• facebook
  • whatsapp
  • telegram

DSC: డీఎస్సీ షెడ్యూల్‌ మార్చండి

* రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ-డీఎస్సీ)లను హడావుడిగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెట్‌ పరీక్ష చివరి తేదీ నుంచి డీఎస్సీ పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రాథమిక కీ తరువాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్‌ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. పేపర్‌-1 ఎస్జీటీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. టెట్‌ నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేశారని, 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 12న జారీ చేసి, మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలిపింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల విషయంలో ప్రాథమిక కీ దగ్గర నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, తదనంతరం జారీ చేసే తుది కీ ప్రక్రియకు అత్యంత తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నిర్ణయం సహేతుకంగా లేదని పేర్కొంది. సముచిత సమయం ఇవ్వకపోవడం అభ్యర్థులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించడమేనని తెలిపింది.

* పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీశారు

2018లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ తేదీకి, పరీక్ష నిర్వహణకు మధ్య 60 రోజుల సమయం ఇచ్చారని పేర్కొంది. అంతేకాకుండా ఆ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌లో ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణకు, తుది కీ జారీకి మధ్య సహేతుకమైన సమయం ఇచ్చారని వెల్లడించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ విషయంలో అధికారులు ఆ తరహా షెడ్యూల్‌ను పాటించాల్సిందని అభిప్రాయపడింది. ప్రతి దశలోనూ సమయాన్ని కుదిస్తూ, షెడ్యూల్‌ ఎందుకు ఇచ్చారో తమకు అర్థం కావడం లేదంది. ఇలాంటి చర్యలతో పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీశారంది. కోర్టు ఆదేశించిన మేరకు ప్రతి దశలో తగిన సమయమిస్తూ షెడ్యూల్‌ మార్చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ మార్చి4న తీర్పు వెల్లడించారు.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.