• facebook
  • whatsapp
  • telegram

Teachers: ఉపాధ్యాయులకు అప్రెంటిస్‌షిప్‌

* డీఎస్సీ-2024లో అమలుకు ఉత్తర్వులు

* మొదటి ఏడాది ఆయా పోస్టుల బేసిక్‌లో 50%, రెండో ఏడాది 60% గౌరవ వేతనం

* 12 ఏళ్ల కిందట రద్దయిన విధానాన్ని మళ్లీ తీసుకొచ్చిన జగన్‌ సర్కారు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు కోరితే.. సీఎం జగన్‌ వారికి దిమ్మతిరిగేలా షాక్‌ ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఆయన రివర్స్‌ విధానమే పాటించారు. ఎప్పుడో 12 ఏళ్ల కిందట రద్దయిన అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని ఇప్పుడు డీఎస్సీ కోసం తీసుకొచ్చారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రెండేళ్లపాటు వెట్టిచాకిరి చేయాల్సిందే. డీఎస్సీ-2024లో భర్తీ చేయనున్న 6,100 పోస్టులకు ఎంపికయ్యేవారు రెండేళ్లపాటు అప్రెంటిస్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని.. ఈ సమయంలో గౌరవ వేతనం ఇస్తామని పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరిల్లోని బేసిక్‌లో 50 శాతం, రెండో ఏడాది 60 శాతం గౌరవవేతనం ఇవ్వనుంది. అప్రెంటిస్‌షిప్‌ పూర్తయ్యాక రెగ్యులర్‌ స్కేల్‌ ఇస్తామని వివరించింది. అప్రెంటిస్‌షిప్‌ సమయంలో ఇంటర్నేషనల్‌ బకలారియెట్‌ (ఐబీ) కరిక్యులమ్‌, పెడగాజీ, బోధనలో డిజిటల్‌ టెక్నాలజీ అమలు, టోఫెల్‌లాంటి మదింపులో నిపుణత, ఆంగ్లమాధ్యమం బోధించడంలో నిపుణతపై శిక్షణనివ్వనున్నట్లు పేర్కొంది. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన సీఎం జగన్‌.. కేవలం 6,100 పోస్టులనే ప్రకటించి.. దీంట్లో అప్రెంటిస్‌షిప్‌ విధానం తీసుకురావడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏళ్ల తరబడి పోరాడి ఈ విధానాన్ని రద్దు చేయించుకున్నాయి.

పొరుగుసేవల జీతమే..

అప్రెంటిస్‌షిప్‌ సమయంలో పొరుగుసేవల సిబ్బందికి వచ్చే గౌరవ వేతనానికి కొంచెం అటుఇటుగానే వేతనం అందుతుంది. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) బేసిక్‌ 32,670గా ఉంది. ఇందులో 50 శాతమంటే రూ.16,335 మొదటి ఏడాది ఇస్తారు. రెండో ఏడాది రూ.19,602 ఇస్తారు. స్కూల్‌అసిస్టెంట్లు, టీజీటీలకు రూ.22,285, రూ.26,742 చొప్పున వస్తాయి. పీజీటీలకు రూ.24,220, రెండో ఏడాది రూ.29,064 గౌరవ వేతనం వస్తుంది. ఉద్యోగుల జీవితాలతో 11వ పీఆర్సీతో మొదలైన జగన్‌ సర్కారు ఆట కొనసాగుతూనే ఉంది. మొదట ఉద్యోగులకు లభిస్తున్న ప్రయోజనాల్లో కొన్నింటిని రద్దు చేయడం, తర్వాత ఉద్యోగ సంఘాలు కోరితే వాటిల్లోనుంచే కొన్ని ఇచ్చి మేలు చేసినట్లు నటించడం జగన్‌కే చెల్లింది. ఉన్న ప్రయోజనాలనే తొలగిస్తే ఉద్యోగులు కొత్తవి అడిగే పరిస్థితి ఉండదు. తొలగించినవే ఇవ్వాలని కోరుతారు. దీంతో కొత్తవి ఇవ్వాల్సిన అవసరం రాదు. పీఆర్సీ సమయంలో మధ్యంతర భృతి (ఐఆర్‌)కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇచ్చారు. క్వాంటమ్‌ పెన్షన్‌ కోత వేశారు. ఇంటి అద్దెభత్యం తగ్గించేశారు. అసలు పీఆర్సీ కమిషన్‌ ఇచ్చిన నివేదికనే బయట పెట్టలేదు. దీంతో పాతవే అమలుచేయండని అభ్యర్థించాల్సి వచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం రాక చివరకు ఆ మేరకు విన్నవించే పరిస్థితినీ సర్కారు తెచ్చింది.

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని యాజమాన్యాల్లో ఎస్జీటీ 2 వేలు, స్కూల్‌ అసిస్టెంట్లు 2,060, ఆదర్శ పాఠశాలల్లో ప్రిన్సిపళ్లు 15, పీజీటీలు 23, టీజీటీ 248, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రిన్సిపళ్లు 4, పీజీటీలు 53, టీజీటీ 118 పోస్టులున్నాయి. సాంఘిక సంక్షేమంలో టీజీటీ 386, బీసీ సంక్షేమ ప్రిన్సిపళ్లు 23, పీజీటీ 81, టీజీటీ 66, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ 226, టీజీటీ 280, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌లో పీజీటీ 58, టీజీటీ 446, వ్యాయామ ఉపాధ్యాయులు 13 పోస్టులు ఉన్నాయి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అణు శక్తి కేంద్రంలో ఉద్యోగావకాశాలు

‣ కోర్టులో క్లర్క్‌ కొలువులు

‣ నవరత్న కంపెనీలో అవకాశాలు

‣ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.