• facebook
  • whatsapp
  • telegram

TGRTC: తెలంగాణ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు

* వీటిలో 2000 డ్రైవర్‌.. 743 శ్రామిక్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జులై 2న పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు అన్నింటికీ ఆమోదం తెలిపింది. మొత్తం 11 రకాల పోస్టులకు నియామకాలు జరపనున్నారు. భర్తీ చేసే కొలువుల్లో మూడింట రెండొంతులు (2 వేలు) డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక్‌ విభాగంలో 743 కొలువులున్నాయి. 


పుష్కరకాలం తర్వాత నియామకాలు

ఆర్టీసీలో చివరిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత 12 ఏళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది. ఏటా పెద్దసంఖ్యలో సిబ్బంది పదవీ విరమణలతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. అదనపు బస్సుల కోసం ఖాళీల భర్తీ అవసరం మరింత పెరిగింది. వీటి భర్తీతో ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ కొద్ది నెలల క్రితం లెక్కలు కట్టింది. కారుణ్య నియామకాల్లో.. కండక్టర్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో, ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. 


ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికే భారీ నోటిఫికేషన్‌: పొన్నం

టీజీఎస్‌ఆర్టీసీని కొత్త రక్తంతో బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 3,035 పోస్టుల భర్తీకి అనుమతివ్వడంపై  సీఎం రేవంత్‌రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ ఆవిర్భవించాక ఆర్టీసీలో గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ప్రజారవాణా వ్యవస్థకు పెద్దపీట వేసేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీచేస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల మేరకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. వాటికి అనుగుణంగా నియామకాలు చేపడుతున్నాం’ అని పొన్నం వివరించారు. త్వరితగతిన నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ యాజమాన్యం జులై 2న ఓ ప్రకటనలో తెలిపింది.

 

                                             పోస్టుల వివరాలు..
డ్రైవర్లు 2000
శ్రామిక్‌ 743
డిపో మేనేజర్లు/ అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ 15
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) 114
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 23
సెక్షన్ ఇంజినీర్‌ (సివిల్) 11
అకౌంట్స్ ఆఫీసర్ 6
మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) 7
మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్‌) 7

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.