• facebook
  • whatsapp
  • telegram

Admissions: విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారు!

నగరంలో తగ్గుతున్న ప్రవేశాలు
పాఠశాలల్లో సర్వేలు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో జనవరిలోనే ప్రవేశాలు ముగుస్తున్నా.. ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవంటూ ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ గత విద్యా సంవత్సరంతో పోలిస్తే 1.09 లక్షల మంది తగ్గారు. 2022-23లో హైదరాబాద్‌ జిల్లాలో 3165 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9.80 లక్షల మంది విద్యార్థులుండగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8.71 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఏటా ప్రవేశాలకు డిమాండ్‌ పెరుగుతున్నా..  విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడంతో హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు ఇలా ఎందుకు జరుగుతోందన్న అంశంపై పాఠశాలల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుదలను పరిశీలిస్తున్నారు.
మానేస్తున్నారా?.. ఇతర జిల్లాల బడులకు వెళ్లారా?
హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య తగ్గడంపై విద్యాశాఖ అధికారులు కొన్ని పాఠశాలలకు వెళ్లి వివరాలను సేకరించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎంతమంది ఉన్నారు? ఆరోతరగతిలో ఎంతమంది ఉన్నారు?.. తగ్గారా?.. పెరిగారా? అని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆరో తరగతిలో 200 మంది విద్యార్థులుంటే.. వారంతా పదో తరగతి వరకు అదే స్కూల్‌లో చదువుకున్నారా?.. బడి మానేశారా?..ఇతర జిల్లాల పాఠశాలలకు వెళ్లారా?..అన్న అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 1.35 లక్షల మంది విద్యార్థులు చదువుకోగా.. ఈ ఏడాది 1.10 లక్షల మంది మాత్రమే చదువుకుంటున్నారు. 25 వేల మంది తగ్గడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు తగ్గుతుండడం వెనుక కాలనీలు, మురికివాడల్లో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేరుతున్నారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అల్పాహారం.. మధ్యాహ్న భోజనం  
సర్కార్‌ స్కూళ్లల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు, వారిని సక్రమంగా పాఠశాలలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందిస్తోంది. జిల్లా, మండల స్థాయిల్లో విద్యాశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో 40 పాఠశాలల్లో మాత్రమే అల్పాహారం అందిస్తోంది. జిల్లాలోని అన్ని బడుల్లో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వనున్నారు. ఈ నెలాఖరు వరకు సర్కార్‌ బడుల్లో విద్యార్థుల సంఖ్యపై సర్వే నిర్వహించనుంది. అనంతరం విద్యార్థుల సంఖ్య పడిపోవడంపై కారణాలను క్రోడీకరించి నివేదికను రూపొందించనున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ డిగ్రీతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటిలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.