• facebook
  • whatsapp
  • telegram

కట్టుబడాలిక... సంకీర్ణ ధర్మానికి!



దిల్లీలో (శుక్రవారం - 07-06-2024) జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూటమి లోక్‌సభా పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఆయన మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సొంత బలం ఈసారి భాజపాకు దక్కలేదు. దాంతో లౌకిక భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యంత కీలకంగా మారింది.


ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమాగా చెప్పుకొన్న భారతీయ జనతా పార్టీ ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, ఎన్డీయే కూటమి పక్షాల తోడ్పాటుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతోంది. కొత్త ప్రభుత్వం గడచిన పదేళ్లలో మనం చూసిన ఎన్డీయే సర్కారులా ఉండబోదు. భాజపా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 42 సీట్లు తరుగుపడ్డాయి. దాంతో లౌకికవాద మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (తెదేపా), నీతీశ్‌ కుమార్‌ (జేడీయూ), జయంత్‌ చౌధరి (రాష్ట్రీయ లోక్‌దళ్‌)ల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారు. కొత్త ప్రభుత్వం ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఆధారంగా పాలన సాగించాల్సి ఉంటుంది.


అక్కరకురాని అస్త్రం

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 400కుపైగా సీట్లు సాధించడమే కాదు, 2047 వరకు తానే అధికారంలో ఉండాలని కలగన్న భాజపా- మిత్ర పక్షాల తోడ్పాటు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పరచలేని పరిస్థితిలోకి ఎందుకు జారిపోయింది? ఎన్నికలనేవి అధికారంలో ఉన్నవారి విధానాలు, చర్యలకు జవాబు చెప్పుకోవలసిన పరిస్థితిని కల్పించడమే కాదు... సుస్థిర, ఉజ్జ్వల భవిష్యత్తు కోసం దేశ ప్రజలు కనే కలల సాఫల్యానికీ తోడ్పడతాయి. ప్రజాస్వామ్యం పరమార్థమూ అదే. ఈసారి భారతీయ జనతా పార్టీ సొంతంగా అఖండ మెజారిటీ సాధించలేకపోవడం ఒక ఎత్తయితే, కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సీట్లు సాధించడం మరొక ఎత్తు. దీనివల్ల భాజపా ఊహించని చోట్ల పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ ఉత్తర్‌ ప్రదేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ రాష్ట్రంలో నరేంద్ర మోదీ అధ్యక్ష తరహా ఎన్నికల మాదిరిగా ప్రచారం చేశారు. అక్కడ తాను తప్ప మరెవరూ బరిలో లేరన్నట్లు ప్రవర్తించారు. పార్టీ అభ్యర్థులు ముఖ్యం కాదనుకున్నారు. భారతీయ జనతా పార్టీలోనూ సర్వం తానేనన్నట్లు వ్యవహరించారు. దీన్ని ఓటర్లు అంగీకరించలేదు. తమ తమ నియోజకవర్గాల్లోని ఎంపీల పనితీరును చూసి వారు ఓట్లు వేశారు. అక్కడికీ భాజపా చాలామంది అభ్యర్థులను మార్చినా ఫలితం లేకపోయింది. కొత్త అభ్యర్థులను పరాయివాళ్లుగానే చూసి ఓటర్లు తిప్పికొట్టారు. కాషాయ పార్టీకి ఉత్తర్‌ప్రదేశ్‌ అత్యంత కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే, యూపీ కేంద్రంగా సాగించిన రాజకీయాలు మునుపు భాజపా అధికారంలోకి రావడానికి ఎంతో కీలకమయ్యాయి.


ఈ ఏడాది జనవరి 22న మోదీ ప్రభుత్వం రామమందిరాన్ని ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. కాషాయాంబరధారి అయిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నా ఉపయోగం లేకపోయింది. రామాలయ నిర్మాణాన్ని భాజపా ప్రభుత్వ ఘనతగా ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నప్పటికీ, ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయింది. ఇతర అంశాలను ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలనుకున్నా అలాంటివేమీ కనిపించలేదు. ముస్లిములంటేనే జనం భయపడేలా మోదీ తన ప్రచార సభల్లో ‘మతపరమైన భాష (కమ్యునల్‌ లాంగ్వేజ్‌)’ను ఉపయోగించారు. నిరుడు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు భాజపా నేతలు ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని ప్రస్తావించారు. ముస్లిముల పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పాచిక పారలేదు. శక్తిమంతమైన ఎన్నికల అస్త్రమేదీ అందిరాలేదు. మరోవైపు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలు అనేక అంశాల్లో ముందడుగు వేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ బడుగు వర్గాలను కూడగట్టి ఉత్సాహంగా ఎన్నికల బరిలోకి దూకారు. పోలింగ్‌ ముగిసిన తరవాత ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి చాలామంది భ్రమపడి ఉండవచ్చు కానీ, భాజపాకు మాత్రం జరగబోయేది ఏమిటో ముందే అర్థమైనట్లుంది.


భవిష్యత్తు ఆసక్తికరం

ఈసారి అమేఠీ, రాయ్‌ బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో రాహుల్‌ గాంధీ, ప్రియాంకలు ముమ్మరంగా ప్రచారం చేశారు. రాయ్‌ బరేలీలో రాహుల్‌ మంచి మెజారిటీతో గెలవగా, అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ చేతిలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఓడిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో గెలిచినా ఆయకు లభించిన మెజారిటీ మరీ గొప్పదేమీ కాదు. భాజపా రాజస్థాన్‌లో చాలా సీట్లు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి మంచి విజయాలు నమోదుచేసింది. ఒడిశా, గుజరాత్, దిల్లీలలో ఎక్కువ సీట్లు సాధించడంవల్లే భాజపా సొంతంగా 240 సీట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది. ఒడిశాలో భాజపా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం పూర్తిగా మట్టికరచింది. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించడం- తమ కూటమిలోని పార్టీలు చేజారిపోకుండా నివారించడానికేనని అర్థం చేసుకోవాలి. ఇంతకాలం దేశంలో సుస్థిరతను తీసుకొచ్చానని చెప్పుకొన్న ఎన్డీయే సర్కారు ఇకపై వాస్తవాలను గుర్తెరిగి వ్యవహరించడం మేలు. ముఖ్యంగా లౌకికత్వానికి మళ్ళీ పట్టం కట్టాల్సి ఉంటుంది. న్యాయవ్యవస్థ, సమాచార సాధనాలు మళ్ళీ స్వేచ్ఛాయుతంగా మెలగే వాతావరణాన్ని సృష్టించాలి. భారతదేశంలో రాబోయేవి ఆసక్తికరమైన రోజులేనని స్పష్టంగా కనిపిస్తోంది.


వారణాసిలో వ్యతిరేకత

అసలు ఏప్రిల్‌లోనే ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 40వరకు సీట్లు కోల్పోతుందని నాతో అన్నారు. భాజపా దెబ్బతింటుందని అప్పటికి ఎవరూ ఊహించి ఉండరు. అలాగే వారణాసిలో కూడా అంతర్లీనంగా భాజపా పట్ల వ్యతిరేకతను గమనించాను. అక్కడ భాజపా తన మద్దతుదారులని అనుకున్నవారు కూడా మోదీ పట్ల వ్యతిరేకత కనబరచారు. వారిలో ప్రధానమంత్రి అంటే గౌరవం, భయం లోపించడం చూశాను. వారణాసిలో సాక్షాత్తు ప్రధానమంత్రే పోటీచేస్తున్నారు కాబట్టి, తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మొత్తం 13 సీట్లు భాజపా వశమవుతాయని ఆశించారు. కానీ, అలాంటి ఆశలకు అక్కడి ఓటర్లు గండి కొట్టారు.


- సంజయ్‌ కపూర్‌ 
(సామాజిక, రాజకీయ విశ్లేషకులు)

 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సవాళ్లను అధిగమిస్తేనే వరి సిరులు

‣ అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

‣ అగ్రరాజ్యం.. మారుతున్న వ్యూహం!

‣ భూగోళానికి వడదెబ్బ!

‣ ఓటరు తీర్పులో ఒదిగిన సందేశం

‣ హిమానీ నదాలు ముంచేస్తాయా?

Posted Date: 10-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం