుతాయి. అలాకాకుండా రుణ భారం అధికమైతే పెట్టుబడులను వెనక్కులాగుతుంది. ఫలితంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు దెబ్బతింటాయి. పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరిగినప్పుడు వస్తుసేవల వినియోగం క్షీణించి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. ఎగుమతులకన్నా స్వదేశీ వినియోగంపైనే ఎక్కువగా ఆధారపడిన భారతదేశానికి ఇదెంతమాత్రం శ్రేయస్కరం కాదు. భారత ఆర్థిక వ్యవస్థకు 80శాతం దన్ను అంతర్గత వినియోగం ద్వారానే లభిస్తోంది. వ్యక్తులు, కుటుంబాలు- రుణ భారం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటే అది జీడీపీ వృద్ధి రేటును కుంగదీస్తుంది. ఆర్థిక సంస్కరణలకన్నా ముందు కుటుంబాల అప్పులు తక్కువగానే ఉండేవి. అప్పట్లో అప్పులు ఇచ్చేవారూ తక్కువే. రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చే సంస్థలూ అంతంత మాత్రమే. బ్యాంకులు ఎవరెవరికి, ఏయే రంగాలకు ఎంతెంత రుణాలు ఇవ్వాలో ప్రభుత్వమే శాసించేది.


పెరుగుతున్న అప్పుల కొండ

ఆర్థిక సంస్కరణల తరవాత 1995-96 నుంచి, మరీ ముఖ్యంగా 2000-2001 నుంచి కుటుంబాల రుణభారం పెరిగిపోయింది. 1990-91లో అన్ని రంగాలకు బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలు రూ.1,18,019 కోట్లు. 1995-96కల్లా అవి రూ.2.31 లక్షల కోట్లకు  పెరిగాయి. గృహ రుణాలు ఇవ్వడం అప్పుడప్పుడే మొదలైంది. అప్పట్లో అవి రూ.60 కోట్లకు మించలేదు. 2010-11కల్లా గృహరుణాలు రూ.3.5 లక్షల కోట్లకు చేరాయి. 2023 మార్చినాటికి బ్యాంకులు ఇచ్చిన మొత్తం వ్యక్తిగత రుణాలు రూ.41.80 లక్షల కోట్లు. అందులో రూ.19.88 లక్షల కోట్లు గృహరుణాలే. ఇవి కాకుండా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు బ్యాంకులు అదనంగా రూ.3.18లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి. స్థిరాస్తి వ్యాపారానికి రూ.3.22 లక్షల కోట్లు అందించాయి. బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కలిసి ఇచ్చిన మొత్తం గృహ రుణాలు రూ.30 లక్షల కోట్లకు చేరాయి. ఇప్పుడు బ్యాంకింగ్‌ రంగంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ వ్యక్తిగత రుణాలపైన, గృహ రుణాలపైన ఎక్కువగా ఆధార పడుతున్నట్లు తేలుతోంది. ఈ ఏడాది జాతీయ అకౌంట్ల గణాంకాల ప్రకారం 2011 ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్లుగా ఉన్న కుటుంబాల రుణభారం, 2023లో రూ.15.57 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అప్పుల్లో అత్యధికం బ్యాంకులు ఇచ్చినవే. ముఖ్యంగా కొవిడ్‌ తరవాత కుటుంబాల రుణభారం భారీగా పెరిగింది. కొవిడ్‌కు ముందు ఇది రూ.7.37లక్షల కోట్లుగా ఉండగా, కొవిడ్‌ తరవాత 2023 మార్చి నాటికి రూ. 15.57లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకులు ప్రతి నెలా లక్ష కోట్ల రూపాయలదాకా వ్యక్తిగత రుణాలు ఇస్తుండగా, అందులో 60-70 శాతం గృహ రుణాలే. మిగిలినవి క్రెడిట్‌ కార్డులు, కార్లు, గృహోపకరణాల రుణాలు. అప్పులు తీర్చగల స్థాయిలో వ్యక్తులు, కుటుంబాల ఆదాయాలు పెరగకపోవడం ఆర్థిక వ్యవస్థకు శుభకరం కాదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డు రుణాలకు అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం కుటుంబాలకు పెను భారమవుతోంది. వ్యక్తులు, కుటుంబాలపై రుణ భారం పెరిగిపోతున్నందు వల్ల వారు పొదుపు చేయగల మొత్తాలు తగ్గిపోతున్నాయి. 2020-21 పొదుపు మొత్తాలు గరిష్ఠంగా  రూ.23.29 లక్షల కోట్లు. 2022-23కల్లా అవి రూ.14.16 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. స్థిరాస్తుల రూపంలోని పొదుపు మందగించడమూ ఆందోళనకరమే. 2019-20 నుంచి షేర్లలో పొదుపు 150శాతం పెరిగింది. మ్యూచువల్‌ ఫండ్‌లలోనూ పొదుపు మొత్తాలు పెరుగుతున్నాయి. పింఛన్, బీమా నిధులలో పొదుపు పెరగడం ఎంతో ఆహ్వానించాల్సిన పరిణామం. 2018-19లో పింఛన్, బీమా రంగాలలో పొదుపు రూ.11.74 లక్షల కోట్లు. అది 2022-23కల్లా రూ.17.14 లక్షల కోట్లకు పెరిగింది. పింఛన్‌ నిధుల్లో పొదుపు రూ.4.04 లక్షల కోట్ల నుంచి రూ.6.26 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో రూ.2.63 లక్షల కోట్లుగా ఉన్న చిన్న మొత్తాల పొదుపు...  2022-23 నాటికి రూ.2.47 లక్షల కోట్లకు దిగజారింది. చిన్న మొత్తాలపై ఇచ్చే వడ్డీ రేటును తగ్గించడమే అందుకు కారణం కావచ్చు. 2020-21 జీడీపీలో కుటుంబాల నికర ఫైనాన్షియల్‌ ఆస్తుల విలువ 11.5 శాతం. 2022-23లో అది ఏడు శాతానికి తగ్గిపోయింది.


