• facebook
  • whatsapp
  • telegram

ఐటీలో నిలవాలంటే.. ఈ సామర్థ్యాలు తప్పనిసరి

జాబ్‌ స్కిల్స్‌ 2024 వివరాలుకేవలం సాంకేతిక నైపుణ్యాలతోనే గట్టెక్కే రోజులు మారాయి. వాటితో పాటు సాధారణ సామర్థ్యాలు కూడా ఉన్న అభ్యర్థులే  సెలక్షన్స్‌ జాబితాలోకి చేరుతున్న కాలమిది! అందుకే ఏ ఉద్యోగానికి ఏ సాంకేతిక నైపుణ్యం కావాలో తెలుసుకొని, నేర్చుకోవడంతో పాటు ఈ తరహా సామర్థ్యాలపైనా దృష్టి నిలపాలి. అప్పుడే ఆశించిన ప్యాకేజీతో కోరుకున్న కొలువు ఆఫర్‌ లెటర్‌ అందుకోవచ్చు!


గాలివాన వస్తే కలకాలం ఉండిపోదు. చెలరేగే తుపాను బీభత్సం చిరకాలం నిలిచిపోదు. సాధారణ పరిస్థితుల్లో వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. మనల్ని ముందడుగు వేయమని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అందుకే మనం ప్రతికూల పరిస్థితులకు బెదిరిపోము. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అందుకు తగ్గట్టు సిద్ధమవుతాం. ఇది తాత్కాలికమని మనకు తెలుసు. శాశ్వతం ఏమిటంటే సుస్థిరంగా సాగే ఎదుగుదలే. ఇదే మనకు ప్రాణ వాయువు.


ప్రస్తుత ఐటీ జాబ్‌ మార్కెట్‌ కూడా ఇంతే. ఉద్యోగావకాశాల్లో ఒడుదొడుకులు, ఆటుపోట్లు ఎల్లకాలం ఉండేవి కావు. మార్కెట్‌ పరిస్థితులు సద్దుమణుగుతూ మన ప్రస్థానం సాగుతూనే ఉంటుంది. ఎప్పటిలాగే భారత ఐటీ మార్కెట్‌ 2021-2031 సంవత్సరాల మధ్య పదేళ్లలో 25 శాతం వృద్ధి సాధిస్తుందనే అంచనా ఈ రంగ స్థిరత్వం చెక్కుచెదరదని చెబుతోంది. ఈ పదేళ్ల ప్రయాణంలో తాత్కాలిక మార్కెట్‌ ఒడుదొడుకులను డిస్కౌంట్‌ చేయాలే తప్ప రూటు మార్చుకోవాల్సిన తలపోటు లేదు.


ఐటీ మార్కెట్‌ దేశంలో మరే ఇతర రంగం పెరగనంత వేగంగా ఎదుగుతోందంటే ఇది ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ తయారీ కార్యకలాపాలకే వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అంటే ఈ కిరీటం కోడింగ్‌కే దక్కుతుంది. ఐటీ కంపెనీల ఎదుగుదల గ్రాఫ్‌ను కోడింగ్‌ నిపుణులే ముందుకు మోసుకెళుతుంటారు. అందుకే, ఐటీ కంపెనీలు ఏ ఉద్యోగానికి గేట్లు మూసేసినా.. కోడింగ్‌ నైపుణ్యంలో గట్టిగా నిలబడేవారిని వట్టి చేతులతో వెనక్కి పంపవు. కనుకనే కల్లోల మార్కెట్‌లో చెల్లుబాటయ్యే నైపుణ్యంగా కోడింగ్‌  వెలుగొందుతోంది.


అక్షయపాత్రలాంటి కోడింగ్‌ వృత్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాల గురించి గత కథనాల్లో తెలుసుకున్నాం కదా. ఈ నేపథ్యంలో అందిపుచ్చుకోవాల్సిన సాధారణ లక్షణాలనూ గుర్తించాలి. కోడింగ్‌ ఉద్యోగాన్ని కల్పించడంలో నైపుణ్య స్థాయిదే పైచేయి  అయినప్పటికీ ప్యాకేజీ నిర్థÄరణలో పది సాధారణ సామర్థ్యాలు ప్రగాఢంగా ప్రభావం చూపుతున్నాయి.


ఏమిటా సామర్థ్యాలు? 


1. నిరంతర జిజ్ఞాస

విశ్వాంతరాళంలో ఏం జరుగుతోందన్న జిజ్ఞాసే  స్టీఫెన్‌ హాకింగ్‌ను ప్రపంచం మరిచిపోలేని సైంటిస్టుగా చేసింది. భూమ్యాకాశాల మధ్యగల శక్తి ఏమిటన్న ఆసక్తే ఐన్‌స్టైన్‌ను గొప్ప శాస్త్రవేత్తగా నిలిపింది. మహాసాగరాల ఆవల ఏమున్నదో తెలుసుకోవాలన్న ఉత్కంఠ కొలంబస్‌ను సాహస యాత్రికునిగా, కొత్త భూభాగాలను కనుగొన్న నావికునిగా మలిచింది.

సరిగ్గా ఈ తెలుసుకోవాలన్న కోరికే సాంకేతిక  నిపుణులనూ అందలం ఎక్కిస్తుంది. సాఫ్ట్‌వేర్‌  తయారుచేయాలన్నా, కొత్త ప్రోగ్రామ్‌ రాయాలన్నా ఆసక్తి నుంచే బీజం ప్రారంభమవుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న లక్షణమే అందుకు పునాది. ఆ ఆసక్తే లేకపోతే ఎంతటి కోడింగ్‌ ఘనాపాఠీలైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరున మొదలుపెట్టిన చోటునే నిలబడిపోతారు.


2. బేసిక్స్‌పై పట్టు

ప్రోగ్రామ్‌ రాయడమెలాగో తెలిసి ఉండటం వేరు. ఈ నైపుణ్యంపై పట్టు ఉండటం వేరు. కోడింగ్‌ నేర్చుకోవడంతోనే ఆగిపోతే కేవలం ఎంట్రీ స్థాయి కొలువులకే పరిమితం కావాలి. ఒక నైపుణ్యంపై గట్టిపట్టు తెచ్చుకోడానికి తొలిమెట్టు- నేర్చుకోవడమైతే... ఆపై ఒక్కోమెట్టు ఎక్కేకొద్దీ ఆ స్కిల్‌పై పట్టు సాధించే దిశగా ముందుకు దూసుకుపోతున్నట్టే.

కోడింగ్‌లో ముందుకెళ్లాలన్న ఆలోచనా సరళి.. ఆసక్తి నుంచే మొదలవుతుంది. వేర్వేరు ప్రోగ్రామింగ్‌ అప్లికేషన్స్‌ను పరిశీలిస్తుంటే వాటి వెనుక ఉన్న కోడింగ్‌ ఏమై ఉంటుందన్న జిజ్ఞాస జనించాలి. మనం రోజూ చూసే ట్రాఫిక్‌ సిగ్నల్స్, స్మార్ట్‌ టీవీలను గమనిస్తున్నప్పుడు వాటిలో ఇమిడివున్న కోడింగ్‌ ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలగాలి. మనం వినియోగించే అన్ని యాప్స్‌ కూడా కోడింగ్‌ ఆధారంగా పనిచేసేవే. యాప్స్‌ ఉపయోగిస్తున్నప్పుడు వాటి గమనాన్ని నిర్దేశించే ప్రోగ్రామింగ్‌పై దృష్టి పెట్టాలి.


3. నిత్య సాధన

కోడింగ్‌ అనేది తర్కం (లాజిక్‌) ఆధారంగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. చదవడంవల్లనో, చూడటం వల్లనో కాకుండా తర్క ఆధారిత సమస్యలను విస్తృతంగా సాధన చేయడం ద్వారానే లాజిక్‌ను పట్టుకోగలం. ఉద్యోగార్థుల్లో చాలామంది ఏ పొరపాటు చేస్తారంటే.. కోడింగ్‌ నేర్చుకున్న తర్వాత దీర్ఘకాలం ఎటువంటి సాధనా చేయరు. ప్లేస్‌మెంట్‌ ఎంపికల్లో టెక్నికల్‌ రౌండ్‌ సందర్భంలో కోడింగ్‌ను ఎదుర్కోలేక చతికిలపడతారు. లాజిక్‌ను అర్థం చేసుకోవడానికి అద్భుతమైన తెలివి తేటలతో పని లేదు. కేవలం శ్రద్ధతో, ఆసక్తితో ప్రాక్టీస్‌ చేయడం వల్ల మంచి ఫలితం సాధించవచ్చు.


4. ప్రాజెక్టుల కసరత్తు

కోడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సాధనకు రెండు మార్గాలున్నాయి. మొదటిది- ప్లేస్‌మెంట్‌కు వచ్చే కంపెనీ గత ప్లేస్‌మెంట్స్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లో లభ్యమైతే వాటిని సాధన చేయడం. రెండోది- కోడింగ్‌పై వివిధ రకాల ప్రాజెక్టులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లభ్యమయ్యే ప్రాజెక్టులను డౌన్‌లోడ్‌ చేసుకొని, వాటిపై కసరత్తు చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. అయితే ఇతర సోర్స్‌లపై ఆధారపడేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. అభ్యర్థి అనుసరించే నమూనా ప్రాజెక్టులు ప్రస్తుతం కంపెనీలు తమ టెస్టుల్లో అడుగుతున్న నమూనాలకు దగ్గరగా ఉన్నాయో, లేదో చూసుకుంటుండాలి. లేకపోతే పాత నమూనాలను, గత ప్రాజెక్టులను ఫాలో అయితే తీరా టెస్టులో అడిగేవి భిన్నంగా ఉంటే విఫలమవుతారు. 


5. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్‌ 

కోడింగ్‌ నైపుణ్యం అలవడాలంటే ప్రధానంగా- డేటా స్ట్ర్టక్చర్స్, అల్గారిథÇమ్స్‌పై లోతైన అవగాహన పెంచుకోవాలి. సమాచారం పెద్ద జలరాశిగా కనిపిస్తున్నప్పటికీ గందరగోళపడకుండా, ఆ సమాచార స్రవంతిలో అంతర్లీనంగా దాగివున్న నిర్మితులను (స్ట్రక్చర్స్‌) అర్థం చేసుకునేందుకు కృషిచేయాలి. వాటిని నడిపిస్తున్న అల్గారిథమ్స్‌పై కూడా అవగాహన చేసుకోవాలి. ఇలా వీలున్నన్ని స్ట్రక్చర్స్‌ అల్గారిథమ్స్‌ను అర్థం చేసుకోవడంవల్ల కొత్త కోడ్‌లను రాసే సామర్థ్యం అలవడుతుంది.


6. పొరపాట్ల నుంచి పాఠాలు

తప్పు చేయడం మానవ సహజం. అయితే చేసిన తప్పును మరోసారి చేయకపోవడం వివేకవంతుల లక్షణం. స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, లాజిక్‌లను అర్ధం చేసుకొని కోడ్‌ నమూనాలు రాయడం మొదలుపెట్టాక పొరపాట్లు జరుగుతాయి. వాటిని వెంటనే పునస్సమీక్షలో గుర్తించడమూ.. ఆ తప్పులు ఎందుకు జరిగాయో గ్రహించి మళ్లీ అటువంటివి చేయకుండా కోడ్‌ రాయగలిగితే అడుగులు ముందుకు పడుతున్నట్టే. చాలామంది ఉద్యోగార్థులు జరిగిన పొరపాటుకు కారణం అన్వేషించే ఓపిక లేక చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ చివరికి ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు.


7. తాజాగా.. ఎప్పటికప్పుడు 

పోటీ ప్రపంచంలో ఉద్యోగార్థి నిత్య చైతన్యవంతంగా ఉండాలి. ప్లేస్‌మెంట్‌ టెస్టుల్లో కోడింగ్‌ స్కిల్లే ప్రధానం కాబట్టి వివిధ కంపెనీలు సంధిస్తున్న కోడింగ్‌ నమూనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఏ కంపెనీ కొత్తగా ఛాలెంజ్‌ వంటి ఏ కోడింగ్‌ మోడల్‌ ఇచ్చినా దాన్ని వెంటనే పరిశీలించాలి. దానిలో ఇమిడివున్న లాజిక్‌ను గుర్తించి, ఆపై అదే తరహా నమూనాలను ఎంపిక చేసుకొని సాధన చేయాలి. మొత్తమ్మీద వివిధ కంపెనీలు కోరుకుంటున్న కోడింగ్‌ మోడల్స్‌పై ఎప్పటికప్పుడు అభ్యర్థి అవగాహన పెంచుకుంటూ ఉండాలి! 


8. కోడింగ్‌.. డాక్యుమెంట్‌ 

కోడింగ్‌ అనేది చదివి వదిలేసే కాల్పనిక నవల కాదు. దాని వెనుక తర్కాన్ని అర్థం చేసుకొని, మళ్లీ అటువంటి కోడ్‌ను రాయవలసివస్తే సంసిద్ధంగా ఉండగలగాలి. అందుకే కోడింగ్‌పై సాధన చేశాక సాధ్యమైనంతవరకు దాన్ని డాక్యుమెంట్‌ చేయాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి- డాక్యుమెంట్‌ చేయడం వల్ల ఆ కోడింగ్‌ను మరచిపోలేరు. రెండోది- ఇలా వేర్వేరు కోడింగ్‌ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నందువల్ల ప్లేస్‌మెంట్‌ టెస్ట్‌లకు వెళ్లేముందు వాటిని వరుసగా చూసుకోవచ్చు. ఫలితంగా ఆత్మవిశ్వాసంతో టెస్టులు రాయగలుగుతారు.


9. ఇతరులకు బోధించడం

చదివింది అలాగే వదిలేస్తే జ్ఞాపకంలోకి చేరదు. చదివింది రాస్తే కొంతవరకు స్మృతిపథంలో నిక్షిప్తమవుతుంది. అదే.. చదివిందీ, తాను రాసిందీ మరికొందరికి బోధిస్తే ఆపై కలకాలం గుర్తుండిపోతుంది. బోధించే ప్రక్రియలో తనకు వచ్చింది గుర్తుకు తెచ్చుకోవడం, గుర్తుకురాని విషయాలను మళ్లీ తిరగేసి చూసుకోవడం, అర్థం కానిదాన్ని మరొకరిని అడిగి తెలుసుకొని స్పష్టత తెచ్చుకోవడం అనే దశలున్నాయి. వీటన్నిటినీ దాటి ఎదుటివారికి అర్థÄమయ్యేలా బోధించడంవల్ల సబ్జెక్ట్టుపై పట్టు వస్తుంది. కోడింగ్‌ విషయంలో ఈ సూత్రం బాగా పనిచేస్తుంది. తాను నేర్చుకున్న కోడింగ్‌ పాఠాలను మరో పదిమందికి చెప్పడం ఉద్యోగార్థికి లాభిస్తుంది.


10. నిరంతరం ఇదే ధ్యాస

ఐటీ రంగంలో కోడింగ్‌ ప్రాఫెషనల్‌గా ప్రవేశించాలనుకుంటున్న ఉద్యోగార్థి నిరంతరం అదే దృష్టితో ఉండాలి. అదే ధ్యాసతో సాధన చేయాలి. ఏ వెబ్‌సైట్‌ వీక్షించినా, ఏ యాప్‌ను వినియోగించినా, ఏ పరికరాన్ని పరిశీలించినా దానిలో ఇమిడివున్న ప్రోగ్రామ్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తుండాలి. వాటి గమనానికి కారణమైన కోడింగ్‌ను గుర్తించాలి. వెంటనే ఆ తరహా కోడింగ్‌ నమూనాలను సాధన చేయాలి. ఇలా నిరంతరం అదే దృష్టితో ఉండటం వల్ల ప్లేస్‌మెంట్‌ టెస్టులను ఉత్సాహంగా ఎదుర్కోగలుగుతారు.

ఇప్పటివరకు ప్రస్తావించిన పది అంశాల్లో కోడింగ్‌లో ఉద్యోగ కిరీటధారి కావాలంటే సహకరించే సాధారణ, సాంకేతిక సామర్థ్య అంశాలున్నాయి. వీటన్నింటి వెనుక ఉన్నది.. కోడింగ్‌ కెరియర్‌లో ప్రవేశించాలన్న కాంక్ష బలంగా ఉండాలని చెప్పడమే. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు సాంకేతిక, సాధారణ సామర్థ్యాలు ఐటీ జాబ్‌కి నిచ్చెన మెట్లవుతాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Posted Date: 10-04-2024


 

కోడింగ్‌

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం