• facebook
  • whatsapp
  • telegram

Education: నైపుణ్యమే యువత భవిత

నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుపై గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌
 


ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ప్రాంగణంలోనే నైపుణ్య వర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున ఈ  ప్రాంగణంలోనే వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి. 

స్కిల్‌ యూనివర్సిటీలో ఏయే కోర్సులుండాలి? ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి? పరిశ్రమల అవసరాలు తెలుసుకొని, వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలి? అనేది ముందుగా అధ్యయనం చేయాలి.

అధికారులతో సీఎం రేవంత్‌

ఈనాడు, హైదరాబాద్‌: యువతకు అధునాతన పరిజ్ఞానం ఎంతో కీలకమని.. దాన్ని సమగ్రంగా అందించేలా నైపుణ్య విశ్వవిద్యాలయం (స్కిల్‌ యూనివర్సిటీ) నెలకొల్పాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో స్కిల్‌ వర్సిటీ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే.. జులై 23 లోపు నైపుణ్య వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమలు, విద్యా శాఖల అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పారిశ్రామిక రంగ ప్రముఖులను సీఎం కోరారు. ఆ ప్రతిపాదనలను పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. నైపుణ్యాభివృద్ధి వర్సిటీ ఏర్పాటుపై పారిశ్రామికరంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్‌ సోమవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో సమావేశమయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్‌ వర్సిటీ ఏర్పాటుపై అధికారులు, పారిశ్రామిక ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్‌బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే చర్చ జరిగింది. అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరికులమ్, కోర్సులకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని చెప్పారు. 15 రోజుల వ్యవధే ఉన్నందున ప్రతి అయిదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా? లేదా ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా? మరేదైనా విధానం అనుసరించాలా? అనేది కూడా పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని చెప్పారు. వర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్‌ డిపార్టుమెంట్‌గా వ్యవహరిస్తుందన్నారు. ఈ సమావేశానికి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌రెడ్డి, ‘ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రమోషన్‌’ స్పెషల్‌ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ ప్రతినిధి హరిప్రసాద్, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌రెడ్డి, ‘ఐ ల్యాబ్స్‌’ శ్రీనిరాజు హాజరయ్యారు. సమావేశానికి ముందు ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు కలియ తిరిగి.. అందులో ఉండే సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే కాలేజీ సిబ్బందితో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.