• facebook
  • whatsapp
  • telegram

B.Ed Results: బీఈడీలో 96.90 శాతం ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీఈడీ ప్రవేశపరీక్షలో అమ్మాయిల హవా కొనసాగింది. ఎడ్‌సెట్‌లో మొత్తం 28,549 మంది ఉత్తీర్ణులు కాగా...వారిలో 23,780 (83.29 శాతం) మంది అమ్మాయిలు ఉన్నారు. దరఖాస్తుదారుల్లో సైతం విద్యార్థినులే అత్యధికంగా ఉండడం గమనార్హం. గత నెల 23వ తేదీన జరిగిన ఎడ్‌సెట్‌ ఫలితాలను జూన్‌ 11న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ నవీన్‌మిత్తల్, ఇతర అధికారులు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు మొత్తం 29,463 మంది హాజరుకాగా వారిలో 28,549 మంది (96.90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ ఉన్నత విద్యలో అమ్మాయిల ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈసారి ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు 33,879 మంది కాగా...వారిలో అబ్బాయిలు కేవలం 5,732 మంది (16.91 శాతం) మాత్రమే ఉన్నారని తెలిపారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. బీటెక్‌ వారికి కూడా అవకాశం ఇవ్వడంతో కొన్ని వందల మంది ఏటా ఎడ్‌సెట్‌ రాస్తున్నట్లు తెలిపారు. ఎడ్‌సెట్‌ రాయడానికి ఎటువంటి వయో పరిమితి లేకపోవడంతో బోధనా వృత్తిపై ఆసక్తి ఉన్న వారందరూ ప్రవేశ పరీక్ష రాస్తున్నారని చెప్పారు. నవీన్‌ మిత్తల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 208 బీఈడీ కళాశాలల్లో సుమారు 20 వేల సీట్లున్నాయని, అందులోనూ 70 శాతం మాత్రమే భర్తీ అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్‌కే మహమూద్, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేశ్, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య మృణాళిని, మహాత్మాగాంధీ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య రవి తదితరులు పాల్గొన్నారు.

టాప్‌ ర్యాంకులతో సత్తాచాటిన అబ్బాయిలు...

దరఖాస్తు చేసిన వారు, ఉత్తీర్ణులైన వారిలో అమ్మాయిలే 83 శాతానికిపైగా ఉండగా ...టాప్‌ ర్యాంకర్లలో మాత్రం అబ్బాయిలే అధికంగా ఉండటం విశేషం. తొలి 10 ర్యాంకర్లలో ఎనిమిది మంది అబ్బాయిలున్నారు. 2, 6  ర్యాంకులను అమ్మాయిలు దక్కించుకున్నారు.

పల్లె విద్యార్థికి మొదటి ర్యాంకు

బిజినేపల్లి, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన మలిశెట్టి నవీన్‌కుమార్‌ జూన్‌ 11న ప్రకటించిన ఎడ్‌సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. బీటెక్‌ పూర్తి చేసిన నవీన్‌కుమార్‌ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మే 23న నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షను రాసిన విద్యార్థి 118.37 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన నవీన్‌కుమార్‌ తల్లిదండ్రులు మలిశెట్టి వెంకటస్వామి, విజయమ్మ కుమారుడు మొదటి ర్యాంకు సాధించడంతో సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి గ్రామీణ విద్యార్థులకు సేవలందిస్తానని నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.