విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Nara Lokesh: ‘విద్యా కానుక’ అమలు చేస్తాం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. విద్యా కానుక కింద ఇచ్చే బ్యాగ్‌ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. పథకం అమలుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేశ్‌ జులై 16న సమాధానమిచ్చారు. 

‘‘గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్‌లు నాణ్యతా లోపం కారణంగా చిరిగిపోయాయి. బ్యాగ్‌లు, బెల్టులపై పార్టీ రంగులు వేసుకుంది. ఆ పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థులకు అందించే యూనిఫాంలో ఏ రంగులు ఉంటే బాగుంటుంది? అనే విషయమై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించాం’’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి విద్యాకానుక కింద అందించే కిట్లను టెండర్లు లేకుండా కొనుగోలు చేసిందని, దీనిపై విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

విద్యార్థుల సంఖ్య తగ్గింది.. ఖర్చు పెరిగింది
‘‘విద్యా కానుక పథకాన్ని 2021 - 22లో 46,22,795 మంది విద్యార్థులకు అందిస్తే.. 2023-24 నాటికి వారి సంఖ్య 38.26 లక్షలకు తగ్గింది. ఈ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 7.90 లక్షలు తగ్గిందనే భావించాలి.  దీనికి చేసే ఖర్చు మాత్రం రూ.253 కోట్లు పెరిగింది. విద్యాకానుక కిట్‌ల కొనుగోలులో అక్రమాలు జరగడంతో ధరలు పెరిగాయి’’ అని లోకేశ్‌ వెల్లడించారు.

బైజుస్‌తో ఒప్పందంపై సమీక్ష
‘‘బైజుస్‌ కంపెనీ దివాలా తీసింది. ఈ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? అనేది కూడా పరిశీలిస్తాం. బైజుస్‌ అందించిన మెటీరియల్‌లో కంటెంట్‌ ఏంటి? దాన్ని ఎంత మంది విద్యార్థులు వినియోగించారు? బైజుస్‌ కిట్‌ అందించిన విద్యార్థులు.. ఇవ్వని వారికి మధ్య అభ్యసనంలో వచ్చిన వ్యత్యాసం ఏంటి? అనేది పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు ట్యాబ్‌లు అందించడం వల్ల ఎంత మేరకు ప్రయోజనం చేకూరింది? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తాం. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించి, వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తే యథావిధిగా అమలు చేస్తాం’’ అని చెప్పారు. ట్రిపుల్‌ ఐటీల్లో అనేక సమస్యలు ఉన్నాయని లోకేశ్‌ తెలిపారు.

ఉపాధి కల్పించే కంపెనీలకే ప్రాధాన్యం
‘‘యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్న హామీకి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నా పరిధిలో ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా. ఫ్యాన్సీ కంపెనీలు కాదు.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కంపెనీలు తీసుకురావాలని చెప్పా. ఆ సంస్థలు కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ప్రోత్సాహకాలను చెల్లిస్తాం’’ అని పేర్కొన్నారు.


 

Published at : 27-07-2024 13:07:45

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం