• facebook
  • whatsapp
  • telegram

TGPSC:  1:50 ఫైనల్ 

* గ్రూప్‌-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక పై ప్రభుత్వం ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన జీవో (నం.55, 29)లలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన పరీక్షకు అభ్యర్థుల్ని జీవోలు, ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తెలిపింది. ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్‌ 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీచేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత త్వరగా చట్టానికి లోబడి కమిషన్‌ తగు నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్‌ వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. 

ఎందుకు తిరస్కరించారంటే..

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటన 2024 ఫిబ్రవరి 19న జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 9న ఉదయం నిర్వహించింది. 

ప్రధాన పరీక్షకు మల్టీజోన్‌ 1, 2 వారీగా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. 

సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన జీవో నం.55 (తేదీ 25/04/2022), దీన్ని సవరణ చేస్తూ జారీ చేసిన జీవో నం.29కి లోబడి గ్రూప్‌-1 ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ ఉద్యోగ ప్రకటన జారీ అయింది.

1:50 నిష్పత్తిలో ఎంపిక విషయం జీవోలోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది. ప్రతి మల్టీజోన్‌లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు-1996లోని 22, 22ఏ ప్రకారం సంబంధిత రిజర్వుడ్‌ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన నం.02/2024లోని పేజి నం.16లోని పేరా 12 లోని పేరా బీ లోనూ 1:50 నిష్పత్తిలో ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి కమిషన్‌ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనల్ని వెలువరించి భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ వివరించింది.

సివిల్స్‌ మెయిన్స్‌కు 24 మంది ఎస్సీ స్టడీసర్కిల్‌ అభ్యర్థులు

సివిల్స్‌ ప్రిలిమినరీ-2024 పరీక్షలో తెలంగాణ ఎస్సీ స్టడీసర్కిల్‌కు చెందిన 24 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారని ఎస్సీ స్టడీసర్కిల్‌  తెలిపింది. స్టడీసర్కిల్‌ నుంచి 152 మంది శిక్షణ తీసుకోగా 24 మంది సివిల్స్‌ మెయిన్స్‌కు, వారిలోనే నలుగురు ఫారెస్ట్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌కు ఎంపికయ్యారని పేర్కొంది. వీరిలో పది మంది ఎస్సీ, ఆరుగురు ఎస్టీ, 8 మంది బీసీ అభ్యర్థులున్నారు. వారిలో నలుగురు మహిళా అభ్యర్థులున్నట్లు స్టడీసర్కిల్‌ పేర్కొంది.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.