• facebook
  • whatsapp
  • telegram

AP GOVT : బోల్తాపడిన బోధనాసుపత్రులు

* రూ.3,820 కోట్లకు రూ.199 కోట్ల పనులే పూర్తి

* వేయికిపైగా వైద్యుల పోస్టులు ఖాళీ

* 7 వైద్య కళాశాలల రాక హుళక్కే..
 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. బోధనాసుపత్రుల అభివృద్ధి, కొత్తగా ఏడు వైద్య కళాశాలల నిర్మాణాలు, వసతుల కల్పనకు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని వైకాపా ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులోనే బోధనాసుపత్రులను రూ.3,820 కోట్లను ప్రత్యేకించాలని ప్రణాళికలు రూపొందించి రూ.199 కోట్ల విలువ పనులనే చేపట్టారు. ప్రతిపాదనల మేరకు నెల్లూరు జీజీహెచ్, విశాఖ విమ్స్‌లో నిర్మాణాలు ఇంతవరకు ప్రారంభించలేదు. మరోవైపు రూ.8 వేల కోట్లతో కొత్త వైద్య కళాశాలలను నిర్మించాలని నిర్ణయించి ఇందులో రూ.1,429 కోట్లనే అప్పటి ప్రభుత్వం వెచ్చించింది. కొత్త కళాశాలల పనుల కోసం రూ.1,616 కోట్ల మంజూరుకే రుణ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. పీజీ వైద్య సీట్ల పెంపునకు తగ్గట్టు రూ.755 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 నిష్పత్తిలో భరించాలి. ఈ మేరకు కేంద్రం ఇచ్చిన నిధులను సంబంధిత పనులకు వెచ్చించకుండా నాడు-నేడు పనులకు మళ్లించారు. రాష్ట్రంలో వైద్య విద్య బోధకుల కొరతను పూర్తిగా విస్మరించి కొత్త కళాశాలలను ఏర్పాటుచేయడానికి నిర్ణయించడమే విస్మయం కలిగించింది. మూడు దశల్లో వైద్య కళాశాలల నిర్మాణాలకు ఉద్దేశించిన రూ.250 కోట్ల బిల్లులనూ చెల్లించలేదు. మొత్తానికి వైకాపా ప్రభుత్వానికి ముందుచూపు లేక 2025-26 విద్యా సంవత్సరంనుంచి ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభం హుళక్కిగానే మారింది. అన్ని రకాల ఆసుపత్రుల నిర్మాణాలకు సంబంధించి రూ.11,890 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందగా రూ.3,624 కోట్ల విలువ పనులే పూర్తయ్యాయి. ఇందులో రూ.700 కోట్ల బిల్లులు పెండింగులోనే ఉన్నాయి.

వేయికిపైగా వైద్యుల పోస్టుల ఖాళీ

ప్రస్తుత బోధనాసుపత్రులు, 2023-24 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఐదు బోధనాసుపత్రుల్లో కలిపి 236 ప్రొఫెసర్లు, 267 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 448 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 951 పోస్టుల కొరత ఉంది. సీనియర్‌ రెసిడెంట్లు తదితరులందరితో కలిపి వేయికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లే. పదోన్నతులపై ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల నియామకాలను చేపట్టాలి. దీనికి అర్హులు ప్రస్తుతం తక్కువగా ఉన్నారు. ఒప్పంద విధానంలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలకు నోటిఫికేషన్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్ల నియామకాలకు వరుస నోటిఫికేషన్లు ఇచ్చినా నిష్ఫలమే అవుతోంది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ముందుకొచ్చే వైద్యులకు ప్రత్యేక భత్యాల అవకాశాలిస్తున్నా స్పందన నామమాత్రమే అవుతోంది. 2025-26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పార్వతీపురం, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లులలో నిర్మాణాలు చేపట్టిన ఏడు కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించాలంటే మరో వేయి మంది వరకు వైద్యుల అవసరముంది. ఈ ఆసుపత్రులు ఇప్పటికీ వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. వాటిని వైద్య కళాశాలలుగా మార్చాలంటే తొలుత డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి చేర్చే ప్రక్రియను ఇంతవరకు ప్రారంభించలేదు. నడుస్తున్న వైద్య కళాశాలల్లోనే బోధకుల కొరత ఉన్నప్పుడు కొత్త కళాశాలల్లో నియామకాలు ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు వస్తున్నాయి.

నిబంధన అమల్లోకి వస్తే  కొత్త వైద్య కళాశాలలు దూరమే..

ప్రతి పది లక్షల జనాభాకు వంద మంది వైద్యులు అవసరమని, ఆ మేరకు ఉంటే కొత్త వైద్య కళాశాలల అవసరమే ఉండదన్న నిబంధనను 2024-25నుంచి అమల్లోకి తెస్తామని జాతీయ వైద్య కమిషన్‌ గతంలో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనతో ఈ నిబంధనను 2024-25 విద్యా సంవత్సరంనుంచి అమలు చేయడాన్ని నిలిపేసింది. 2025-26 విద్యాసంవత్సరంనుంచి ఈ నిబంధన అమల్లోకి రావడంపై త్వరలో స్పష్టత రానుంది. అది అమల్లోకి వస్తే రాష్ట్రంలో అసలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రస్తావనే రాదు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.