• facebook
  • whatsapp
  • telegram

APNIT: పాఠాలు చెప్పేవారు లేక నిట్‌ సీట్లలో కోత  

* ఒక్కసారిగా 270 కుదింపు

* విద్యా సంస్థ నిర్ణయంతో నష్టపోతున్న రాష్ట్ర విద్యార్థులు

* ప్రాంగణ నియామకాల్లో సగం మందికే ఉద్యోగాలు
 

ఈనాడు, ఏలూరు-ఏపీ నిట్, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ విద్యా సంస్థ పరిస్థితి దారుణంగా తయారైంది.  ఏపీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)కి పరిపాలన చేసేందుకు కనీసం డైరెక్టర్‌ కూడా లేకుండాపోయారు. ప్రాంగణ నియామకాలు దారుణంగా పడిపోగా.. అధ్యాపకుల కొరతతో సీట్ల సంఖ్యనే తగ్గించేసిన దుస్థితి ఏర్పడింది. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో జాతీయ విద్యా సంస్థలను గాలికి వదిలేయడంతో రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేక నిట్‌ సీట్లలో కోత విధించారు. సీట్ల కోత కారణంగా రాష్ట్ర విద్యార్థులు భారీగా నష్టపోనున్నారు. జాతీయ విద్యా సంస్థలో సీటు లభించడమే గొప్పగా భావిస్తారు. అలాంటి విద్యా సంస్థలో అధ్యాపకుల కొరత పేరుతో సీట్లలో కోత పెట్టారు. నిట్‌లో ఏకంగా ఒకేసారి 270 సీట్లను తగ్గించేశారు. రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థల్లో అయా రాష్ట్రాల వారికి 50శాతం సీట్లు రిజర్వేషన్‌ ఉంటుంది. సీట్ల కోత కారణంగా 135మంది విద్యార్థులు ప్రవేశాలు కోల్పోనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిట్‌ను కేటాయించగా. 2015లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దీన్ని ప్రారంభించారు. మొదట 120 సీట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత సీట్ల సంఖ్యను 480 పెంచారు. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో సీట్లు 750కి పెంచి ప్రవేశాలు కల్పించారు. ఇప్పుడు అధ్యాపకుల కొరత కారణంగా సీట్లను ఒక్కసారిగా 480కి కుదించేశారు. దీంతో 270 సీట్లు తగ్గిపోయాయి. వైకాపా ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను పట్టించుకున్న పాపాన పోలేదు. నియామకాలు పూర్తి చేసేందుకు కేంద్రంతో జగన్‌ ప్రభుత్వం సరైన సంప్రదింపులు జరపకపోవడంతో ఖాళీలు భర్తీ కాలేదు. ఇప్పుడు పాఠాలు చెప్పేవారు లేరంటూ సీట్లను తగ్గించి, ఏపీ విద్యార్థులకు అన్యాయం చేశారు. 

వేధిస్తున్న అధ్యాపకుల కొరత: నిట్‌లో మొత్తం 210 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 43 మంది శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. 110 మందిని పొరుగు సేవల కింద నియమించారు. అనుభవం లేని పొరుగు సేవల అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. జాతీయ స్థాయి ప్రీమియర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల కొరత కారణంగా ప్రవేశాల సమయంలోనూ విద్యార్థులు ఈ నిట్‌ను ఎంపిక చేసుకోవడం లేదు. పాఠాలు సరిగా చెప్పకపోవడం, అధ్యాపకుల కొరత కారణంగా ఇంజినీరింగ్‌ మొదటి ఏడాదిలో 35 శాతం మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు తెలిసింది. మరోవైపు బోధనేతర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ విద్యా సంస్థలో బోధనేతర సిబ్బంది 225 మంది ఉండాల్సి ఉండగా.. 70 మంది మాత్రమే ఉన్నారు.  

తగ్గిన ప్రాంగణ ఎంపికలు: రెండేళ్ల క్రితం వరకు నిట్‌లో 90శాతం మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ద్వారా కొలువులు సాధించేవారు. ఈ ఏడాది ఎంపికలు తగ్గిపోయాయి. ఆఖరి సంవత్సరంలో మొత్తం 497 మంది విద్యార్థులుంటే 391 మంది ప్రాంగణ ఎంపికల్లో పాల్గొన్నారు. వీరిలో 248 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. శాశ్వత డైరెక్టర్‌ లేకపోవడం కూడా ప్రాంగణ ఎంపికలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. నాగ్‌పుర్‌ నిట్‌ డైరెక్టర్‌ ప్రమోద్‌ పడోలేను ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా నియమించారు. ఆపై హైదరాబాద్‌లోని ఐఐటీ డైరెక్టర్‌ బి.శ్రీనివాసమూర్తిని ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా నియమించారు. కొన్ని నెలలకే పుణె నిట్‌కు చెందిన దిలీప్‌ ఆర్‌ పేష్వేను పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసి రెండు నెలలు అవుతున్నా.. ఇప్పటి వరకు ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ఈ విషయమై నిట్‌ రిజిస్ట్రార్‌ దినేశ్‌ రెడ్డిని వివరణ కోరగా ‘మార్కెట్‌లో ఒడుదొడుకుల వల్లే ప్రాంగణ ఎంపికలు తగ్గాయి. సిబ్బంది సమస్య ఉన్న విషయం వాస్తవమే. ఆరు నెలల్లో అధ్యాపకుల కొరతను అధిగమిస్తాం’ అని తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.