• facebook
  • whatsapp
  • telegram

Fee: ఇంజినీరింగ్‌ ఫీజుల నిర్ణయంలో జాప్యం

* జులై 8 నుంచి వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు కావాల్సి ఉన్నా పూర్తికాని ప్రక్రియ

* హైకోర్టు ఆదేశాలు పాటిస్తే రూ.45 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఫీజులు



ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన కళాశాలల ఫీజుల నిర్ణయం, విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన తేదీల ప్రకారం జులై 8 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు ప్రారంభం కావాలి. ఇంతవరకూ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియే పూర్తి కాలేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జూన్‌ 30 వరకు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 245 కళాశాలల్లో 1.71 లక్షల సీట్లకు ఆమోదం తెలిపింది. ఈ కళాశాలలు, సీట్లకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. వర్సిటీలు ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి.జులై 4న రాత్రి వరకు ఇంకా 95 కళాశాలలకు అనుబంధ గుర్తింపు రాలేదు. విశ్వవిద్యాలయాల గుర్తింపు తర్వాత వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కళాశాలలు, సీట్ల జాబితాతో ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా రెండు రోజుల్లో పూర్తి చేస్తేనే ప్రవేశాల కౌన్సెలింగ్‌ ముందుకు సాగుతుంది. లేదంటే వెబ్‌ ఐచ్ఛికాల నమోదు వాయిదా వేయాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు ముందే ఇవన్నీ పరిశీలించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఏమీ పట్టించుకోకుండా ఒకేసారి షెడ్యూల్‌ ఇచ్చేయాలంటూ సాంకేతిక విద్యాశాఖపై ఒత్తిడి తెచ్చింది. దీంతో హడావుడిగా షెడ్యూల్‌ ఇచ్చేశారు.


   ఫీజులపై ఏం చేస్తారు?   

ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజులు తక్కువగా ఉన్నాయని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. గతేడాదికి కోర్టు ఆదేశాలతో ఫీజులు నిర్ణయించారు. గతేడాది జూన్‌లో నిర్ణయించిన ఫీజులనే ఈసారీ అమలు చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు పరిశీలిస్తే ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ, ఇంతవరకూ ఆ ఆదేశాలు కమిషన్, ప్రభుత్వానికి చేరలేదు. 

గతేడాది జూన్‌లో కనీస ఫీజు రూ.45 వేలు, గరిష్ఠంగా రూ.1.05 లక్షలుగా కమిషన్‌ సిఫార్సు చేసింది. రూ.లక్షకుపైగా ఫీజులున్న కళాశాలలు 10, కనీస ఫీజు ఉన్నవి 50 వరకు ఉండగా.. రూ.50 వేల నుంచి రూ.60 వేలున్నవే ఎక్కువ. హైకోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత ఈ ఫీజులను అమలు చేస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులు ఖరారైతేనే కౌన్సెలింగ్‌ సాగుతుంది. అనుబంధ గుర్తింపు కళాశాలలు, సీట్లు, ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. వెబ్‌ ఐచ్ఛికాలకు ముందు ఇంత ప్రక్రియ ఉన్నందున కౌన్సెలింగ్‌ కొనసాగుతుందా? వాయిదా పడుతుందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


   డిగ్రీ కౌన్సెలింగ్‌లోనూ ఆటంకాలు..   

అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అనుమతుల పొడిగింపు (ఈఓపీ) ఫీజులు చెల్లించాలని ఉన్నత విద్యామండలి గతంలో ఆదేశాలిచ్చింది. గతేడాది చెల్లించినందున ఈసారి మినహాయింపు ఇవ్వాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ కోరుతోంది. ఇప్పటికీ 60% యాజమాన్యాలు ఈఓపీ తీసుకోలేదు. మరోవైపు వెబ్‌ ఐచ్ఛికాలు జులై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.