• facebook
  • whatsapp
  • telegram

 మోడల్‌ కళాశాలలో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు

* నాలుగేళ్లలో డిగ్రీతోపాటు పూర్తికానున్న వృత్తివిద్య
న్యూస్‌టుడే, కల్వకుర్తి పట్టణం:  విద్యాపరంగా జిల్లాకు మరో వరం దక్కింది. సమీకృత(ఇంటిగ్రేటెడ్‌) బీఈడీ కోర్సు కళాశాలను కల్వకుర్తికి మంజూరైంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు సాధారణ డిగ్రీని మూడు సంవత్సరాలు చదవాలి. ఆ తర్వాత బీఈడీ చేయాలంటే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మంచి ర్యాంకు వస్తే సీటు దొరుకుతుంది. లేదంటే డబ్బులు చెల్లించి ప్రైవేటు కళాశాలల్లో కోర్సును పూర్తిచేయాలి. డిగ్రీ మూడేళ్లు, బీఈడీ రెండేళ్లు కలిపి అయిదేళ్లకు పైగానే పడుతుంది. ఇలా విలువైన సమయం వృథా కాకుండా ఉపాధ్యాయ వృత్తికి కావాల్సిన సమగ్ర శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ప్రవేశపెడుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు ప్రారంభం కానుంది. రూసా నిధులతో కల్వకుర్తితోపాటు భూపాలపల్లి, లక్సెట్టిపేట, నారాయణఖేడ్‌ పట్టణాల్లో నిర్మించిన కళాశాలల్లో అన్ని వసతులు ఉండటంతో తొలుత ప్రవేశపెడుతున్నారు. ఇది ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో ఊరట కానుంది.

 

విద్యార్థులకు ఎంతో ప్రయోజనం 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మోడల్‌ డిగ్రీ కళాశాల కల్వకుర్తిలో మాత్రమే ఉంది. విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం కావటంతో కేంద్ర శాఖ ప్రభుత్వ రూసా నిధులతో ఈ కళాశాలను నిర్మించారు. ఇందులో కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా వసతులు, నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు. అనేక కొత్త కోర్సులు ఉండటంతో వివిధ ప్రాంతాల విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు. ప్రస్తుతం 800ల మందికి పైగా ఉన్నారు. ఇంటిగ్రేటెడ్‌ బీఈడీని కూడా ప్రవేశపెట్టడం మరింత ప్రయోజనం చేకూరనుంది.
అందనున్న నాణ్యమైన విద్య 
డిగ్రీలో ఎక్కువ మంది విద్యార్థులు నామమాత్రంగానే కళాశాలకు వెళ్తుంటారు. పరీక్షల సమయంలోనే చదివి ఉత్తీర్ణులయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అనంతరం బీఈడీ కోర్సు చేసేందుకు మరో రెండేళ్లపాటు కళాశాలకు వెళ్తారు. ప్రాజెక్టు వర్క్‌లు, బోధనలో శిక్షణకు ఇతర పాఠశాలలకు వెళ్లాలి. అయినా ఈ రెండు సంవత్సరాల కోర్సులో ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన సంపూర్ణమైన శిక్షణ అందటం లేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇంటిగ్రేటేడ్‌ బీఈడీలో మొదటి సంవత్సరం నుంచి నాలుగోవ సంవత్సరం వరకు ప్రత్యేక తరగతులు ఉండటం వల్ల ఉపాద్యాయ వృతికి కావాల్సిన నైపుణ్యాలన్నీ అందే అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు.

 

కళాశాలకు మంచి గుర్తింపు తెస్తాం 
కల్వకుర్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటు వల్ల అనేక మంది పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. అన్ని వసతులు ఉండటంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు కళాశాల కూడా మంజూరైంది. బీఈడీతోపాటు రెండు పీజీ కోర్సులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈప్రాంత విద్యార్థులు వరమనే చెప్పాలి. కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.
- మల్లేష్‌, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాల, కల్వకుర్తి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.