విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Medical colleges: కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం

  • ఎనిమిదిలో ఆరింటికి అనుమతి ఇచ్చే అవకాశం
  • తాజాగా వర్చువల్‌ తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) ఆన్‌లైన్‌లో తనిఖీలను నిర్వహించింది. బోధన సిబ్బంది విషయమై కొన్ని కొత్త కాలేజీల పట్ల సంతృప్తి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. 

ఈ ఏడాది ప్రతిపాదించిన 8 కొత్త వైద్య కళాశాలల్లో కనీసం 6 వైద్యకళాశాలల అనుమతులకు మార్గం సుగమం అవుతోందని, మరో కాలేజీకి కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. వారం కిందట ఎన్‌ఎంసీ నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో.. ప్రతి కొత్త వైద్యకళాశాలలో 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలని నిబంధనల్లో నిర్దేశించింది. తాజా బదిలీల్లో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ నియామకాలను చేపట్టింది. తాజాగా బదిలీలు జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో ప్రధానంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రతిపాదిత కాలేజీల్లో కొందరు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించింది.

ఒక్కో కళాశాలకు 50 సీట్ల ప్రతిపాదన
రాష్ట్రంలో ఈ ఏడాది నారాయణపేట, గద్వాల, ములుగు, మెదక్, నర్సంపేట, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదాద్రి భువనగిరిలో కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. 8 వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దరఖాస్తు చేసుకుంది. ఒక్కో వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్‌ సీట్లను ప్రతిపాదించింది. ఇవి ప్రారంభమైతే కొత్తగా 400 సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు ముందు కొత్త కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు మాత్రం ఉండగా మిగిలిన బోధన సిబ్బంది పూర్తిగా లేని పరిస్థితి. ప్రాథమిక తనిఖీల నేపథ్యంలో 2 వారాల కిందట 8 వైద్య కళాశాలలకు అనుమతులను నిరాకరిస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.

 ఈ నెలాఖరులోపు నిబంధనల మేరకు బోధన సిబ్బంది, ఇతర వసతులు కల్పించకుంటే వాటికి అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదంది. కళాశాలల ప్రారంభం సమయానికే పూర్తి స్థాయిలో కనీసం 220 పడకలు ఉండటంతో పాటు రోగులకు వైద్య సేవలు అందాలని స్పష్టం చేసింది. నీట్‌ - యూజీ ఫలితాలపై స్పష్టత వస్తున్న నేపథ్యంలో ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభానికి అవకాశం ఉండటంతో ఈ ఏడాది ప్రారంభించాల్సిన కొత్త కాలేజీలపై కూడా ఎన్‌ఎంసీ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నర్సంపేట సహా భవనాలు సిద్ధమైన ప్రతిపాదిత వైద్యకళాశాల భవనాల్లో ఆసుపత్రులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు ఇతర సిబ్బందిని అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించేందుకు చర్యలు చేపట్టారు.

Updated at : 27-07-2024 13:06:01

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం