* జులై 18కి విచారణ వాయిదా
దిల్లీ: నీట్ (యూజీ) పరీక్షలో అవకతవకలకు ఆధారాల్లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, జులై మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో జులై 11న సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ జులై 18కి వాయిదా పడింది. కేంద్రం, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) దాఖలు చేసిన ప్రమాణ పత్రం ప్రతులు కొన్ని పక్షాలకు ఇంకా అందలేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. తొలుత విచారణను జులై 15న వాయిదా వేయాలని న్యాయమూర్తులు భావించారు. అయితే ఆ రోజు తాను, అటార్నీ జనరల్ అందుబాటులో ఉండబోమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలపడంతో జులై 11న వాదనలు వింటామని పేర్కొన్నారు. పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ పురోగతికి సంబంధించి స్థాయీ నివేదికను తమకు సమర్పించినట్లు ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. నీట్ (యూజీ)-2024 పరీక్షా ఫలితాల డేటాను విశ్లేషించి ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదికతో జులై 10న కేంద్రం అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు నివేదిక ఎక్కడా ప్రస్తావించలేదని అందులో పేర్కొంది. కౌన్సెలింగ్ ప్రక్రియ జులై మూడో వారం నుంచి ప్రారంభం అవుతుందని, నాలుగు రౌండ్లలో నిర్వహిస్తామని తెలిపింది. ఎన్టీఏ విడిగా ప్రమాణపత్రం దాఖలు చేసింది. అందులో జాతీయ, రాష్ట్ర, నగర స్థాయిలో మార్కులపై విశ్లేషణ చేయించామని, ఎక్కడా అసాధారణ స్థాయిలు కనిపించలేదని తెలిపింది.
జులై 11న కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన నివాసంలో నీట్ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా పరీక్షపై నెలకొన్న అనిశ్చితి, కౌన్సెలింగ్ ప్రక్రియలో కొనసాగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
* కీలక సూత్రధారి అరెస్టు
నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో పరారీలో ఉన్న కీలక సూత్రధారుల్లో ఒకరైన రాకీ అలియాస్ రాకేశ్ రంజన్‌ను జులై 11న సీబీఐ అధికారులు పట్నాలో అరెస్టు చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.