అందుబాటు ధరలు ప్రధానం

జాతీయ అకౌంట్ల గణాంకాల ప్రకారం ఇప్పుడు కుటుంబాలు ఆరోగ్యంపై 25శాతం, రవాణాపై 21శాతం, కమ్యూనికేషన్లపై 16శాతం, వినోదంపై 23శాతం, విద్యపై 23శాతం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. కుటుంబాలు బ్యాంకుల్లో పొదుపు చేసే మొత్తాలు తగ్గిపోతున్న కొద్దీ, బ్యాంకులు వివిధ పరిశ్రమలకు, వ్యాపారాలకు ఇవ్వగల రుణాలూ తగ్గిపోతాయి. అది దేశ ఆర్థికాభివృద్ధిని వెనక్కులాగుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు పొదుపూ పెరుగుతుంది. ప్రభుత్వం పన్నులు తగ్గించి, రాయితీల ద్వారా పొదుపును పెంచాలి. కుటుంబాలకు సామాజిక సంక్షేమం పేరిట నగదు బదిలీ చేయడం కన్నా వస్తుసేవల ధరలు కుటుంబాలకు అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యం. అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి వినియోగాన్ని పెంచాలి. వినియోగంతోపాటు ఉత్పత్తి, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించడం కుటుంబాల చేతిలో ఎక్కువ డబ్బు మిగిలేలా చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రీతిలో ఎక్కువ వడ్డీ రేట్లను ఇచ్చే దీర్ఘకాలిక పొదుపు పథకాలను ప్రభుత్వం చేపట్టాలి. బంగారం, స్థిరాస్తుల కొనుగోలు నుంచి ఇలాంటి పథకాలవైపు ప్రజలు మరలేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో గెలిచి రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పొదుపు వృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.


పన్నుల పోటు

ఒకప్పుడు పొదుపు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చిన భారతీయ కుటుంబాలు ఇప్పుడు వినియోగం వైపు మొగ్గుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో జీవన వ్యయమూ అధికమవుతోంది. ఆరోగ్యం, విద్యపై ఎక్కువగా ఖర్చు అవుతోంది. వీటికితోడు ప్రభుత్వం విధించే పన్నులూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు మొత్తాలు తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎడాపెడా అప్పులు చేయాల్సి వస్తోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హద్దుమీరుతున్న పెడసరం

‣ అభివృద్ధికి గొడ్డలిపెట్టు.. అసమానతలు!

‣ మారుతున్న డ్రాగన్‌ రణ తంత్రం

‣ స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ కోసం..

‣ భూతాపం.. నగరం నరకం!

‣ సముద్ర భద్రతకు భారత్‌ భరోసా

‣ అమెరికా ధోరణి మారుతోంది..

Posted Date: 21-05-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం